OTR: నో కాంప్రమైజ్…. స్థానిక ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవాలకు ఛాన్సే లేదు. నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లు ఎవరైనా కాంప్రమైజ్ అయితే ఈసారి వాళ్ళు ఎమ్మెల్యే టిక్కెట్ మర్చిపోవడమేనని క్రిస్టల్ క్లియర్‌గా చెప్పేశారు వైసీపీ అధ్యక్షుడు జగన్. కానీ… ఆ ఉమ్మడి జిల్లాలో పార్టీ నాయకులు మాత్రం ఏకగ్రీవం పాట పాడుతున్నారు. పైగా…అధికార పక్షానికి ఓపెన్‌గానే బంపరాఫర్స్ ఇస్తున్నారు. ఎందుకలా చేస్తున్నారు? అధినేత ఆదేశాలకు భిన్నంగా ప్రకటించడం వెనకున్న ధైర్యం ఏంటి?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీకి ఈ ఎలక్షన్స్ అత్యంత కీలకంగా మారాయి. అటు పార్టీ అధినేత జగన్ సైతం ఈ ఫలితాలను బట్టే వచ్చే అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్లు డిసైడ్ అవుతాయని తేల్చి చెప్పేశారు. ఎక్కడా రాజీ పడకుండా, అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను రంగంలోకి దించాలని జిల్లాల నేతలు చెప్పేశారు. ఆ ప్రకారమే వివిధ జిల్లాల్లో క్యాండిడేట్స్ వేట జరుగుతోందట.
అయితే ఉమ్మడి అనంతపురంలో ఆ పనితో పాటు నాయకులు కాస్త డిఫరెంట్ గేమ్ ఆడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక్కడి సమన్వయకర్తలు సరికొత్త రాజకీయ పంథాను ఎంచుకుంటున్నారట. పోటీ విషయంలో ఏకంగా అధికార పార్టీకే ఓపెన్ ఆఫర్స్ ఇస్తూ…కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. అయితే… అది మైండ్ గేమ్ అన్నది మరి కొందరి అభిప్రాయం. ముందు మీరు సమస్యలను పరిష్కరించండి.. మేం అస్సలు పోటీలో ఉండబోము, మీరే ఏకగ్రీవాలు చేసుకోవచ్చంటూ ప్రకటించడం రాజకీయ సంచలనం అవుతోంది. ఈ కొత్త ట్రెండ్ ధర్మవరం నియోజకవర్గం నుంచి మొదలైంది. అక్కడ కూటమి నేతల మధ్య విబేధాలు ఉండటం, అలాగే బీజేపీ నేతలు చేస్తున్న వ్యవహారాలను క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. పైగా అసెంబ్లీ ఎన్నికల్లో తాను బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయానన్న ఆవేదన సైతం ఉందట ఆయనలో. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టి తన పట్టు నిరూపించుకునే దిశగా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే కూటమి నేతలకు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆఫర్ ఇచ్చారు. నేతన్న నేస్తం కింద ధర్మవరంలో అర్హులైన చేనేత కార్మికులందరికీ… 25వేలు చొప్పున సాయం అందించాలని, అలాగే గతంలో అనర్హులకు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని మొదట్నుంచి డిమాండ్ చేస్తున్నారాయన.
అయితే కూటమి నాయకులు మాత్రం తాము అందరికీ పథకాన్ని అందిస్తున్నామని చెప్పుకుంటున్నారు. అందుకు తాజాగా కేతిరెడ్డి స్పందిస్తూ… మేం చెప్పినట్టు అర్హులందరికీ పథకాన్ని వర్తింప జేసి.. అనర్హులకు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అస్సలు పోటీ చేయబోం, మీరే ఏకగ్రీవం చేసుకోవచ్చంటూ సంచలన ప్రకటన చేశారు. దీని గురించి నియోజకవర్గంలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగానే…. మరో చోట ఇలాంటి ప్రకటనే వచ్చింది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా ఇదే రాగం అందుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని అత్యంత కీలకమైన పేరూరు జలాశయానికి సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారాయన. అలాగే ఎల్-నినో ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. హంద్రీనీవా, పీఏబిఆర్ నుంచి నియోజకవర్గంలోని చెరువులన్నింటికీ నీరు ఇవ్వాలని అడుగుతున్నారు. ఇందుకోసం జల దీక్ష పేరుతో కార్యక్రమం నిర్వహించారు తోపుదుర్తి. ఈ దీక్ష వేదికగానే కూటమికి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. తన సాగునీటి డిమాండ్‌ను నెరవేరిస్తే… రాప్తాడు నియోజకవర్గ పరిధిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను నిలబెట్టబోమని ప్రకటించారాయన.
ప్రస్తుతం ఇదే బాటలోనే మరికొందరు వైసీపీ నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి డిమాండ్స్‌ను ముందుకు తీసుకురావడం ద్వారా అధికార పక్షాన్ని డిఫెన్స్‌లోకి నెట్టాలన్న మైండ్ గేమ్ ఇందులో ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తాము చేస్తున్న డిమాండ్స్‌ని ఇప్పటికిప్పుడు నెరవేర్చే పరిస్థితేం ఉండదుగనుక…. ఎన్నికల్లో దాన్నే అస్త్రంగా వాడుకునే ఆలోచన కూడా ఉండి ఉంటుందని అంటున్నారు. ప్రజా సమస్యల పరంగా అధికార పక్షం మీద వత్తిడి పెంచడం ఒక వ్యూహమైతే.. అదే సమయంలో దాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకుని ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టాలన్న ప్లాన్ అనంతపురం వైసీపీ నేతలకు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఫైనల్‌గా ఫలితం ఎలా ఉన్నా… ఈ ట్రెండ్ మాత్రం కొత్తగా ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

