Site icon NTV Telugu

అమిత్ షాతో భేటీలో టీ బీజేపీ నేతల అత్యుత్సాహం..!

పెద్దవాళ్ల దగ్గర ఎవరైనా ఎక్కువ తక్కువ చేస్తే.. ఏంటా కుప్పిగంతులు అంటారు. అదే ఓ స్థాయిలో ఉన్నవాళ్లు చేస్తే.. అంతా నవ్వి పోతారు. హస్తినలో ఆ పార్టీ నేతలు చేసిన పని అలాగే ఉందట. పెద్దాయన దృష్టిలో పడేందుకు.. మార్కులు కొట్టేసేందుకు తెగ తాపత్రయ పడ్డారట.

అమిత్ షా చిరు నవ్వులు చూడగానే నేతలు అడ్వాన్స్‌ అయ్యారా?

ముఖ్య నేతలంతా ఢిల్లీ రండి.. అమిత్‌ షా మాట్లాడతారని కబురు వెళ్లడంతో.. హస్తినలో వాలిపోయారు తెలంగాణ బీజేపీ నేతలు. పిలిచింది.. పార్టీ. తమతో మాట్లాడేది అమిత్ షా అని తెలియగానే ఢిల్లీకి క్యూ కట్టిన నాయకులంతా ఎవరి స్థాయిలో వాళ్లు హోంవర్క్‌ చేశారట. ఈ విషయంలో బీజేపీలోని కొత్త పాత నేతల తీరు ఒకేలా ఉందట. మీటింగ్‌లో అమిత్ షా చిరునవ్వులు చిందిస్తూ.. క్యా హాల్‌ హై అనగానే .. వాతావరణం బాగుందని.. కమలనాథులు అడ్వాన్స్‌ అయిపోయారట. అదే ఇప్పుడు కాషాయ శిబిరంలో చర్చ.

అప్పుడే బీజేపీలోకి వచ్చిన వారిలా అమిత్‌ షా ముందు నేతల ప్రవర్తన..!

వాస్తవానికి తెలంగాణ బీజేపీలోని కొందరు ముఖ్యనేతలతోనే అమిత్‌ షా భేటీ కావాలని అనుకున్నారట. చివరకు కొద్దిమంది జాబితా కాస్తా… చాంతాడంత అయిపోయింది. ఎంపీ, ఎమ్మెల్యేలతో అనుకున్న మీటింగ్‌లోకి జాతీయ కమిటీలో బాధ్యతలు ఉన్నవాళ్లందరినీ యాడ్‌ చేసేశారు. బీజేపీ సమావేశాల్లో రొటీన్‌కు భిన్నంగా ఫొటో సెషన్‌ నడిచింది. ఒకటో రెండో ఫొటోలు కాదు.. అంతా కెమెరాలకు ఫోజులిచ్చినవాళ్లే. పోటీపడి ఫొటోలు దిగేశారు. అమిత్ షాను కలిసిన వాళ్లు చిన్న నేతలేమీ కాదు.. అందరూ పెద్దలే. కీలక బాధ్యతల్లో ఉన్నవాళ్లే. కానీ.. అప్పుడే బీజేపీలోకి వచ్చిన వాళ్ల మాదిరి పార్టీ అగ్రనేత ముందు ప్రవర్తించారట.

అమిత్ షాను కలిసే ఛాన్స్‌ మళ్లీ వస్తుందో రాదో అన్నట్టుగా నేతల తీరు ఉందా?

షా దృష్టిలో పడాలని పోటీపడి.. ఆయన ముందు ఏదో ఒకటి మాట్లాడేందుకు పోటీ పడ్డారట తెలంగాణ బీజేపీ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒకటి చెప్పేందుకు తెగ ఉత్సాహం చూపించారట. ఆ అత్యుత్సాహం చూసిన తర్వాత కొందరు నాయకులు ఇదేంది.. అమిత్‌ షా మీటింగ్‌లో ఇలాగేనే ప్రవర్తించేది అని నొచ్చుకున్నట్టు సమాచారం. ఈ మీటింగ్‌ పూర్తికాగానే అమిత్ షాతో దిగిన ఫొటోలను ఆయా బీజేపీ నేతల సోషల్‌ మీడియా విభాగాలు పోటీపడి ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో పోస్టింగ్‌లు పెట్టాయి. అమిత్ షాతో ఏం మాట్లాడారో కొటేషన్ల కింద ఇచ్చారు. ఈ హడావిడి చూసిన పార్టీ శ్రేణులు నోరెళ్లబెట్టాయట. అమిత్‌ షాను మళ్లీ కలిసే ఛాన్స్‌ వస్తుందో రాదో అన్నట్టుగా పార్టీ నేతల తీరు ఉందని కాషాయ శిబిరంలోనే సెటైర్లు పేలుతున్నాయి.

క్రెడిట్‌ కోసం పాకులాడితే రియాక్షన్‌ మరోలా ఉంటుందా?

కేంద్ర హోంమంత్రిగా ఉన్న బీజేపీ అగ్రనేత అమిత్ షాకు.. తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియంది కాదు. కేవలం పార్టీ నేతల నుంచే అన్నీ తెలుసుకుంటున్నారని అనుకుంటే పొరపాటే అన్నది బీజేపీ వర్గాల మాట. అలాంటి పెద్ద నాయకుడి ముందు ఏది పడితే అది మాట్లాడేసి.. క్రెడిట్‌ కోసం పోటీపడితే.. ఆ ప్రభావం మరోలా ఉంటుందనే వాదన వినిపిస్తోంది. ఇప్పుడే ఏమీ తెలియకపోయినా.. రానున్న రోజుల్లో అది ఏ రూపంలో రియాక్షన్‌ ఇస్తుందో గుర్తించేలోపే కాలాతీతం అవుతుందని.. పార్టీలో అలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని చెవులు కొరుక్కుంటున్నారు. మరి.. తాజా ఢిల్లీ భేటీ ఎవరికి మోదం కలిగిస్తుందో.. ఎవరికి ఖేదంగా మారుతుందో చూడాలి.

Exit mobile version