కాకినాడ సిటీలో తెలుగు తమ్ముళ్లు గందరగోళంలో ఉన్నారట. దానికి అక్కడ నేతల తీరే కారణమన్నది కేడర్ మాట. సామాజికవర్గాల వారీగా నేతలు సీన్ క్రియేట్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సీటు కోసం ఫీట్లు చేస్తు.. పరస్పరం కత్తులు దూసుకుంటున్నారట.
వనమాడి కొండబాబు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే. టీడీపీనేత.. ప్రస్తుతం నియోజకవర్గం ఇంఛార్జ్ కూడా. మరో టీడీపీ నేత సుంకర పావని. కాకినాడ మాజీ మేయర్. ప్రస్తుతం టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు. ఈ ఇద్దరి మధ్య రోజుకో పంచాయితీ టీడీపీ రాజకీయాలను ఆసక్తిగా మార్చేస్తున్నాయి. ఐక్య పోరాటాలు మానేసి.. ఉనికిని కాపాడుకునే పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో సీటు తమకంటే తమకని ప్రచారాన్ని ఊదరగొట్టేస్తున్నారట. తెర వెనుక గోతులు తీసుకుంటున్నట్టు సమాచారం.
వనమాడి కొండబాబు టీడీపీ నుంచి ఐదుసార్లు పోటీ చేస్తే.. రెండుసార్లే గెలిచారు. ఈసారి ఆయనకు టికెట్ రాదని.. ఎప్పుడో పార్టీ గాలి వీస్తే తప్ప గెలవలేని మాజీ ఎమ్మెల్యేకు ఎటువంటి ఇమేజ్ లేదని మాజీ మేయర్ పావని వర్గం ప్రచారం చేస్తోందట. ఈ దఫా గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తారని.. ఎన్నికలకు ముందు అన్ని సెట్ అవుతాయని ఆమె చెబుతున్నారట. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఏడాది పదవీకాలం ఉండగానే సుంకర పావని మేయర్ పదవిని కోల్పోయారు. టీడీపీ కార్పొరేటర్లు రెబల్స్‌గా మారి.. వైసీపీకి మద్దతివ్వడంతో ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఆ సమయంలో టీడీపీని వీడకపోవడంతో ఆమె మేయర్ పదవిని కోల్పోయారన్నది ఒక వాదన. పైగా టీడీపీ మేయర్ పదవి కోల్పోవడానికి పార్టీలోనే కొందరు కుట్ర చేశారని పావని వర్గం ఆరోపిస్తోంది. అప్పటి నుంచి వనమాడి.. పావని వర్గాల మధ్య రాజకీయం ఉప్పు నిప్పులా మారిపోయింది. ఈ విమర్శలకు కొండబాబు వర్గం కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. కలిసి పనిచేయడానికి అస్సలు ఇష్టపడటం లేదు.
2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం ఇప్పటి నుంచే రెండు వర్గాలు పావులు కదుపుతున్నాయి. కాకినాడ సిటీ నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 55 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 80 శాతం ఓటర్లు కాపు, మత్స్యకారులే. కొండబాబు మత్స్యకార సామాజివర్గానికి చెందిన నేత కాగా.. పావని కాపు సామాజిక వర్గం. ఇద్దరు నేతలు కూడా సామాజికవర్గాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారట. ఈసారి టికెట్ తమకే అని పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నారట. ఇద్దరూ పట్టుకునే జెండా ఒకటే అయినా ఎవరు శిబిరాలు వారివి అన్నట్టుగా తయారైంది. పైగా అటు వెళ్లిన నాయకులకు ఇటు ఎంట్రీ ఉండదని కామెంట్స్ పాస్ చేస్తున్నారట. మీరు మొన్న వాళ్లతో వెళ్లారు కదా.. ఇక మనకు సంబంధాలు ఉండబోవని ముఖం మీదే చెప్పేస్తున్నారట.
వరుసగా ఆరోసారి టిడిపి సీటు తనకేనని కొండబాబు ప్రచారం చేస్తుంటే.. ఈసారి కాకినాడ సిటీ చరిత్రలో తొలిసారి కాపు మహిళకు అవకాశం ఇస్తారని పావని చెబుతున్నారు. సోషల్ మీడియాలో సైతం ఇరువురు నేతలు అటాక్ చేసుకుంటున్నారట. దాంతో సైకిల్ పార్టీ లీడర్లకు, క్యాడర్‌కి ఏం చేయాలో తెలియక పార్టీ కార్యక్రమాలకు సైతం మెజార్టీ నేతలు దూరంగా ఉంటున్నారట. మొత్తానికి కాకినాడ పసుపు పార్టీలో ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు తయారైంది.