తెలంగాణ మంత్రులు కొందరి మెడ మీద పొలిటికల్ కత్తి వేలాడుతోందా?.. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు స్పెషల్ టాస్క్ ఇచ్చారా?.. ఆ లక్ష్యాన్ని ఛేదించేదాన్ని బట్టే భవిష్యత్ అవకాశాలు, ఇతర వ్యవహారాలు ఆధారపడి ఉంటాయా?.. ఏంటా కొత్త టాస్క్?.. దాని గురించి పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఏంటి?.
తెలంగాణ మంత్రులకు కొత్త టాస్క్ వచ్చి పడింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు బాధ్యతలు అప్పగించారు పార్టీ పెద్దలు. పార్టీ సింబల్‌తో సంబంధం లేకున్నా… ఆ మధ్య ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లా మంత్రులతో పాటు ఇన్చార్జ్ మంత్రులు బాధ్యులుగా ఉండాలని చెప్పారు. కానీ ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ మాత్రం పొలిటికల్ సింబల్స్ మీదే జరుగుతుండటంతో… ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ తీసుకోకూడదన్న ఉద్దేశ్యంతో సీరియస్‌గా వర్కౌట్ చేస్తోందట అధికార పార్టీ. మండల స్థాయి నాయకుల నుంచి మంత్రుల వరకు అందర్నీ పనిలో పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో మెజారిటీ స్థానాలు గెలవాలని లక్ష్యంగా నిర్దేశించారు కాంగ్రెస్ పెద్దలు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలంటే నాయకులందరి మధ్య పని విభజన ముఖ్యమన్న నిర్ధారణకు వచ్చింది హై కమాండ్. ఆ మేరకే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది.
Also Read: Nara Rohith: ‘పుష్ప’ మిస్.. ‘ఆదర్శ కుటుంబం’లో మరో అవకాశం, నారా రోహిత్ క్యారెక్టర్ ఇదే!
ముందు జిల్లా మంత్రుల సారధ్యంలో ఎలక్షన్ ప్లానింగ్ చేయాలనుకున్నా.. తర్వాత వ్యూహం మార్చేసి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మినిస్టర్స్‌కు బాధ్యతల్ని అప్పగించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నికలు లేకపోవడంతో పూర్తిస్థాయిలో అన్ని నియోజకవర్గాలకు మంత్రులను ఫిక్స్ చేశారు సీఎం రేవంత్. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ఆధారంగా మంత్రుల పని తీరును అంచనా వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాంట్లో భాగంగానే పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మంత్రి చొప్పున బాధ్యతలను అప్పగించారట. ఇక అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలుకొని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరేసే దాకా బాధ్యత మొత్తం సదరు మంత్రి భుజాల మీదే పెట్టారు. ఎన్నికల్లో రెబల్స్ బెడద లేకుండా… అంతర్గత సమస్యలన్నిటినీ పరిష్కరించుకుంటూ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి తీరాలనేది మంత్రులకు సీఎం చేసిన దిశానిర్దేశం. దీంతో…. మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాల ఆధారంగా భవిష్యత్తు రాజకీయ పరిణామాలు, మార్పులు చేర్పులు ఉండబోతున్నాయన్న చర్చ నడుస్తోంది. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే.. మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు అప్పగించి సీఎం రేవంత్‌రెడ్డి మంత్రుల మెడపై కత్తి పెట్టారని మాట్లాడుకుంటున్నాయి రాజకీయవర్గాలు.
