మాజీ మంత్రి కుమారుడు ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి తప్పలేదు. ఓడాక.. పార్టీని, కేడర్‌ను ఆయన పట్టించుకోవడం లేదట. పైగా అధికారపక్షానికి దగ్గరవుతున్నారని గుర్రుగా ఉన్నారట తెలుగు తమ్ముళ్లు. ఇంకేముందీ.. ఆయన్ని పక్కన పెట్టేయాలని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట. ఆ రగడేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఓటమి తర్వాత హరికృష్ణ కనిపించలేదని కేడర్ ఆరోపణ!
చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు. ఈ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. నాయకత్వ లేమి కారణంగా ఇక్కడ పార్టీకి ఓటమి తప్పడం లేదు. గతంలో వేపంజరిలో వరసగా నాలుగుసార్లు గెలిచారు మాజీ మంత్రి కుతూహులమ్మ. 2009లో వేపంజరి రద్దయి జీడీ నెల్లూరు కొత్త నియోజకవర్గం వచ్చింది. జీడీ నెల్లూరు నుంచి కుతూహులమ్మ ఒకసారి గెలిచారు.
2014లో కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరినప్పటికీ ఆమెకు ఓటమి తప్పలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి కుతూహలమ్మను కాదని 2019లో ఆమె కుమారుడు హరికృష్ణకు ఏరికోరి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. కానీ.. ఆ ప్రయోగం ఫలించలేదు. వైసీపీ నుంచి నారాయణస్వామి గెలిచి ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత జీడీ నెల్లూరులో హరికృష్ణ కనిపించలేదన్నది టీడీపీ శ్రేణుల ఆరోపణ.
డాక్టర్ అనితా రాణి విషయంలో స్పందన లేదా?
జీడీ నెల్లూరు టీడీపీ ఇంఛార్జ్‌గా హరికృష్ణే ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు ఆయన హాజరు కావడం లేదట. దీంతో హరికృష్ణ టీడీపీలో ఉన్నారో లేరో తెలియదంటున్నారు తమ్ముళ్లు. నియోజకవర్గంలో డాక్టర్ అనితా రాణి వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఇలాంటి ఘటనలు జరిగినా ఆయన మాత్రం ఎక్కడా కనిపించలేదట. అనితా రాణి వివాదంలో నారా లోకేష్ ట్విట్టర్‌లో స్పందించారు. చంద్రబాబు మాట్లాడారు. హరికృష్ణ ఏమయ్యారో ఏమో తెలియదన్నది కేడర్ చెప్పేమాట.
హరికృష్ణపై టీడీపీ దళిత నాయకులు ఫైర్!
పంచాయతీ ఎన్నికల్లో నడిపించే నాయకుడు లేక పార్టీ పరిస్థితి మరింత దిగజారిందనే మాటలు కేడర్ నుండి వినపిస్తున్నాయి. వరసగా జరుగుతున్న ఘటనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇకలాభం లేదని తమ్ముళ్లు తమకు నాయకుడు కావాలంటూ.. మీడియా ముందు వచ్చి తమ గోడు వెళ్లగక్కారు. పార్టీ పెద్దలు.. జిల్లా నాయకత్వానికి చెప్పినా ప్రయోజనం లేకపోవడంతోనే బయటకు వచ్చినట్టు సమాచారం. ఎస్ఆర్ పురం మండలంలోని టీడీపీ ఆఫీస్‌లోనే నియోజకవర్గ దళిత నాయకులు హరికృష్ణపై ఫైర్ అయ్యారు.
వైసీపీ నేతలతో కుమ్మక్కు అయ్యారని ఆరోపణ!
టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా ఇంఛార్జ్ హరికృష్ణ మాట్లాడటం లేదన్నది శ్రేణుల ప్రధాన ఆరోపణ. అందుకే టీడీపీ ఇంచార్జ్‌గా ఆయన వద్దని చెబుతున్నారట. తమను పట్టించుకోకపోగా అధికారపార్టీకి హరికృష్ణ దగ్గరయ్యారని తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఇంఛార్జ్ వ్యక్తిగత పనుల కోసం.. వైసీపీ నేతలతో కుమ్మక్కు అయ్యారనే టాక్ ఓ రేంజ్‌లో వినిపిస్తోంది. అందుకే తమ్ముళ్లు ఈ విధంగా రియాక్ట్ అయ్యారని సమాచారం. పార్టీ కేడర్‌కు కొందరు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. జీడీ నెల్లూరు తెలుగు తమ్ముళ్లు శాంతించడం లేదట. మరి.. రానున్న రోజుల్లో పార్టీ శ్రేణులు ఇంకేవిధంగా ఓపెన్ అవుతాయో చూడాలి.
