గోరంట్ల బుచ్చయ్య చౌదరి బెదిరించారా? బ్లాక్‌మెయిల్ చేశారా? అవమానాలకు, అప్రాధాన్యతలకు అలక బూనారా? అధిష్ఠానం మెడలు వంచడానికి రాజీనామా డ్రామా ఆడారా? లేక నిజంగానే బైబై చెప్పేయాలని నిర్ణయించుకున్నారా? ఇది టీకప్పులో తుఫానా? ఉప్పెన అవుతుందా?
బుచ్చయ్యకు చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వలేదా?
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీలో అలజడి రేపారు. ఎన్టీఆర్ తర్వాత పార్టీలో చిన్న అన్నగా గుర్తింపు పొందిన ఆయన చంద్రబాబుకంటే టీడీపీలో సీనియర్. అయినప్పటికీ పదవుల కేటాయింపుల్లో పార్టీ అధిష్ఠానం చిన్న చూపే చూస్తోందట. టీడీపీ ఆవిర్భావం నుంచి గోరంట్ల పార్టీలో ఉన్నారు. 1995 సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ పక్షాన నిలిచారు. మంత్రి అయ్యారు. తర్వాత మళ్లీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయినప్పటికీ బుచ్చయ్యకు చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వలేదు. 2004 వరకు.. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నా బుచ్చయ్య మంత్రి కాలేకపోయారు.
పీఏసీ ఛైర్మన్ పదవిపై ఆశపెట్టుకున్నా నెరవేరలేదు!
రాజీనామా బాంబ్ పేల్చిన బుచ్చయ్య
చివరకు పార్టీ ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతైనా న్యాయం జరుగుతుందని ఎదురు చూశారు బుచ్చయ్య. ప్రతిపక్షానికి వచ్చే పీఏఏసీ ఛైర్మన్ పదవిని తనకు ఇవ్వాలని కోరారు. పార్టీ నుంచి స్పందన లేదు. టీడీపీ రాష్ట్ర కమిటీ పదవుల్లోనూ గోరంట్ల సూచించిన వారికి కాకుండా రాజమండ్రిలో ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ వర్గానికి పెద్దపీట వేశారు. దీంతో గోరంట్లలో అసంతృప్తి మరింత పెరిగింది. అటు అధికారంలో ఉన్నప్పుడు పదవులు రాక.. ప్రతిపక్షంలోనూ ప్రాధాన్యం లేక.. సీనియర్‌గా గౌరవం దక్కకపోవడంతో రగిలిపోతున్న బుచ్చయ్య రాజీనామా బాంబ్ పేల్చారు. టీడీపీకి వీర విధేయుడిగా ముద్రపడ్డ బుచ్చయ్యలాంటి నేత అలాంటి నిర్ణయానికి వస్తున్నారని తెలిసి పార్టీ సహా బయట ఉన్నవాళ్లు విస్తుపోయారు. తనకు జరుగుతున్న అనుమానాలపై గుర్రుగా ఉన్న బుచ్చయ్య రాజీనామా నిర్ణయానికి వచ్చారట.
రాజీనామాపై మూడు రోజుల ముందే చెప్పినా పార్టీ పెద్దల స్పందన లేదా?
మూడు రోజుల ముందే రాజీనామా విషయాన్ని అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్పల ముందు గోరంట్ల బయటపెట్టారట. అయినా అధిష్ఠానం నుండి ఏ విధమైన స్పందన రాకపోవడంతో రాజీనామా విషయాన్ని గోరంట్ల తన వర్గీయులు ద్వారా బయటపెట్టారు. అయితే రాజీనామాకు సంబంధించి ఏ విధమైన లేఖను ఆయన అధిష్ఠానానికి పంపలేదు. ఈనెల 25న పార్టీ అధిష్ఠానానికి రాజీనామా లేఖ సమర్పించాలని నిర్ణయించారు.
చంద్రబాబును కలవబోనంటున్న బుచ్చయ్య!
బుచ్చయ్య రాజీనామా వ్యవహారం టీడీపీలో సంచలనమైంది. వెంటనే హైకమాండ్ రంగంలోకి దిగింది. దూతగా నిమ్మకాయల చినరాజప్పను పంపింది. తనకు జరిగిన అవమానాలను, అప్రాధాన్యత అంశాలను రాజప్ప ముందు ఏకరవు పెట్టారు బుచ్చయ్య. వాటన్నింటినీ చంద్రబాబుకు చెప్పి పరిష్కరించుకుందామని రాజప్ప ప్రతిపాదించారు. దానికి గోరంట్ల మెత్తబడిందీ లేనిదీ స్పష్టంగా తెలియనప్పటికీ చంద్రబాబుతో భేటీకావాలని సూచించారట. అయితే తాను చంద్రబాబును కలవను పార్టీ నేతలను కలుస్తానని చెప్పారట గోరంట్ల. మీడియాతో మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదు.
ఇది టీ కప్పులో తుఫానా? వెళ్లిపోతారా?
పీఏసీ ఛైర్మన్‌గా ప్రస్తుతం పయ్యావుల కేశవ్ కొనసాగుతున్నారు. ఆయన తర్వాత బుచ్చయ్యకు ఆ పదవి ఇవ్వొచ్చంటున్నారు. అలాగే రాజమండ్రి అర్బన్ పార్టీ వ్యవహారాలను కూడా సెటిల్ చేస్తారని రాజప్ప హామీ ఇచ్చారట. మొత్తానికి ఇది టీకప్పులో తుఫాన్‌గా మిగుతుందా లేక చిన్నన్న నిజంగానే నిష్క్రమిస్తారో చూడాలి.