ప్రజల కష్టాలు, ప్రాంతం సమస్యల కంటే వారికి సొంత వ్యాపారాలు.. ఆస్తులే ఎక్కువ అయ్యాయా? తీవ్ర నష్టం చేకూర్చే చర్యలు జరుగుతోన్నా.. అధినేతను విమర్శిస్తున్నా నోరెత్తకపోవడానికి కారణం అదేనా? సీమకు ప్రాణాధారమైన రాయలసీమ లిఫ్ట్.. RDS కుడి కాల్వలకు తెలంగాణ అడ్డుపడినా కర్నూలు నేతలు స్పందించకపోవడానికి అవే కారణాలా?
జల జగడంపై పెదవి విప్పని కర్నూలు వైసీపీ నేతలు!
రాయలసీమ ఎత్తిపోతల పథకం, RDS కుడి కాలువ పనులు తెలుగు రాష్ట్రాల మధ్య నిప్పుల వర్షం కురిపిస్తున్నాయి. పరస్పరం విమర్శలు, ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. సీఎం జగన్ పై తెలంగాణ నేతలు ఒంటి కాలిపై లేస్తున్నారు. టీఆర్‌ఎస్, తెలంగాణ బీజేపీ నేతలు అంతగా విమర్శిస్తున్నా ఈ రెండు ప్రాజెక్టులు ఉన్న కర్నూలు జిల్లాలోని వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు మాత్రం పెదవి విప్పడం లేదు. ఒక్క మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాత్రం ఎదురుదాడి చేశారు. వైసీపీకి జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు.. ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఆర్డీఎస్ కుడి కాలువ వివాదంపై కనీసం ఆ నియోజకర్గాల ఎమ్మెల్యేలు కూడా నోరు మేదపలేదు.
సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన ఉన్న నేతలు ఎందుకు మౌనం?
సీఎం జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే సాధారణంగా వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు మూకుమ్మడి మాటల దాడి చేస్తారు. కృష్ణా జలాలను వినియోగించుకునేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం రూపకల్పన చేస్తే.. ఆ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి ఎంత అవసరం ఉందో.. ఏటా తుంగభద్ర, కృష్ణా జలాలను ఏ విధంగా రాయలసీమ నష్టపోతుందో సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదన్న చర్చ జరుగుతోంది. RDS కుడి కాలువ, రాయలసీమ ఎత్తిపోతల పథకం వస్తే సీమ ప్రాజెక్టులకు చాలా వరకు నీటి లభ్యత పెరుగుతుంది. రాయలసీమకు ఏటా 450 టీఎంసీల నీరు అవసరమైతే కేవలం 150 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కళ్ల ముందు ఇన్ని లెక్కలు ఉన్నా.. వైసీపీలో సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన ఉన్న నాయకులు కూడా ఎందుకు మౌనం వహిస్తున్నారన్న చర్చ సాగుతోంది.
తెలంగాణలో ఆస్తులు ఉన్నాయనా?
అధిష్ఠానం మాట్లాడొద్దని ఆదేశించిందా?
జలవివాదంపై కర్నూలు జిల్లా వైసీపీ నేతలు పెదవి విప్పకపోవడానికి కారణం ఏంటని ఆరా తీస్తున్నారు. కర్నూలు జిల్లాలో అన్ని పార్టీల నేతలకు తెలంగాణలో ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పుడు నీటి సమస్యపై తెలంగాణ నేతల విమర్శల మీద ఎదురుదాడి చేస్తే సమస్యలు వస్తాయని మౌనం వహిస్తున్నారా అని చర్చ జరుగుతోంది. అయితే జలవివాదంపై కర్నూలు జిల్లా నేతలకు పార్టీ అధిష్ఠానం ఏవైనా ఆదేశాలు ఇచ్చిందా.. అందుకే సీఎం జగన్‌ను తీవ్రస్థాయిలో విమర్శించినా వైసీపీ నేతలు సైలెంటయ్యారా అని చర్చించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య, ప్రత్యేకించి కర్నూలు జిల్లాలోని ప్రాజెక్టుల మధ్య జలజగడం జరుగుతుంటే అధికార పార్టీ నేతల స్పందన అంతంతమాత్రంగానే ఉండడం చర్చగా మారింది.