TTD పాలకమండలి సభ్యుల ఎంపిక ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందా? లెక్కకు మిక్కిలిగా సిఫారసులు, ఒత్తిళ్లతో ఎవర్ని ఎంపిక చేయాలో.. ఎవర్ని కాదనాలో తేల్చుకోలేకపోతుందా? మొహమాటానికి పోయి పోయినసారి సభ్యుల సంఖ్య పెంచిన ప్రభుత్వం మరోసారి అదే చేయడానికి వెనకాముందు ఆలోచిస్తోందా? పాలకమండలిలో చోటుకోసం కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్రాల సీఎంల నుంచి వచ్చిన చాంతాడంత జాబితాను కుదించడం.. కాదనడం సర్కార్ వల్ల కావడం లేదట.
1933లో ఏడుగురు సభ్యులతో పాలకమండలి నియామకం!
తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రాధాన్యం చెప్పడానికి ఏ కొలమానమూ సరిపోదు. స్వామివారి దర్శనం అనిర్వచనీయం అయితే.. ఆయన సేవకుడిగా ఉండటం మహద్భాగ్యమే. పాలకమండలి సభ్యులుగా ఉంటే స్వామివారికి దగ్గరగా ఉండటం, దర్శనాల్లో ప్రత్యేకతలు వంటివి సంక్రమిస్తాయి. దానికోసం దేశం నలుమూలల నుంచీ వందల మంది ప్రయత్నిస్తున్నారు. టీటీడీ పాలకమండలి మొదట్లో ఎలా ఉండేదో చూస్తే.. మహంతుల పరిపాలనలో ఉన్న తిరుమల ఆలయ నిర్వహణపై ఆరోపణలు రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానంను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. యాక్ట్ ఆఫ్ 1932 ప్రకారం 1933లో ఏడుగురు సభ్యులు, ఒక కమిషనర్‌తో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా జియ్యంగార్లు, అర్చకులు, ఆచార్య పురుషులు, మిరాశీదార్లు ప్రతినిధులు సభ్యులుగా ఉండేవారు. ప్రత్యేకంగా ఎలాంటి అర్హతలు లేకుండా కమిటీ సభ్యులను నియమించుకునే వెసులుబాటు అప్పట్లో ఉండేది.
1951 చట్టం ప్రకారం ఐదుగురు సభ్యులతో టీటీడీ బోర్డు!
1966 చట్టం ప్రకారం 11కు పెరిగిన బోర్డు సభ్యుల సంఖ్య!
ప్రస్తుతం 37కు చేరిన పాలకమండలి సభ్యుల సంఖ్య
మద్రాస్ హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్ ఆఫ్ 1951 ప్రకారం మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని ఏర్పాటైంది. ఐదుగురు సభ్యులతో ఐదేళ్ల కాలపరిమితితో పాలకమండలిని నిర్ధారించారు. 1966లో యాక్ట్ నెంబర్ 17 మేరకు ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందు రిలిజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ మేరకు పాలకమండలి సభ్యులను 11కు పెంచారు. ఇందులో ముగ్గురు సభ్యులు తప్పనిసరిగా శాసనసభకు ప్రాతినిధ్యం వహించే వారు కాగా.. మరొకరు షెడ్యూల్ క్యాస్ట్.. ఇంకొకరు మహిళ ఉండాలి. సభ్యులు పెరగడంతో పాలకమండలి కాలపరిమితి మూడేళ్లకు కుదించారు. ఆ తర్వాత అనేక మార్పులు జరిగాయి. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 25 మంది సభ్యులతో.. ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులుతో.. మరో నలుగురు ఎక్స్అఫీషియో సభ్యులతో పాలకమండలి కొత్త రూపు తెచ్చారు. ఆపై మరో ప్రత్యేక ఆహ్వానితుడికి బోర్డులో చోటుదక్కడంతో సభ్యులు సంఖ్య 37కి పెరిగింది. కాలపరిమితి రెండేళ్లే.
37లో ఏపీకి చెందిన వారు 9 మందే!
కొత్త కమిటీలో సభ్యత్వం కోసం ఓ రేంజ్‌లో ఒత్తిళ్లు
గత పాలకమండలిలో ఏపీ కంటే ఇతర రాష్ట్రాల వారికే అత్యధిక ప్రాతినిథ్యం దక్కింది. మొత్తం 37 మంది సభ్యులలో నలుగురు ఎక్స్అఫీషియో సభ్యులను ప్రక్కన పెడితే.. చైర్మన్‌తో కలిపి 9 మందికి ఏపీ నుంచి చోటు దక్కింది. తెలంగాణ నుంచి మరో తొమ్మిది మందికి.. తమిళనాడు నుంచి ఐదుగురికి.. కర్ణాటక నుంచి ఐదుగురికి.. ఢిల్లీ నుంచి ఇద్దరికి.. మహారాష్ట్ర నుంచి ఇద్దరికి.. భువనేశ్వర్ నుంచి ఒకరికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఇదే ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెడుతుందట. కొత్త పాలకమండలిలో సభ్యత్వం ఆశిస్తున్న ప్రక్కరాష్ర్టాల వారి సంఖ్య అధికంగా ఉంది. ఒత్తిళ్లూ అలాగే ఉన్నాయట. తెలంగాణతో జల జగడాలు..బీజేపీ నేతలతో రాజకీయ పోరాటం చేస్తున్న తరుణంలో వారి సిఫారసులకు అనుగుణంగా సభ్యులను నియమిస్తే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపే అవకాశం ఉంది. వీటిని బ్యాలన్స్ చేస్తూ.. సిఫారసులు చేసేవారిని సంతృప్తి పరుస్తూ.. కొత్త బోర్డు ఏర్పాటు ప్రభుత్వానికి కత్తిమీద సామే.
తలనొప్పిగా సభ్యుల నియామకం!
సాధారణంగా ఛైర్మన్ ఎంపికలో పెద్దఎత్తున కసరత్తు చేసే ప్రభుత్వం.. ఈజీగానే వైవీ సుబ్బారెడ్డిని చైర్మన్‌గా నియమించింది. సభ్యుల నియామకమే తలనొప్పి, విపరీతమైన ఒత్తిడి వస్తుండటంతో వాయిదాలు తప్పడం లేదు. మరి.. ఈ కసరత్తు ఎప్పటికి పూర్తి అయ్యేనో.. కొత్త బోర్డు కొలుదీరేదెప్పుడో ఆ దేవదేవుడికే తెలియాలి.