పిసిసి చీఫ్ కి, ఇంచార్జ్ కి అయన కంట్లో నలుసులా మారిపోయారా? టీ కాంగ్రెస్‌ని ఆ నేత ఇరకాటంలో పెడుతున్నారా? ఇప్పటికే కొనసాగుతున్న ఫిర్యాదులు హుజూరాబాద్ ఫలితం తర్వాత మరింత పెరిగాయా?
కాంగ్రెస్ రాజకీయాల దారే వేరు.మిగతా పార్టీలకి కాంగ్రెస్ కి చాలా తేడా ఉంటుంది.అందులో ఉంటూనే… వ్యతిరేతకతలను, అసంతృప్తిని బాహాటంగా చెప్పొచ్చు. ఇదే ఆ పార్టీకి కొన్ని సార్లు బలంగా కనిపిస్తే, మరికొన్ని సార్లు ఇది బలహీనతగా కూడా మారుతోంది. ఇప్పుడు టీ తెలంగాణ కాంగ్రెస్ లో ఆ నేత కొరకరాని కొయ్యలా తయారయ్యారనే కామెంట్స్ పెరుగుతున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ ఆ నేత పావులు కదుపుతున్నారా..? ఇన్‌ఛార్జి ఠాగూర్ మీద కోపంగా ఉన్న అయన.. అటు పిసిసి చీఫ్‌ని, ఇటు ఠాగూర్ ని ఇరకాటం లోకి నెట్టే పనిలో ఉన్నారా అనేది కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తున్న చర్చ ఆ నేత ఎవరో కాదు ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కొంత కాలంగా… పిసిసి చీఫ్ నియామక సమయం నుండి ఏఐసీసీ ఇంఛార్జి టాగూర్, పిసిసి చీఫ్ రేవంత్ టార్గెట్ గా విమర్శలు చేస్తూ వచ్చారు కోమటిరెడ్డి. పిసిసి పదవిని టాగూర్ అమ్ముకున్నారంటూ చేసిన కామెంట్స్ టియ్యారెస్ కి ప్రచారస్త్రంగా కూడా మారింది. దీనికి తోడు, హుజురాబాద్ ఉప ఎన్నికల అంశంపై కూడా ఇలాంటి వివాదానికే తెరలేపారు. ఎన్నికల ఫలితాల కంటే ముందు జిల్లాలో జరిగిన సమావేశంలో శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు, మేము గెలవలేం కాబట్టి అక్కడ బీజేపీ అభ్యర్ధి ఈటెలకు మద్దతివ్వాల్సి వచ్చిందని కామెంట్స్ చేశారు. ఇది పార్టీలో రచ్చకు కారణమైంది. కోమటిరెడ్డిని అనుసరిస్తూ… జగ్గారెడ్డి కూడా ఆజ్యం పోశారు. తర్వత జగ్గారెడ్డి వెనక్కి తగ్గినా… కోమటిరెడ్డి మాత్రం వార్ కొనసాగిస్తూనే ఉన్నారు.
మరోపక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై టాగూర్ కూడా ఓ కన్నేసి ఉంచారు. ఐదు నెలల సమయం ఉన్నా, కనీసం క్యాడర్ ఓట్లు కూడా వేయించుకోలేకపోయారని ఉప ఎన్నికల ఫలితంపై కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ మరింత వివాదం అయ్యాయి. ఓ వైపు బీజేపీ కి మద్దతు ఇచ్చాం అని ఆయనే, మళ్ళీ కనీసం పార్టీ ఓటు బ్యాంక్ ని కూడా కాపాడుకొలేదని మరో వైపు కామెంట్ చేయడంపై టాగూర్ కొంత సీరియస్ గానే ఉన్నారట.
అదే సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి రాకుండా… దుబాయ్ లో క్రికెట్ మ్యాచ్ కి వెళ్లిన కోమటిరెడ్డి ఫోటోలు మీడియాలో వచ్చాయి. వీటిని టాగూర్…అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారట. పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా దుబాయ్ వెళ్లిన కోమటిరెడ్డి… ఫలితాల తర్వా త చేసిన కామెంట్స్ పై పార్టీ కూడా తప్పు పట్టింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్… ప్రచారానికి రాని వాళ్ళకి ప్రశ్నించే హక్కు లేదని కామెంట్ చేశారు. దుబాయ్ కి వెళ్ళిన కోమటిరెడ్డి ఫోటో లు… బీజేపీ కి మద్దతు ఇచ్చాం అని చేసిన కామెంట్స్ కి సంబందించిన వీడియో లు అధిష్టానం కి చేరవేసే పనిలో ఉన్నారట టాగూర్. పార్టీ ఎంపి కోమటిరెడ్డి… వర్సెస్ ఇంఛార్జి టాగూర్ ల మధ్య వైరం..నువ్వా నేనా అనే స్థాయికి వెళ్ళింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదుల పరంపరను కొనసాగించే పనిలో పడ్డారు. ఈ వైరం..ఎప్పటి వరకు ఉంటుంది అనేది తెలియదు కానీ… పార్టీలో మాత్రం రచ్చ కంటిన్యూ అవుతుంది. ఎక్కడ బ్రేకులు పడతాయనేది చూడాలి మరి.