చేతికి పదవి వస్తే కొందరు గాలిలో తేలిపోతారు. అప్పటి వరకు చుట్టూ ఉన్నవాళ్లకు కూడా అందకుండా పోతారు. ఆ ఎమ్మెల్సీ సైతం అంతేననే టాక్ వైసీపీ కేడర్‌లో గట్టిగానే వినిపిస్తోంది. అయ్యవారు సోషల్ మీడియాలో చురుకు కావడంతో… ‘సార్..! మా గోడు’ పట్టించుకోండి అంటూ అదే సామాజిక మాధ్యమాల్లో రిక్వస్ట్‌లు పెడుతున్నారట. దీంతో పదవి రాకముందు దువ్వాడ.. పదవొచ్చాక దూరమయ్యాడా..! అని సెటైర్లు వేస్తున్నారట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
టెక్కలి వైసీపీ ఇంఛార్జ్ ఎమ్మెల్సీ దువ్వాడ!
సిక్కోలు జిల్లాలో టీడీపీకి గట్టిపట్టున్న నియోజకవర్గాల్లో టెక్కలి ఒకటి. మొన్నటి ఫ్యాన్ సునామీలోనూ ఇక్కడి నుంచి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తిరిగి గెలిచారు. ఆ ఎన్నికల్లో అచ్చెన్నను ఎలాగైనా ఓడించాలని వైసీపీ అధిష్ఠానం దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ , మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి త్రయాన్ని మోహరించినా సక్సెస్ కాలేదు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ ముగ్గురూ ఎవరికివారే నియోజకవర్గంపై పట్టుకోసం తీవ్రంగా ప్రయత్నించారు కూడా. టెక్కలిలో అచ్చెన్నకు చెక్ పెట్టాలంటే దూకుడుగా ఉండే దువ్వాడే కరెక్ట్ అని భావించిన అధిష్ఠానం నియోజకవర్గ ఇంఛార్జి బాధ్యతలను ఆయనకు అప్పగించింది.
టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారట!
దువ్వాడ శ్రీనివాస్ ఇంఛార్జ్‌గా రావడంతో టెక్కలిలోని వైసీపీ క్యాడర్ ఫుల్ ఖుషీ. తమకో ఇంఛార్జ్ దొరికాడని సంబరాలు చేసుకున్నారు. ఇటీవలే దువ్వాడను ఎమ్మెల్సీని చేయడంతో వారి ఆనందం రెట్టింపైంది. కట్ చేస్తే.. ఆ సంతోషం ఆవిరైందని కేడర్ ఒక్కటే గగ్గోలు. గడిచిన ఏడాదిగా టెక్కలిలోని నాలుగు మండలాల పరిధిలో పలువురు టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు. వారొచ్చాక.. ముందు నుంచీ వైసీపీలో ఉన్న కేడర్‌కు కష్టాలు మొదలయ్యాయట. పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నవారిని వదిలేసి.. కండువా మార్చిన వారికి దువ్వాడ ప్రాధాన్యం ఇస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.
మంత్రి అప్పలరాజును ఆశ్రయిస్తున్న సంతబొమ్మాళి, నందిగాం కేడర్
డిప్యూటీ సీఎం కృష్ణదాస్ దగ్గరకు కోటబొమ్మాళి, టెక్కలి శ్రేణులు
పార్టీలోనూ.. పనులు చేసిపెట్టడంలోనూ.. ఆఖరికి టెక్కలిలో జరిగే కార్యక్రమాల్లోనూ కండువా మార్చిన వారకే వేదికపై కుర్చీ వేస్తున్నారట. ఈ పోకడలపై రగిలిపోతున్నాయట వైసీపీ శ్రేణులు. తమ ఆవేదనను చెప్పుకొందామని ప్రయత్నించినా ఎమ్మెల్సీ దువ్వాడ ఎక్కడా దొరకడం లేదట. ఒకవేళ ఏదోలా కలిసి మనసులో బాధ చెప్పుకొందామని ఆయన ఇంటికి వెళ్లితే.. నలుగురు అనధికారికి PAలను దాటుకుని లోపలకు వెళ్లలేకపోతున్నట్టు చెబుతున్నారు. దీంతో సంతబొమ్మాళి, నందిగామం ప్రాంతాలకు చెందిన వైసీపీ కేడర్ మంత్రి సీదిరి అప్పలరాజు, దువ్వాడ శ్రీకాంత్, శ్రీధర్‌ల దగ్గరకు వెళ్తున్నారట. కోటబొమ్మాళి, టెక్కలి వైసీపీ శ్రేణులు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌కు తమ గోడు వెళ్లబోసుకుంటున్నట్టు సమాచారం.
దువ్వాడకు చేరేలా కొందరు సోషల్ మీడియాలో పోస్టింగ్స్
దువ్వాడ శ్రీనివాస్‌ను కాదని.. వేరే నేతల దగ్గరకు వెళ్లడానికి మనసొప్పని వైసీపీ కేడర్ ఇంకో దారి ఎంచుకుందట. సోషల్ మీడియాలో దువ్వాడ యాక్టివ్‌గా ఉంటారు. అందుకే ఎమ్మెల్సీకి చేరేలా అదే సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టి పెడుతున్నారట. ఆ విధంగానైనా ఎమ్మెల్సీ దృష్టికి తమ ఆవేదన వెళ్తుందని కేడర్ ఆశ. ఇందుకు ఫేస్‌బుక్‌ను తెగ వాడేస్తున్నారట. కేవలం దువ్వాడకు తెలిస్తే సరిపోదని అనుకున్నారో ఏమో.. ఇంకొందరు టెక్కలిలో వైసీపీ పరిస్థితి ఇదీ అని చెబుతూ పార్టీ పెద్దల దృష్టికి వెళ్లేలా పోస్టింగ్‌లు పెడుతున్నారట. టెక్కలిలో పసుపు జెండా లేకుండా చేస్తా.. కింజరాపు కంచుకోటను బద్ధలు కొట్టేస్తా అని పదే పదే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ఇంఛార్జ్.. ఇప్పుడు అదేపార్టీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తే ఎలా అన్నది వైసీపీ శ్రేణుల ప్రశ్న. మరి.. ఇక్కడి యవ్వారాలు పార్టీ పెద్దల దృష్టికి వెళ్లాయో లేదోకానీ.. రేపటి రోజున కేడర్ అసంతృప్తి ఏ విధంగా బద్ధలవుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారట నాయకులు.