టిడిపి సీనియర్ ఎంఎల్‌ఎ, పిఎసి చైర్మన్ పయ్యావుల కేశవ్ ఎపి ఆర్థిక నిర్వహణలలో 41వేల కోట్ల మేరకు అవకతవకలు జరిగాయని గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌కులేఖ రాశారు. కాగ్ తరపున లతామల్లికార్జున్ ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రావత్‌కు చాలా కాలం కిందటే రాసిన లేఖను తన ఫిర్యాదుతో జతచేశారు. ఈ 41 కోట్ల మొత్తానికి సంబంధించి సరైన లెక్కలు, రశీదులు వివరాలు లేవనిఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత దశలో కేంద్రం ఎపి ప్రభుత్వానికి రాసిన లేఖ ఒకటి విడుదలైంది. విభజన తర్వాత కూడా తెలంగాణ తరపున చెల్లించిన అప్పును తన పద్దులోచూపి ఎపి అనుమతించిన దానికన్నా ఎక్కువ అప్పు తెచ్చుకుందనేదానిపై కేంద్రం ఆ లేఖలో వివరణ కోరింది. మూడో పరిణామంగా రాష్ట్రానికి అప్పు పుట్టడం లేదని పరపతి పడిపోయిందని మరికొన్ని కథనాలు వచ్చాయి. గత ప్రభుత్వంలో భారీగా పెరిగిన అప్పు ఈ ప్రభుత్వ హయాంలో మరింత పెరగడం తెలిసినవిషయమే. 41వేల కోట్లు అవినీతి జరిగిందని తాను అనడం లేదని సరైన జాగ్రత్తలు పద్దతులు పాటించకపోతే అక్రమాలకు అవకాశం ఏర్పడుతుందని మాత్రమే హెచ్చరిస్తున్నానని పయ్యావుల ఒకటికి రెండు సార్లు చెప్పినా ఈ కథనాలు ఒకదాని వెంట ఒకటి రావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్తితిపై తీవ్రమైన సందేహాలు ఏర్పడ్డాయి.
మూడు నాలుగు రోజుల తర్వాత ఈ సమస్యపై స్పందించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. పిఎసి చైర్మన్ తన సందేహాలను అధికారుల నుంచి తెలుసుకోవడానికి బదులు గవర్నర్‌కు లేఖ రాయడం, మీడియాలో రకరకాల కథనాలు ఇవ్వడం ఏమిటని వ్యాఖ్యానించారు. ఈ సమస్యలన్నీ టిడిపి హయాంలో 2018 నుంచి ప్రారంభించిన సిఎప్‌ఎంఎస్ వల్లనే ఉత్పన్నమైనాయని ఆరోపించారు. ట్రెజరీ ద్వారా జరగాల్సిన లావాదేవీలలో ప్రతిదీ సిఎఫ్‌ఎంఎస్ ద్వారా ఆమోదం పొందాలని చెప్పిన నాటి ప్రభుత్వం దాని నిర్వహణ మాత్రం ప్రైవేటు సంస్థకు అప్పగించింది. చాల పద్దులను చూపించడానికి అందులో ఏర్పాట్లులేవు. ఈ ప్రభుత్వంలో జరిగిన ఖర్చులను చూపించడానికి అందులో అవకాశం లేకపోవడంతో మరో విధంగా చూపించి తర్వాత మళ్లీ సర్దుబాటు చేయవలసి వస్తుందని ఆ వివరాలన్నీవున్నాయని తెలిపారు. తాము ఈ వ్యవస్థను మెరుగుపర్చాలన్నా ఆ సంస్థ చాలా గడువు కోరుతున్నదని చెప్పారు. ఇక కేంద్రం నుంచి వచ్చే నిధులను మురిగిపోకుండా పిడి ఖాతాలలో వేసి తర్వాత బదలాయించడం ఎప్పుడూ జరిగేదేనని ఈ విధంగా పదివేల కోట్ల రూపాయాలకు పైగా వివరాలతో వున్నాయని తెలిపారు. రైతు భరోసాకు సంబంధించిన రెండువేల కోట్ల రూపాయలు కేంద్రం నిర్వహణలోని ఈకుబేర్‌లో నమోదు కానందున మరో పద్ధతిలో ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. లక్షన్నర వంటిచిన్న మొత్తం నుంచి వేల కోట్ల వరకూ ఏ పద్దు కూడా తప్పించుకునే అవకాశమే లేదని ఆడిటింగ్‌లో వచ్చే రకరకాల ప్రశ్నలు తప్పులనుకోవడం సరికాదని వివరించారు. తెలంగాణ తరపున కట్టిన అప్పును కూడా చూపించి ఎపి అదనపు అప్పు తెచ్చుకోవడం గురించి కేంద్రం రాసిన లేఖ సరికాదని, ఆ విధంగా జరగలేదని లెక్కలు చెప్పారు. టిడిపి హయాంలోనే ఆఖరి సంవత్సరంలో అలా అదనంగా తెచ్చుకుంటే తదుపరి ఏడాదిలోనే సర్దుబాటు చేశామని వెల్లడించారు. కోవిడ్ కారణంగా 2020,21 సంవత్సరాల్లో అప్పు కొంత పెరిగిన మాట నిజమే అయినా కేంద్రం చేసిన దానికన్నా రెండుశాతం తక్కువలోనే వున్నామని తెలిపారు. తాము అప్పు చేసినా సంక్షేమ పథకాల రూపంలోప్రజలకే చేరిందని కూడా సమర్థించుకున్నారు. టిడిపి హయాంలో కుదిరిన చాలా ఎంవోయూలు ప్రచారానికి మాత్రమేనని ఎద్దేవా చేశారు.
బుగ్గన సమాధానం తర్వాత కొద్ది సేపటికి పయ్యావుల మరోసారి మాట్లాడారు. పిఎసి చైర్మన్‌గాతాను 2000జూన్‌లో రాసిన లేఖకు ఇటీవలివరకూ సమాధానం రాలేదని ఆరోపించారు. ప్రభుత్వం తరపున గ్యారంటీ ఇచ్చిన అప్పుల మొత్తం తెలపాలని తాను అడిగితే బడ్జెట్‌పత్రాల్లోనే వున్నాయని సమాధానం ఇచ్చిసరిపెట్టారని కాని అందులో 21వేల కోట్లకు సంబంధించిన ఎస్క్ట్రూ అకౌంట్ వివరాలు లేవని విమర్శించారు. ఈ కారణంగానే తాను గవర్నర్‌కు లేఖ రాయాల్సి వచ్చిందన్నారు. ఆర్థిక మంత్రి తనను తేలిక చేసి మాట్లాడారని ఒక మేధావిగా ఆయన సూచించినట్టే ఢిల్లీలో ఈ విషయం చర్చకు పెడతామని ప్రకటించారు. మొత్తంపైన పద్దులనిర్వహణలో పద్ధతుల లోపాలనే తాను చెప్పానని అదే మంత్రి కూడా ఒప్పుకున్నారని కేశవ్ వ్యాఖ్యానించారు. అంటే ఈ ఫైనాన్స్ వార్ ముగిసినట్టే భావించాలా? లేక ఆయన లేవనెత్తిన కొత్త అంశాలు, ఢిల్లీ టూర్ తో మరింత కొనసాగించే ప్రయత్నం జరుగుతుందా?
