కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీలో విబేధాలు రచ్చకెక్కాయా? సమన్వయం లేక నాయకులే బజారున పడుతున్నారా? ఆధిపత్యపోరు వైఎస్ విగ్రహాన్ని కూల్చేవరకు వెళ్లిందా? లోకల్ సెగలు.. ఇంకెలాంటి మలుపు తిప్పుతాయో పార్టీ వర్గాలకు బోధపడటం లేదా? ఏ విషయంలో పార్టీ నాయకుల మధ్య గ్యాప్ వచ్చింది? లెట్స్ వాచ్!
కోడుమూరు వైసీపీలో వర్గపోరు సెగలు..!
కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కోట్ల హర్షవర్దన్‌రెడ్డి మధ్య రెండేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడది పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత మరో రూపంలో బయటపడింది. ఎంపీపీ అభ్యర్థుల ఎంపిక రెండు వర్గాల మధ్య తీవ్ర రచ్చకు దారితీసింది. ఎంపీపీని చేస్తానని మాట ఇచ్చిన ఎమ్మెల్యే అన్యాయం చేశారని కొందరు నిరసనకు దిగడం.. వైఎస్‌ఆర్ విగ్రహాన్ని కూల్చేస్తామని అసంతృప్తులు ఆగ్రహం వ్యక్తం చేయడం అధికార పార్టీలో సెగలు రేపుతోంది.
కర్నూలు రూరల్, గూడూరు మండలాలు ఎమ్మెల్యేకు..!
కోడుమూరు, సి.బెళగల్ మండలాలు పార్టీ ఇంఛార్జ్‌కు..!
గూడూరు ఎంపీపీ సీటుపై రగడ..!
కోడుమూరు నియోజకవర్గంలో కోడుమూరు, గూడూరు, సి.బెళగల్, కర్నూలు రూరల్ మండలాలు ఉన్నాయి. ఈ నాలుగు మండలాల్లో ఎంపీపీ స్థానాలను దక్కించుకునే విధంగా మెజారిటీ ఎంపీటీసీ స్థానాలు వైసీపీకే దక్కాయి. అయితే ఎంపీపీల ఎంపికలో ఎమ్మెల్యే, పార్టీ ఇంఛార్జి మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో కర్నూలు రూరల్, గూడూరు మండలాలు ఎమ్మెల్యేకి, కోడుమురు, సి.బెళగల్ మండలాలు ఇంఛార్జ్ కోట్ల హర్షకు కేటాయించారు. అప్పటికే గూడూరు, సి.బెళగల్ మండలాల్లో ఎంపీపీని చేస్తానని కొందరు అభ్యర్థులకు ఎమ్మెల్యే సుధాకర్ మాట ఇచ్చారట. ఆ మాట పట్టుకుని ఎన్నికల్లో ఆయా అభ్యర్థులు భారీగా ఖర్చు పెట్టారు. అయితే ఇప్పుడు ఆ మండలాలు ఇంఛార్జ్ చేతిలోకి వెళ్లడంతో.. గూడూరు మండలంపై రగడ మొదలైంది. ఎమ్మెల్యే హామీ ఇచ్చిన వారికి కాకుండా తమ వర్గానికి చెందిన సునీతను ఇంఛార్జ్ కోట్ల ఎంపిక చేశారు.
రాజమ్మ వర్గం గుర్రు.. వైఎస్ విగ్రహం కూల్చే యత్నం..!
ఎంపీపీ సీటు చేజారిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఎంపీటీసీ రాజమ్మ, ఆమె కుమారుడు నరసింహారెడ్డి ఆందోళనకు దిగారు. తమ సొంత స్థలంలో గతంలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహం దగ్గర రాజమ్మ ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే సుధాకర్ దీక్షా శిబిరానికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే అనుచరులకు, రాజమ్మ వర్గానికి మధ్య వాగ్వివాదం జరిగింది. వైసీపీ కార్యకర్త ఒకరు పురుగు మందు తాగబోతే.. అడ్డుకున్నారు. కర్నూలు నగర మేయర్ రామయ్యను తీసుకొచ్చి.. అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే. కానీ.. వైసీపీకో దండం అంటూ పార్టీ కండువా తీసేసి మేయర్ కాళ్లు మొక్కి రాజమ్మ కుమారుడు అక్కడి నుంచి వెళ్లి పోయారు. నిరసనగా తమ సొంత స్థలంలోని వైఎస్ విగ్రహాన్ని రాజమ్మవర్గం కూల్చే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీటీసీ రాజమ్మ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ గొడవతో వైసీపీ కూడా వ్యూహం మార్చేసింది. పార్టీకి పూర్తి బలం ఉన్నా.. ముందు జాగ్రత్తగా టీడీపీ నుంచి ఒకరిని.. మరో ఇండిపెండెంట్‌ను తమవైపు తిప్పుకోక తప్పలేదు.
సి. బెళగల్ ఎంపీపీపైనా పార్టీలో ఉత్కంఠ!
సి.బెళగల్ ఎంపీపీ అభ్యర్థి ఎంపిక సైతం ఉత్కంఠకు దారితీసింది. ఇక్కడ కూడా ఎంపీటీసీ మునెప్పకు గతంలోనే ఎమ్మెల్యే సుధాకర్ హామీ ఇచ్చారట. ఈ మండలం ఇంఛార్జ్ కోట్ల హర్ష చేతికి రావడంతో.. ఆయన బీసమ్మను ఎంపీపీగా నిర్ణయించారు. మరి.. 29 లక్షలు ఖర్చు చేసిన తన సంగతేంటని నిలదీశారు మునెప్ప. చివరకు మునెప్పకే పట్టం కట్టారు. కర్నూలు రూరల్ మండలంలోను వైసీపీకి పూర్తి బలం ఉన్నా.. ఎమ్మెల్యే, ఇంచార్జి మధ్య సమన్వయం పార్టీ ఎంపీటీసీలను క్యాంపులకు తరలించాల్సి వచ్చింది. మొత్తంమీద సుధాకర్, కోట్ల హర్షవర్దన్‌రెడ్డి మధ్య నెలకొన్న విభేదాలు ఈ రూపంలో భగ్గుమనడంతో.. పార్టీలో పెద్ద చర్చే మొదలైంది. మరి.. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.