OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు

  • టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
  • రెండు చోట్ల దశాబ్దాలుగా గెలుపు గగనమైన వైనం
  • రెండు నియోజకవర్గాల్లో పట్టు బిగించాలని చంద్రబాబు ఆదేశం
  • మినిస్టర్స్‌ ఔట్‌రీచ్‌ పేరుతో నిమ్మల, సవిత కార్యక్రమం
  • మంత్రుల మీటింగ్‌లో సైతం సమన్వయం కుదరని వైనం
Otr (1)

Otr (1)

OTR: ఒక్కొక్కరు కాదు…. ఒకేసారి ఇద్దరు మంత్రులు. ఇక మీదట మోహరింపులు మామూలుగా ఉండవని టీడీపీ అధిష్టానం చెప్పినా…. ఆ రెండు నియోజకవర్గాల్లో వాతావరణం తేడాగానే ఉందా? గెలుపు మాట మర్చిపోయిన రెండు చోట్ల ఈసారి స్థానిక ఎన్నికల్లో దుమ్ము రేపాలన్న అధిష్టానం ఆశలు అంత తేలిగ్గా నెరవేరే సూచనలు కనిపించడం లేదా? ఏవా రెండు నియోజకవర్గాలు? పార్టీ పెద్దలు సీరియస్‌గా ఉన్నా… లోకల్‌ లీడర్స్‌కు డౌట్స్‌ ఎందుకు వస్తున్నాయి? ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీకి అస్సలు మింగుడు పడని అసెంబ్లీ నియోజకవర్గాలు ఆలూరు, మంత్రాలయం. ఎన్నిక ఏదైనా సరే… ఇక్కడ ఎప్పుడూ ఆ పార్టీ ప్రత్యర్థులదే పైచేయిగా ఉంటోంది. పాతికేళ్లకు పైగా ఒక నియోజకవర్గంలో, 2009లో ఏర్పాటైన మరో నియోజకవర్గంలో వరుసగా మూడు సార్లు ఓడిపోయింది తెలుగుదేశం. ఇక స్థానిక ఎన్నికల్లోనూ రెండు చోట్ల టీడీపీకి దక్కుతున్నది అంతంత మాత్రమే. దీంతో… ఈసారి చరిత్రను తిరగరాయాలని భావిస్తోందట టీడీపీ అధిష్టానం.

వచ్చే స్థానిక ఎన్నికల్లో ఆలూరు, మంత్రాలయంపై పట్టు బిగించాలన్న పట్టుదలతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఉన్నట్టు చెబుతున్నారు. మొన్న జూన్, జులైలో ఈ రెండు నియోజకవర్గాల్లో పర్యటించినపుడు అక్కడి పరిస్థితులు ఆయనకు పూర్తిగా బోథపడ్డాయట. అందుకే ఇబ్బందుల్ని సెట్‌ చేసుకుంటూ…. లోకల్‌ బాడీస్‌తో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండు చోట్ల టీడీపీ జెండా ఎగిరేలా చేయాలని నాయకుల్ని ఆదేశించినట్టు తెలిసింది. అంతర్గత పోరు, వెన్నుపోట్లతోనే చాలా సందర్భాల్లో ఇక్కడ టీడీపీ ఓటమి పాలైంది. గ్రూపుల కారణంగా ఆలూరులో తీవ్ర నష్టం జరుగుతోందని గ్రహించిన చంద్రబాబు ఇటీవలి టూర్‌లో స్థానిక నేతలకు దిశానిర్దేశం చేశారు. కలిసి పనిచేయాలని, వర్గాలు సృష్టించవద్దని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారట. వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మకు, మాజీ ఇంచార్జి వీరభద్ర గౌడ్, నియోజకవర్గ ఇంచార్జి వైకుంఠం జ్యోతి వర్గానికి మధ్య బాగా గ్యాప్ ఉందని పార్టీ నాయకులే చెబుతున్నారు. ఆలూరులో టీడీపీకి బాగా పట్టున్నా… నేతల్లో అనైక్యత పార్టీకి నష్టం చేస్తోంది. అందుకే…. జిల్లా ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి సవిత ఇక్కడ మినిస్టర్స్ ఔట్ రీచ్ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలోనూ పూర్తి స్థాయిలో సమన్వయం కుదరలేదట. బొజ్జమ్మ అతికష్టం మీద మంత్రుల కార్యక్రమంలో పాల్గొన్నట్టు చెప్పుకుంటున్నారు. ఒక దశలో ఇంచార్జి వైకుంఠం జ్యోతి ఇంట్లో నిర్వహించిన మంత్రుల సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా… చివరికి మరీ… తప్పని పపిస్థితుల్లో వెళ్లినట్టు తెలిసింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచితీరాల్సిందేనని ఈ మీటింగ్‌లో దిశా నిర్దేశం చేశారట మంత్రులు ఇద్దరూ. ఇక మంత్రాలయం నియోజకవర్గం విషయానికి వస్తే… 2009 పునర్విభజనలో ఏర్పాటైంది. ఆ ఒక్కసారి మినహా… తర్వాత ఎప్పుడూ మంత్రాలయంలో టీడీపీ జెండా ఎగరనే లేదు. అందుకు బలమైన ప్రత్యర్థితో పాటు టీడీపీలో గ్రూప్ వార్‌ కూడా కారణమని అధిష్టానం పరిశీలనలో తేలిందట. సీఎం చంద్రబాబు ఆ మధ్య నియోజకవర్గంలో పర్యటించినపుడు స్తానిక పరిస్థితులపై ఆరా తీశారు. బలమైన ప్రత్యర్థిగా బాలనాగిరెడ్డి ఉండడం, అందులోనూ… 7 గ్రామాలు పూర్తిగా ఆయన నియంత్రణలోనే ఉండటం ఇందుకు కారణమని తేలిందట. ఇక టీడీపీ అంతర్గత పోరు సరేసరి. ఈ క్రమంలో సీఎం ఆదేశాలతో మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్ నియోజకవర్గంలో పర్యటించి ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. కూటమి పార్టీల నేతలతోను భేటీ అయ్యారు. బీసీలు అత్యధికంగా ఉన్న మంత్రాలయంలో ఓడిపోవడంపై ముఖ్య నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారట.

పార్టీలో గ్రూపులు ఉండడానికి వీలు లేదని, ఒకే గ్రూప్ ఉండాలని చెప్పినట్టు సమాచారం. సమన్వయం కోసం ఏర్పాటు ఈ సమావేశంలో టీడీపీలో విబేధాలు బయటపడ్డాయంటున్నారు. జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు తిక్కారెడ్డి వర్గం ఈ మీటింగ్‌కు దూరంగా ఉంది. తిక్కారెడ్డికి అసలు మీటింగ్‌ కోసం ఆహ్వానం అందనే లేదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రుల పర్యటన ఎంతవరకు ఫలితం ఇచ్చిందన్న అనుమానాలు టీడీపీ వర్గాల్లోనే తలెత్తుతున్నాయి. సమన్వయం సాధించి స్థానిక ఎన్నికల్లో గెలవాలని తలపెట్టిన మంత్రుల పర్యటన పూర్తి స్థాయిలో ఐక్యత సాధించలేకపోయిందా అన్న డౌట్స్‌ అలాగే ఉన్నాయి. మొత్తమ్మీద అధిష్టానం సీరియస్‌ అయి ప్రత్యేక చర్యలు తీసుకున్నా… రెండు నియోజకవర్గాల టీడీపీలో అంతర్గతంగా ముదిరిపోయిన విబేధాలను రూపుమాపడం అంత ఈజీ కాదన్న అభిప్రాయం మాత్రం ఇప్పటికీ బలంగానే ఉంది.