ఎదిగే కొద్దీ మొక్క ఒదిగి ఉంటుంది. ఇది పదవుల్లో ఉన్న నేతలకు… వారి బంధువులకు వర్తిస్తుంది. వారే ఇంకా ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. మాట్లాడే మాట.. చేసే చేతలు పార్టీకి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ.. తమంతటి వారు లేరని విర్రవిగితే చిక్కుల్లో చిక్కుకోక తప్పదు. అంతేకాదు.. సొంత పార్టీని ఇబ్బందుల్లో పెడతారు. అలాంటి ముగ్గురు నాయకుల చుట్టూనే ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైసీపీలో చర్చ జరుగుతోంది. వారే రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.. ఇంకొకరు ఎమ్మెల్సీ అనంతబాబు.. మూడో వ్యక్తి మంత్రి పినిపె విశ్వరూప్ తనయుడు కృష్ణారెడ్డి. ఒకరు ప్రభుత్వ ఉద్యోగులపై చెయ్యి చేసుకుంటుంటే.. ఇంకొకరు ఏకంగా హత్య కేసులో ఇరుక్కున్నారు. మంత్రి తనయుడు సొంత పార్టీ వారిపైనే ఫోన్‌లో బూతు పురాణం అందుకున్నారు. తమ చర్యలతో పార్టీకి కూడా డ్యామేజ్ కలుగుతుందనే ఆలోచన లేకుండా ప్రవర్తించడంపైనే ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు తీరు అధికారపార్టీని ఇరకాటంలో పడేసింది. దీంతో అనంతబాబు అరెస్ట్ కాగానే.. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ. డ్రైవర్‌ను హత్య చేయడమే కాకుండా.. మృతదేహాన్ని అతని తల్లిదండ్రుల దగ్గరకు తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసిన హడావిడిని వైసీపీ పెద్దలు సీరియస్‌గా పరిగణించినట్టు చర్చ జరిగింది. ఈ సమస్యను విపక్షాలు రాజకీయ అస్త్రంగా మార్చడంతో రచ్చ రచ్చ అయింది. ఈ సమస్యపై చర్చ నలుగుతుండగానే.. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎపిసోడ్ దుమారం రేపింది.
పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ఇరిగేషన్ AEE సూర్య కిరణ్ చెంప చెల్లుమనిపించారు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. బాధిత అధికారి ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కలకలం రేగింది. చివరకు పార్టీ పెద్దల ఆదేశాలతో… అర్ధరాత్రి బాధిత అధికారితో ఎమ్మెల్యే రాజీ చేసుకోక తప్పలేదు. గతంలోనూ ఎమ్మెల్యే రాజాపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. వాటిని గుర్తు చేస్తూ మరోసారి రాజా తీరును చర్చల్లో పెట్టాయి రాజకీయ వర్గాలు.
ఇక అమలాపురం అల్లర్లలో మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిని తగలబెట్టారు ఆందోళనకారులు. ఆ ఘటనపై ఒకవైపు పోలీసు విచారణ జరుగుతోంది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇంతలో మంత్రి విశ్వరూప్ తనయుడు కృష్ణారెడ్డి ఫోన్‌లో వైసీపీకే చెందిన MPTC సత్తిబాబును బూతులు తిట్టడం దుమారం రేపింది. ఈ ఫోన్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పార్టీ వర్గాలు ఇరకాటంలో పడ్డాయి. ఎంపీటీసీని చంపేస్తాననే విధంగా మంత్రి తనయుడు బెదిరించడాన్ని అధికారపార్టీ వర్గాలే విస్మయం చెందాయి.
అధికారంలో ఉంటే ఏం చేసినా.. ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనే విధంగా ప్రజాప్రతినిధులు.. వారి తనయుల ప్రవర్తన ఉండటంతో అధికారపార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కఠిన చర్యలు తీసుకుంటూనే.. గ్రౌండ్‌లెవల్లో పార్టీ డ్యామేజ్ కాకుండా జాగ్రత్త పడ్డుతోంది. మరి.. దుందుడుకు నేతలకు కళ్లెం వేసేందుకు పార్టీ పెద్దలు చర్యలు చేపడతారో లేదో చూడాలి.