Off The record: ఆ నియోజకవర్గంలో టిడిపికి పట్టున్నా.. క్యాడర్‌ను నడిపించే నాయకుడు లేడు. అధికారంలో ఉండి కూడా… మాకు గుర్తింపు కావాలి మహాప్రభో అంటూ…కార్యకర్తలు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన దైన్యం. ఎన్నికల టైంలో మీరే దిక్కని చెప్పినవారిని ఇప్పుడు పార్టీ నేతలు మర్చిపోతున్నారా? లేక ఆ సెగ్మెంట్ మాకు అవసరం లేదని అనుకుంటున్నారా? ఏదా అసెంబ్లీ నియోజకవర్గం? ఎందుకు అలా మారిపోయింది?
Read Also: Off The record: తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరంపై యుద్ధానికి సిద్ధమవుతున్నారా?
భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కష్టాలు టీవీ సీరియల్‌ని తలపిస్తున్నాయట. పార్టీకోసం ఏళ్ళ తరబడి పనిచేస్తున్నా… ప్రాధాన్యత మాత్రం దక్కడం లేదని ఇక్కడి నాయకులు అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. అయినా వాళ్ళని పట్టించుకుని, గోడు వినే దిక్కు కూడా లేకుండాపోయింది. ఎన్నికలకు ముందు వరకు టిడిపి ఇంఛార్జిగా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. కానీ… పొత్తులో ఈ సీటు జనసేనకు వెళ్ళడం, ఆ పార్టీ అవకాశం ఇవ్వడంతో…వెంటనే సైకిల్ దిగేసి గ్లాస్ పార్టీలో చేరిపోయారు పులపర్తి. ఇక అప్పటి నుంచి నియోజకవర్గంలో టీడీపీని నడిపించేందుకు సరైన నాయకులు లేక.. కష్టం వస్తే పట్టించుకునే దిక్కులేక కేడర్ మధ్య కుమ్ములాటలు పెరిగిపోయినట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: Rahul Gandhi : ఓటు చోరీ కోసమే ఆ కొత్త చట్టాన్ని బీజేపీ తీసుకొచ్చింది
భీమవరం టిడిపిలో ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలే ఇందుకు ఎగ్జాంపుల్ అంటున్నారు. ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో కష్టపడినవారికి ప్రాధాన్యతకల్పించలేందంటూ నాయకులు రోడ్డెక్కి మరీ ఆందోళనలు చేశారు. అయినా వాళ్ళ గురించి ఆలోచించిన వాళ్ళు లేరు. సరైన నాయకుడు లేక భీమవరం టీడీపీ ఇప్పుడు వర్గాలుగా విడిపోయిందని చెప్పుకుంటున్నారు. కష్టపడ్డవారికి ప్రాధాన్యత కల్పించకుండా నియోజకవర్గంలో పెద్ద నాయకురాలిగా చెప్పుకుంటున్న తోట సీతారామలక్ష్మి అడ్డుపడుతున్నారనేది క్యాడర్‌లో ఎక్కువ మంది ఫిర్యాదు. ఇక వర్గపోరులో.. కొంత మంది నేతలు విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పని చేసుకుంటూ పోతున్నారట. ఈ క్రమంలో మా గోడు వినండి మహాప్రభో… అంటూ స్థానిక నేతలు కేంద్ర కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతుండటం అటు పార్టీ అధిష్టానానికి కూడా పెద్ద తలనొప్పిగా మారినట్టు సమాచారం. ఎన్నికల సమయంలో, పార్టీ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు
ఉపయోగించుకున్న నేతల్ని పదవులు ఇవ్వాల్సి వచ్చేసరికి మాత్రం పక్కనపెడుతున్నారన్న అసహనం భీమవరం టిడిపి క్యాడర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
Read Also: Off The record: మిత్రపక్షం టీడీపీకే షాకిచ్చిన బీజేపీ నేత..!
2014 ఎన్నికల టైంలో కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరారు పులపర్తి రామాంజనేయులు. ఆయన రాకతో అప్పటిదాకా ఉన్న పార్టీ క్యాడర్‌కు గుర్తింపులేకుండా పోయిందన్న అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ నుంచి తనతో పాటు వచ్చిన నాయకులకు పులపర్తి ప్రాధాన్యత కల్పించడంతో అప్పటిదాకా కష్టపడిన క్యాడర్ గుర్తింపు దక్కలేదని సతమతమైంది. ఇక 2019ఎన్నికల్లో ఓటమి తర్వాత రామాంజనేయులు పార్టీ వ్యవహారాలకు దూరంకావడంతో మళ్ళీ అదే సీన్ రిపీట్ అయ్యింది. 2024లో అయినా పరిస్థితి మెరుగుపడకపోతుందా అని ఎదురుచూసిన తెలుగుదేశం కార్యకర్తలకు మరోరకంగా ఝలక్ తగిలింది. అప్పటి వరకు పార్టీలో ఉన్న రామాంజనేయులు జనసేన కండువా కప్పేసుకోవడంతో మరోసారి భీమవరం టీడీపీకి నాయకత్వలేమి మొదలైంది. ఏళ్ళ తరబడి తాము పార్టీ జెండా మోస్తుంటే.. అధికారం చేతికొచ్చిన సమయంలో వలస నేతలు.. లేదా పలుకుబడి ఉన్న నాయకులు మాత్రమే పదవులు పంచుకుంటున్నారని.. మిగతా సమాయాల్లో మాత్రం ఎవ్వరూ పట్టించుకోడంలేదనేది భీమవరం టిడిపి కార్యకర్తల ఆవేదనగా తెలుస్తోంది.
Read Also: Rabies Virus: కుక్క మాత్రమే కాదు.. వీటిల్లో ఏది కరిచినా రేబిస్ వస్తుంది!
పార్టీకి కష్టపడి పనిచేసే నాయకులు ఉన్నప్పటికీ..వారిలో ఏ ఒక్కరిని పట్టించుకోకుండా.. పదవులు ఇవ్వకుండా ఏళ్ళతరబడి వ్యవహరించడంతో అసంతృప్తి రాగం తారా స్థాయికి చేరుతోందంటున్నారు. కనీసం ఇప్పటికైనా భీమవరంలో మేమున్నామని గుర్తించడండి అంటూ పార్టీలోని వివిధ వర్గాల నాయకులు రోడ్డెక్కి హంగామా చేస్తున్నారు. దీన్ని చూసైనా… పార్టీ పెద్దలు స్పందిస్తారో లేక ఇప్పటికీ మార్పు రాకుండా.. మరోసారి ఎవరో ఒకరు.. వలస నేత రాకపోతారా అంటా తేలాల్సి ఉందంటున్నారు పరిశీలకులు. మొత్తానికి భీమవరం నియోజకవర్గంలో దయనీయంగా మారిన టీడీపీని బాగు చేయడానికి అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్.
