ఎంపీ రఘురామరాజుకు ఆనారోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వాస్తవానికి మిశ్రమంగానే వుంది. బెయిల్ సమయంలో పత్రికకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని మీడియాతో మాట్లాడరాదని ఆంక్షలు పెట్టడమే గాక సిఐడి పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాని కోర్టు ఆదేశించింది. ఆయన ఆరోగ్యం సరిగా లేదు గనక సిఐడి కస్టడీలో వుంచి విచారణ జరపాల్సినంత అవసరం లేదంటూ ఇప్పటికే వారు వీడియోతో సహా సాక్ష్యాధారాలు సేకరించుకున్న సంగతి గుర్తు చేసింది. స్వయానా సిఐడి డిఐజినే ఎఫ్‌ఐఆర్‌కు ముందే దర్యాప్తు చేశారు గనక ఆయన నుంచి కస్టడీలో రాబట్టవసినంత అవసరం లేదని పేర్కొంది. అంతేగాని ఆయనపై 124(ఎ) కింద కేసు పెట్టడం గాని అరెస్టు చేయడం గాని తప్పు పట్టలేదు. ఇప్పటికే విమర్శలకు గురవుతున్న రాజద్రోహం ఆరోపణలు మోపడాన్ని ఆక్షేపించలేదు. ఎంపీ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగి కూడా కేసు కక్షపూరితం అంటూనే బెయిల్ కోసం మాత్రమే వచ్చామన్నారు. అరెస్టు జరిగి దాదాపు వారం గడిచింది గనక బెయిల్ ఇవ్వడం వూహించదగిందే.
ఎంపీని కస్టడీలో సిఐడి పోలీసులు కొట్టారన్నది కూడా ఈ విచారణ సందర్భంలో నిర్ధారణ కాకపోవడం మరో ముఖ్యాంశం. గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యుల నివేదికపై నమ్మకం లేదన్న ఎంపీ న్యాయవాది ఆయన తరపునే ఆర్మీ ఆస్పత్రిని కోరుకున్నారు. ఆర్మీ ఆస్పత్రి పరీక్షల తర్వాత ఇచ్చిన నివేదికలో కాలి వేలికి గాయం వున్నట్టు చెబుతూనే అది కొట్టడం వల్ల కలిగిందనే సూచన ఏదీ చేయలేదు. ప్రభుత్వ న్యాయవాది దుష్యంత్ దవే ఆ గాయం ఆయనే చేసుకుని వుండవచ్చునని ఆరోపించారు. పైగా గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్‌కు ఎంపీ తన స్వంత కారులోనే వచ్చారు గనక ఆ సమయంలో ఏమైనా జరిగివుండవచ్చునని అన్నారు, ఈ విషయంలోనూ సుప్రీం కోర్టు లోతుల్లోకి పోకుండా కస్టడీలో ఎంపీ పట్ల అనుచితంగాప్రవర్తించి వుండవచ్చుననేది తోసిపుచ్చలేమని సరిపెట్టింది. దీనిపై సిబిఐ విచారణ జరిపించాని ముకుల్‌రోహ్తగి అడిగినదానికి స్పందించలేదు. ఈ వారంరోజులోనూ ఎంపి కొట్టడంపై ప్రధానంగా చర్చ జరిగిన సంగతి గుర్తు చేసుకుంటూ ఆర్మీఆస్పత్రి నివేదిక తర్వాత కూడా ధర్మాసనం దానిని దాటవేయడం గమనించాల్సిన విషయమవుతుంది.
న్యాయమూర్తు వినీత్‌శరణ్, గవాయ్‌తో కూడిన ధర్మాసనం తన తీర్పులో ఇరువురు సీనియర్ న్యాయవాదుల వాదనను సమానంగానే ప్రస్తావించింది. బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు స్పందించి వుండాల్సిందని కూడా వ్యాఖ్యానించింది. వాస్తవానికి ఒకే కేసులో గుంటూరు సిఐడి కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ పలురకాల తీర్పు చెప్పడం గజిబిజికి దారితీసిన మాటా నిజమే. ఇప్పుడు బెయిల్‌పై విడుదలైన ఎంపి గతంలోవలె వివాదాస్పద విడియోలు చేసే అవకాశం వుండదని భావించాలి. కస్టడీలో కొనసాగించాలన్న ప్రభుత్వం సిఐడి ఆలోచన కూడా సాగదు. వైసీపీ ప్రభుత్వం రఘురామ వెనక టిడిపి వుందని అంటున్నాఅదృశ్య పాత్రధారిగా వున్న కేంద్ర బిజెపి ఏంచేస్తుందోచూడాలి. కేసుతో సంబంధం లేకుండా హోం మంత్రి, స్పీకర్, ఎంపి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. విచారణ జరుగుతుండగానే తనకు నివేదిక పంపాల్సిందిగా స్పీకర్ ఓంబిర్లా.. హోంశాఖను కోరారు. ఆయనకు గతంలో వై కేటగరీ ఇచ్చిన బిజెపి ఇప్పుడు మరే విధమైన జోక్యం చేసుకోదని చెప్పలేము.