మూడు ప్రముఖ ఆలయాల ఛైర్మన్ గిరి పట్టేశారు. కానీ.. ఆనందం ఆవిరైంది. స్థానిక నినాదం వాళ్లను ఆ పదవులు చేపట్టకుండా చేసింది. స్థానికేతర నినాదం కాస్త గట్టిగానే తాకడంతో హైకమాండ్ కూడా పునరాలోచనలో పడింది. టోటల్‌గా పదవులు వచ్చి.. పదవులు చేపట్టని వారిగా ఆ ముగ్గురూ మిగిలిపోయారు.
ఆలయాల పదవులపై స్థానిక నేతల గుర్రు!
చిత్తూరు జిల్లాలో నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కాక రేపుతూనే ఉంది. జిల్లాలో ముగ్గురు వైసీపీ నేతలు శ్రీకాళహస్తి, కాణిపాకం సహా కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఆలయాల ఛైర్మన్‌లుగా పదవులు లభించాయి. వీళ్లంతా ఆలయాల పరిధిలోనివారు కాదు. ఈ మూడు ఆలయాల పాలకమండళ్ల ఛైర్మన్ పదవులను తొలిసారిగా స్థానికేతరులకు ఇచ్చారు. పార్టీ తీసుకున్న నిర్ణయంతో ఈ పదవులపై ఆశ పెట్టుకున్న అక్కడి స్థానిక వైసీపీ నేతలకు తీవ్ర అసంతృప్తిని మిగల్చడమే కాదు ఎమ్మెల్యేలపై తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది.
స్థానికులకే పదవులు ఇవ్వాలని అధిష్ఠానంపై ఒత్తిళ్లు!
రోజు రోజుకు సమస్య తీవ్రంగా మారడంతో జిల్లా నేతలు, మంత్రులుపై ఒత్తిళ్లు పెరిగాయి. అమరావతి స్థాయిలో పెద్ద యుద్ధమే చేశారని టాక్. ఇతర నాయకులు ఎమ్మెల్యేలు కలిసి.. ఈ మూడు ఆలయాల ఛైర్మన్ పదవుల మార్పునకు అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారట. మార్చకపోతే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తోందని తమ బాధ చెప్పారట. ఆ తర్వాతే మార్పులకు హైకమాండ్ ఒకే చెప్పినట్టు సమాచారం.
శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకు లైన్ క్లియరైందా?
తొలుత శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్ అనుకున్న బీరేంద్ర వర్మను పక్కన పెట్టి స్థానిక వైసీపీ నేత అంజూరు శ్రీనివాస్‌కు అవకాశం ఇస్తున్నారట. బీరేంద్ర వర్మ అలగకుండా ఆయనికి టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఛాన్స్ ఇచ్చారు. అలాగే కాణిపాకం బోర్డు ఛైర్మన్‌ను ప్రకటించి నెలలు గడుస్తున్నా స్థానిక పరిస్థితుల దృష్ట్యా వారు ప్రమాణ స్వీకారం చేయలేదు. కాణిపాకం ఆలయ ఛైర్మన్‌గా వైసీపీ నేత దయాసాగర్ సతీమణి లతారెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. ఆమె కూడా బాధ్యతలు తీసుకోలేదు. ఇప్పుడు దయాసాగర్ రెడ్డికి టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా చోటు కల్పించడంతో అక్కడా స్థానిక నేతలకు లైన్ క్లియరైనట్టు ప్రచారం జరుగుతోంది.
శ్రీశైలంలోనూ స్థానిక అంశంపై కేడర్ ఆగ్రహం
ఇక నగరికి చెందిన రెడ్డివారి చక్రపాణిరెడ్డికి కర్నూలు జిల్లా శ్రీశైలం బోర్డు చైర్మన్‌గా అవకాశం ఇచ్చినా ఆయన బాధ్యత స్వీకరించలేదు. అక్కడ కూడా లోకల్ నాన్‌లోకల్ సమస్య వచ్చింది. పక్కజిల్లా వారికి ఎలా మా శ్రీశైల ఆలయ ఛైర్మన్ పదవి ఇస్తారని కర్నూలు జిల్లా వైసీపీ నేతలు పంచాయితీ పెట్టినట్టు సమాచారం. ఈ ప్రాంతాల్లో స్థానికేతరుల అంశం తలనొప్పిగా మారడంతో కొత్తవారు వస్తారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికి శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల బోర్డుల్లో మార్పులకు మార్గం సుగమం అయినా శ్రీశైలం పరిస్థితి ఏంటన్నదే ప్రశ్నగా ఉందట. మరి ఏం జరుగుతుందో చూడాలి.