Site icon NTV Telugu

Off The Record: ఆ జనసేన ఎమ్మెల్యే ఎందుకు గెలిచినా అని ఫీల్ అవుతున్నారా?

Palakonda Mla

Palakonda Mla

Off The Record: నేను ఎంతో.. చేయాలనుకున్నాను. నియోజకవర్గాన్ని ఎక్కడికో.. తీసుకెళ్ళాలనుకున్నాను. కానీ… వీళ్ళు ఇక్కడే, అసలు నా కాళ్ళే కట్టేస్తున్నారంటూ ఆ ఎమ్మెల్యే తెగ ఫీలైపోతున్నారా? ఇదెక్కడి ఖర్మరా బాబూ.. అసలు ఎందుకు గెలిచాను అనుకుంటూ తెగ ఫ్రస్ట్రేట్‌ అయిపోతున్నారా? ఆంధ్రప్రదేశ్‌ అధికార కూటమిలో ఉండి కూడా ఆయనకు ఎందుకంత బాధ? అలా విలవిల్లాడుతున్న ఆ శాసనసభ్యుడు ఎవరు?

Read Also: Off The Record: అటవీ అధికారులు మా పాత బాస్ సంక్షేమమే ముఖ్యమంటున్నారా?

మన్యం జిల్లా పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం.. పూర్తిగా వైసీపీ ఆధిపత్యం ఉండే సెగ్మెంట్‌ ఇది. అలాంటి చోట 2024లో సత్తా చాటింది కూటమి. అంతకు ముందు 2014, 2019లో టీడీపీ తరపున పోటీ చేసి వరుస ఓటములు చవిచూశారు నిమ్మక జయకృష్ణ. సౌమ్యుడు, మంచివాడని పేరున్నా.. ఆ మంచితనాలేవీ.. ఈవీఎం బటన్‌ దగ్గర పని చేయలేదు. అది వేరే స్టోరీ. ఇక 2024కు వచ్చేసరికి కూటమి పొత్తులో భాగంగా.. జనసేనకు వెళ్ళింది పాలకొండ. వరుస ఓటములు ఎదుర్కొన్న జయకృష్ణ ఈసారి టీడీపీ నుంచి జనసేనలోకి జంప్‌ అయిపోయి.. ఎమ్మెల్యేగా గెలిచారు. అంతవరకు బాగానే ఉందని అనుకుంటుండగానే.. మెల్లిగా ఆధిపత్య అగ్గి అంటుకుంది. ఏడాదిన్నర క్రితం వరకు నిమ్మక జయకృష్ణ టీడీపీలోనే ఉన్నా.. జనసేన ఎమ్మెల్యే అయ్యాక ఇప్పుడు ఆయనకు, టీడీపీ లీడర్స్‌కు అస్సలు పడటం లేదట.

Read Also: Visakhapatnam: దారుణం.. ఆరు నెలల గర్భిణీని తగులబెట్టిన దుండగులు..

తెలుగుదేశంలో ఉన్న నాయకులే పెత్తనం కోసం పావులు కదుపుతుండటంతో.. ఆధిపత్య పోరు బాగా పెరిగిందని చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలో. ఈ క్రమంలో.. జనసేన కేడర్‌తో పాటు.. ఇప్పటికీ టీడీపీలో ఉన్న తన మనుషులు వివిధ పనుల కోసం వస్తున్నా.. ఏం చేయలేకపోతున్నానంటూ ఫ్రస్ట్రేట్‌ అవుతున్నారట ఎమ్మెల్యే. ఒకరకంగా ఇంటా బయటా వత్తిళ్ళతో ఆయన సతమతం అవుతున్నట్టు సమాచారం. ఇదెక్కడి ఖర్మ రా.. బాబూ.. పదవి రానన్నాళ్ళు ఎప్పుడెప్పుడు ఎమ్మెల్యే అవుదామా అనిపించిందిగానీ.. తీరా ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే.. ఎందుకు గెలిచానా అనిపిస్తోందని అత్యంత సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఆ విషయాన్నే పబ్లిక్‌లో కాస్త స్మూత్‌గా చెబుతున్నారట నిమ్మక. పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న పాలకొండలో కూడా ఏం చేయలేకపోతున్నానంటూ తాజాగా జనసేన మీటింగ్‌లో ఆవేదన వ్యక్తం చేశారట ఆయన. ఎమ్మెల్యే అనుచరులు కొందరు ఇటీవల పార్టీ అగ్రనేత, ఎమ్మెల్సీ నాగబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళినట్టు సమాచారం.

Read Also: Off The Record: నామినేటెడ్ పదవులిస్తామన్నా పార్టీలోకి ఎవరూ రావడంలేదా?

ఈ ఫ్రస్ట్రేషన్‌లోనే.. ఎమ్మెల్యే మెల్లిగా గొంతు సవరించుకుంటున్నట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. నియోజకవర్గంలో రైతుల సమస్యలపై బహిరంగంగానే కామెంట్స్‌ చేస్తున్నారాయన. రైతులకు చెందాల్సిన యూరియా అధికారులు తీరుతో పక్కదారి పడుతోందని, స్థానిక టీడీపీ నాయకులే దాన్ని అక్రమంగా ఒడిశాకు తరలిస్తున్నారని స్వయంగా జనసేన ఎమ్మెల్యే ఆరోపించడం కలకలం రేపుతోంది. అధికార కూటమి ఎమ్మెల్యేగా ఉన్నా.. ఆఫీసర్స్‌ తన మాట వినడం లేదని తీవ్ర అసహనంతో ఉన్నారట నిమ్మక జయకృష్ణ. ఇక్కడ టీడీడీ ఇన్ఛార్జ్‌ పడాల భూదేవి అంతా తానై నడిపిస్తూ.. తనను సైడ్‌ చేస్తున్నారన్నది ఆయన బాధగా చెప్పుకుంటున్నారు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుతోనే.. పాలకొండ కూటమిలో కొత్త సమస్యలు వస్తున్నాయట. ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులు చెలరేగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు.

Read Also: DRDO Manager: బాధ్యతాయుత పదివిలో ఉండి.. ఇలాంటి గలీజు పనులేంటి మాస్టారు!

నియోజకవర్గంలోని రైతులు ఎరువులు దొరక్క ఇబ్బంది పడుతున్నారని, ఈ విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుంటే తప్ప మార్పు రాదని ఎమ్మెల్యే మొత్తుకుంటున్నారంటే.. పరిస్థితి ఎలా అర్ధం చేసుకోవచ్చంటున్నారు లోకల్ జనసేన నాయకులు. నియోజకవర్గ అభివృద్ధి మీద తన ముద్ర వేసేందుకు నిమ్మక తపిస్తున్నా.. స్థానిక తెలుగుదేశం నాయకులు అడుగడుగునా అడ్డుపడుతున్నారన్నది గ్లాస్‌ కేడర్‌ ఆరోపణ. టీడీపీ ఇన్ఛార్జ్‌ పడాల భూదేవి సహాయనిరాకరణతో పాటు మంత్రి అచ్చెన్నాయుడి అండదండలతో ఆమె వర్గం ఎమ్మెల్యే ముందరి కాళ్ళకు బంధాలు వేస్తున్నట్టు అనుమానిస్తున్నారట జనసైనికులు. మొత్తంగా పరిస్థితిని ఇప్పుడే చక్కదిద్దకుంటే… పాలకొండ కూటమిలో పరిస్థితులు మొత్తానికే తేడా కొట్టే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

Exit mobile version