NTV Telugu Site icon

తెలకపల్లి రవి : కాంగ్రెస్‌ నిజంగా ఇళ్లు చక్కదిద్దుకుంటుందా?

Congress

అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మరోసారి దెబ్బతిన్న కాంగ్రెస్‌ పార్టీ ఆలస్యంగా సమీక్ష ప్రారంభించింది. తాత్కాలిక అద్యక్షురాలు సోనియా గాంధీ ఆద్యక్షతన జరిగిన వర్కింగ్‌ కమిటీ వర్చువల్‌ సమావేశం మొక్కుబడిగా తప్ప లోతుగా పరిశీలన జరిపిందా అంటే లేదనే చెప్పాలి. ఈ ఎన్నికలో తమ పార్టీకి వచ్చిన పలితాలు చాలా నిరుత్సాహకరంగా వున్నాయని సోనియాగాంధీ వ్యాఖ్యానించడం మినహా మరే విధమైన  ఆత్మ విమర్శ కనిపించలేదు. కేరళలో అస్సాంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ కోరుకున్నది. పశ్చిమ బెంగాల్‌లో వామపక్షంతో కలసి పోటీ చేసి ప్రభావం చూపాలనుకున్నది.  కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఫిరాయింపులతో చేజారిన ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకోవలసింది. తీరా ఇందులో ఒక్క లక్ష్యాన్ని కూడా సాధించలేకపోయింది. తమిళనాడులో మాత్రమే అది కూడా స్టాలిన్‌ నాయకత్వంలోని డిఎంకె కూటమిలో భాగంగా వున్నందున పోటీ చేసిన 25లో 18 స్థానాలు తెచ్చుకోగలిగింది. అస్సాంలో ఇతర పార్టీలతో కలసి పోటీ చేసి గట్టిపోటీ  ఇచ్చినా సీట్లలో బిజెపిని అందుకోలేకపోయింది. కేరళలో ఎల్‌డిఎఫ్‌ యుడిఎప్‌ లు ఒకదాని తర్వాత ఒకటి వచ్చే సంప్రదాయం వున్నా సరే ఈ దఫా చతికిలపడింది, పినరాయి విజయన్‌ నాయకత్వంలో ఎల్‌డిఎప్‌ అసాధారణంగా మళ్లీ విజయం సాధించితే కాంగ్రెస్‌ ఒకస్థానం గతం కన్నా తక్కువగా తెచ్చుకుంది. బెంగాల్‌లోనైతే తృణమూల్‌ బిజెపిల ద్విముఖ పోరుగా మారిన ఎన్నికల్లో వామపక్షాలు గాని వాటితో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్‌ గాని  ఒక్కటంటే ఒక్క సీటు పొందలేకపోయాయి. పుదుచ్చేరిలోనూ బిజెపి ఎన్నార్‌ కాంగ్రెస్‌తో కలసి మొదటి సారి అధికారంలో భాగం పొందగలిగింది. ఇక్కడా కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించిన వారే బిజెపిగా పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్‌ బలహీనపడటం వల్లనే బిజెపి పెరుగుతున్నదనే అభిప్రాయం నానాట బలపడుతున్నది.

ఈ పూర్వరంగంలో తాజా దెబ్బల తర్వాత కాంగ్రెస్‌ అధిష్టానం సోనియా రాహుల్‌గాంధీలు సూటిగా జరిగిన పొరబాట్లను గుర్తిస్తారని  చాలామంది చూశారు. వాస్తవానికి గత ఆగష్టులోనే  గులాంనబీ ఆజాద్‌ కపిల్‌సిబాల్‌, ఆనంద్‌ శర్మ, శశిథరూర్‌ తదితరులు 23 మంది పార్టీని ప్రక్షాళన చేయాలని బహిరంగ చర్చ లేవనెత్తారు. రాహుల్‌గాంధీ రాజీనామా తర్వాత  ఇంతవరకూ పూర్తిస్థాయి అద్యక్షుడిని ఎన్నుకోలేకపోవడాన్ని కూడావారు విమర్శించారు. దానిపై దేశమంతటా పార్టీలో దుమారం రేగాక జనవరిలో సోనియాగాంధీ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరిపారు. జూన్‌ 23కు సంస్థాగత  ఎన్నికలు పూర్తిచేయాలని నిర్ణయించారు. కాని ఆ ప్రక్రియ పెద్దగా జరిగింది లేదు.  కోవిడ్‌ కారణంగా దాన్ని వాయిదా వేయాలని  సమావేశంలో అధికారికంగా నిర్ణయించారు. 

శాసనసభ ఎన్నికలో మన ఫలితాలు అంచనాల కన్నాచాలా దిగువన వుండిపోయాయని ఈ సమావేశంలో సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. మనం ఇళ్లు చక్కబెట్టుకోవడం అవసరమని గుర్తు చేశాయి అన్నారు. ఎన్నికల పలితాలపై పార్టీ ముఖ్యమంత్రులు, ఎన్నికలు జరిగిన రాష్ట్రా నాయకులు నిర్మొహమాటంగా మాట్లాడాలన్నారు. దీనిపై తాను ఒక చిన్న కమిటీని వేస్తానని అది వీలైనంత త్వరలో నివేదిక ఇస్తుందని ప్రకటించి  ఆ ఆంశం ముగించారు. ఇదంతా కాంగ్రెస్‌ ఆనవాయితీ ప్రకారమే జరిగిందని కొందరు నాయకులు అపహాస్యం చేశారు. రాహుల్‌గాంధీ స్క్రిప్టు లా వుందని కూడా అన్నారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో మోడీ ప్రభుత్వ వైఫల్యాలను సమావేశం విమర్శించింది. సెంట్రల్‌ విస్తా పేరిట నూతన పార్లమెంటు భవన సముదాయం నిర్మాణం వాయిదా వేయాలని కోరింది. విజయం సాధించిన స్టాలిన్‌, విజయన్‌, మమతను అభినందించింది.