ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ వారి వ్యవహారాలు ఉప్పు నిప్పే. ఆ గొడవలు పక్కనపెట్టి సహపంక్తి భోజనాలు చేసినా.. ఆ ఆనందం మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. మళ్లీ పాత గొడవలు.. పాత పగలు.. వాళ్ల మధ్య గ్యాప్ పెంచేశాయట. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు. కొన్నాళ్లుగా నియోజకవర్గ టీడీపీలో రచ్చ రచ్చే. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వర్గాలకు అస్సలు పడటం లేదు. పరస్పరం ఆరోపణలు.. ప్రత్యారోపణలు.. విమర్శలు.. ప్రతి విమర్శలు.. అధిష్ఠానానికి ఫిర్యాదులు.. ఇలా గట్టిగానే కుంపట్లు రాజేస్తున్నారు. గతంలో ఎమ్మిగనూరులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రత్యేకంగా ఆఫీస్ ప్రారంభించడంపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు జయనాగేశ్వర్ రెడ్డి. ఆపై జయనాగేశ్వర్ రెడ్డితో విభేదించిన కొందరు కోట్ల వర్గంలో చేరారు. వారు కూడా ఇంఛార్జ్‌పై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంలో రెండు వర్గాలు రోడ్డెక్కి విమర్శలు చేసుకున్నాయి. తర్వాత ఏమైందో ఏమో.. ఒకరింటికి మరొకరు వెళ్లారు. సహపంక్తి భోజనాలు చేశారు. గొడవలు సర్దుకున్నాయి.. అంతా కలిసిపోయారు అనుకుంటున్న తరుణంలో పాత పగలు బుస కొట్టాయి.
ఎమ్మిగనూరులో తాజాగా కోట్ల, బీవీ వర్గాల కత్తులు దూస్తున్న పరిస్థితి. కోట్ల వర్గానికి చెందిన వారికి అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై కోట్ల వర్గం గుర్రుగా ఉందట. ఎమ్మిగనూరులో నిర్వహించిన టీడీపీ సమావేశంలో ఇంఛార్జ్ బీవీ .. కోట్ల పేరు ప్రస్తావించకుండా ఆయన వర్గంపై విమర్శలు చేశారు. పార్టీ వెంట, తన వెంట నడచిన కార్యకర్తలను మరచిపోనని, పార్టీ ఓడిన తర్వాత దొంగలు ఎవరో, నిజమైన కార్యకర్త లెవరో తనకు బాగా అనుభవమైందని తెలిపారు బీవీ. రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ అధిష్టానం తనకు అధికారికంగా సమాచారం పంపిందని ఆయన స్పష్టం చేశారు. దీంతో జయనాగేశ్వర్ రెడ్డికి టికెట్ ఖరారైందని ఆయన వర్గీయులు సంబరాలు చేసుకున్నారు. తనను వ్యతిరేకించి కోట్ల వర్గంలో చేరిన వారికి పరోక్షంగా హెచ్చరికలు వెళ్లాయట.
కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సైతం గోనెగండ్ల లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మిగనూరు టికెట్ ఖరారు అయినట్టు జయనాగేశ్వర్ రెడ్డి చేసిన ప్రకటనకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. సంబరాలు చేసుకున్నంత మాత్రాన టికెట్లు రాబోవని.. టికెట్లపై ఇపుడే నిర్ణయం తీసుకోబోరని.. ఇంకా సమయం ఉందని కోట్ల చెప్పారట. తాను టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పార్టీ సమావేశం నిర్వహిస్తానని, ఎవరూ అడ్డుకోలేరని పరోక్షంగా జయనాగేశ్వర్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు కోట్ల. మొత్తమ్మీద ఎమ్మిగనూరులో కోట్ల, జయనాగేశ్వర్ రెడ్డి మధ్య వర్గపోరు రసవత్తరంగా ఉందట. ఎన్నికల నాటికి ఈ పోరు ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.