Nalgonda TRS : అక్కడ ఎమ్మెల్యేకు.. సొంతపార్టీకి చెందిన లోకల్ లీడర్లకు అస్సలు పడటం లేదు. సందర్భం ఏదైనా నిప్పు రాజేస్తోంది. ఇప్పుడు వినాయక విగ్రహాలు కూడా ఆ సమస్యల జాబితాలో చేరిపోయాయట. సయోధ్యకు కొందరు నేతలు ప్రయత్నించినా.. బెడిసికొట్టిందట. దీనికి ఎలా ముగింపు పలకాలో తెలియక ఆందోళన చెందుతున్నారట స్థానిక అధికారపార్టీ నేతలు. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.
నల్లగొండ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి మున్సిపాలిటీలోని టీఆర్ఎస్ కౌన్సిలర్లకు పడటం లేదు. ముఖ్యంగా నల్లగొండ టీఆర్ఎస్ అధ్యక్షుడితో విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. మొదట్లో ఇద్దరూ పాలు నీళ్లలా కలిసి ఉండేవారు. తర్వాత తేడాలు వచ్చాయట. మున్సిపల్ ఛైర్మన్ సీటును పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఆశిస్తే.. దానిని మరో అనుచరుడికి ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఇప్పించుకున్నారట. అలా ఇద్దరి మధ్య దూరం తెచ్చినట్టు చెబుతున్నారు. ఇంతలో వినాయక విగ్రహాల పంపిణీ రెండు వర్గాల మధ్య మరో రగడకు పునాది వేసింది.
వ్యతిరేకవర్గంలో ఉన్న నాయకులతో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సయోధ్యకు ప్రయత్నించారట. అది సక్సెస్ కాలేదట. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తామనే ప్రకటనలు వైరివర్గం నుంచి వస్తుండటంతో మరింత అగ్గి రాజుకుంటోందట. ఈ వేడిలో వైరివర్గం చేపట్టిన వినాయక విగ్రహాల పంపిణీ అధికారపార్టీలో రచ్చ రచ్చ అవుతోంది. గతంలో వినాయక విగ్రహాల పంపిణీ ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు భూపాల్‌రెడ్డి. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని ఆయన వైరివర్గం కూడా ఆచరిస్తోందట.
వినాయకచవితి దగ్గర పడుతుండటంతో.. అధికారపార్టీలోని రెండు వర్గాలు వినాయకుడినే నమ్ముకున్నాయి. గణేష్ విగ్రహాలను వాడవాడలా పంపిణీ చేసేందుకు ప్లాన్ వేస్తున్నారు. ప్రస్తుతానికి రెండు వర్గాలు లోలోన రుసరుసలాడుతున్నా.. రేపటి రోజున ఇంకేం జరుగుతుందో అని టీఆర్ఎస్ నల్లగొండ కేడర్ ఆందోళన చెందుతోందట. అసలే నల్లగొండలో వర్గపోరుతో సతమతం అవుతున్న సమయంలో రెండు పక్షాలు ఏ అంశాన్నీ విడిచి పెట్టడం లేదు. ఇప్పుడు గణేష్ విగ్రహాల వంతు వచ్చింది. దేవుడి ఆశీసులు.. ప్రజల అండతో వ్యవహారాలు చక్కబెట్టేస్తున్నారు నాయకులు.
చిన్న చిన్న పదవులు కాకుండా నేరుగా ఎమ్మెల్యే టికెట్ సంపాదిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని.. అందరిపైనా పైచెయ్యి సాధించొచ్చని నేతలు లెక్కలేస్తున్నారు. వెనక కాస్త డబ్బు ఉంటే చాలు ఆశాహవుల జాబితాలోకి ఎక్కేందుకు తహతహలాడుతున్నారు. మొన్నటి వరకు నల్లగొండలో టీఆర్‌ఎస్‌కు నేతల బలం ఎక్కువని సంబరపడినా.. ఆ నాయకులే ఇప్పుడు కుంపట్లు రాజేస్తున్నారు. దీనికి ఎమ్మెల్యే వైఖరి కూడా కొంత కారణమన్ని పార్టీ వర్గాల అభిప్రాయం. మొదటి నుంచి అందరినీ కలుపుకొని వెళ్లితే సమస్య వచ్చేది కాదని.. వివక్ష చూపడం వల్ల మొదటికే మోసం వస్తోందని చెబుతున్నారు. మరి.. తాజా విగ్రహాల రగడకు ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.