తెలంగాణలో రెండో సారి అధికారంలోకి రావడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ కసరత్తు మొదలుపెట్టేశారా? ఆ దిశగా పావులు కదుపడం మొదలైపోయిందా? సెలెక్టెడ్ ఓట్ బ్యాంకుపై ఇప్పటికే ఆయన ఫోకస్ చేశారన్నది నిజమేనా? ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షతో పాటు కూడికలు తీసివేతల పని కూడా స్టార్ట్ అయిందా? అసలా కసరత్తు ఏంటి? దాని గురించి కాంగ్రెస్‌లో జరుగుతున్న చర్చలేంటి?
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సహకరించిన వర్గాలన్నిటిని మళ్లీ సమీకరించుకునే పనిలో బిజీగా ఉన్నారట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆయా వర్గాలన్నీ చేజారి పోకుండా చూసుకునే పని మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు బేరీజు వేస్తున్నారాయన. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో అంతా తెలుసునంటూ… ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో కూడా క్లియర్‌గా చెప్పారాయన. నాయకులను, క్యాడర్‌ని అప్రమత్తం చేయడంలో భాగంగానే సీఎం ఆలాంటి మెసేజ్ ఇచ్చి ఉండవచ్చని అంచనా వేస్తున్నాయి రాజకీయవర్గాలు.
ఇక ప్లాన్ అమలు చేసే పనిలో భాగంగా ముఖ్యమంత్రి ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల మీదనే ఎక్కువ ఫోకస్ చేసినట్టు కనబడుతోందంటున్నాయి పారటీ వర్గాలు. ఇటీవల అచ్చంపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించి తన ఆలోచనల్ని ప్రజలతో పంచుకున్నారాయన. అలాగే… ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులున్న నియోజకవర్గాల్లో ఏం జరుగుతోందన్న విషయంమై ఇప్పటికే ఆరా తీస్తున్నారట. నియోజకవర్గాల పునర్విభజన ప్రభావం ఏ మేరకు ఉంటుంది..? పునర్విభజన తర్వాత వాటి స్వరూపం ఎలా మారబోతోందన్న అంశాలపై ఇప్పటికే ఆయనకు ఓ లెక్క ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే… క్షేత్రస్థాయిలో పనితీరును ఇప్పటికే అంచనా వేయడం మొదలుపెట్టారట. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని ఇప్పటికే డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
ఎట్టి పరిస్థితుల్లో.. గెలుపే లక్ష్యంగా ఎన్నికల్లో పనిచేయాల్సిందేనని గట్టిగా ఫిక్స్ అయిన సీఎం… కూడికలు తీసివేతల పని కూడా చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. అనవసరమైన మొహమాటాలకు, వాళ్ళు వీళ్ళు చెప్పారన్న పట్టింపులకు పోకుండా….గెలుపు గుర్రాలకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చే దిశగా కసరత్తు మొదలైందన్నది ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. కొత్తగా వచ్చి పని మొదలుపెట్టిన ఇన్చార్జి సందీప్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారట.
పనిచేసే వాళ్లు… పనితీరు బాగా లేని వాళ్ళు ఎవరన్న లెక్కలు కూడా తేల్చబోతున్నట్టు తెలిసింది. జిల్లాల వారీగా పర్యటించి అన్నిటిని సెట్ చేయాలని అధిష్టానం కూడా ఇన్చార్జికి దిశా నిర్దేశం చేసినట్టు చెబుతున్నారు. దాంట్లో భాగంగానే డిసెంబర్ రెండో వారంలో జిల్లాల బాటబడుతున్నారు ఇన్చార్జి సందీప్. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కోటి ఓట్లు 90 సీట్లు అంటూ నినాదం మొదలుపెట్టారు. అంటే తనకంటూ ఒక లెక్క ఉందని నేరుగానే చెబుతున్నారాయన. దీన్ని బట్టి చూస్తుంటే… పనిచేస్తేనే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ లేదంటే కట్ అని ముఖ్యమంత్రి తేల్చేసినట్టయింది.

