OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!

  • డైరెక్ట్‌ మేయర్‌ ఎన్నికతో విశాఖలో కొత్త ఆలోచనలు
  • ఏపీ మొత్తం మీద అతిపెద్ద మున్సిపల్‌ కార్పొరేషన్‌
  • వైసీపీ తరపున రేస్‌లో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు
  • మేయర్‌ రేస్‌లోకి టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు సైతం
Otr (2)

Otr (2)

OTR: కొడితే కొట్టాలిరా…. సిక్స్‌ కొట్టాలి అంటూ కొత్తగా సాంగులు సింగుతున్నారట అక్కడి టీడీపీ శాసనసభ్యులు. ఎహె…. ఎమ్మెల్యే పదవిదేముంది, అలాంటోళ్ళు స్టేట్‌లో చాలామందే ఉన్నారు కదా…! కానీ… ఆ ఒక్క పోస్ట్‌ కొట్టగలిగితే చాలు.. ఏక్‌దమ్‌ సెట్‌. మర్యాదకు మర్యాద, మనీ పరంగా భారీ బడ్జెట్‌. దాని కోసం ఎమ్మెల్యే పోస్ట్‌ వదులుకోవడానికి కూడా రెడీ అవుతున్నారట. చిటారు కొమ్మన మిఠాయి పొట్లంలా ఊరిస్తున్న ఆ పదవి ఏది? టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు అంతలా తపిస్తున్నారు? ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలు నేతల్లో కొత్త ఆలోచనలకు పురుడు పోస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్‌ విశాఖలో అయితే…. యవ్వారం ఇంకా తేడాగా ఉందట. కొత్త కొత్త రాజకీయ ఆలోచనలకు నగరం వేదిక అవుతోందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మేయర్స్‌ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరగ్గా…. ఇక నుంచి ప్రత్యక్ష విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఫిరాయింపులకు చెక్‌ పెట్టాలన్నది దాని ఉద్దేశ్యం అని చెబుతున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా… ప్రత్యక్ష పద్ధతిలో మేయర్‌ ఎన్నిక అనేసరికి ఒక్కసారిగా పొలిటికల్‌ అటెన్షన్‌ పెరిగిపోయింది. ఏపీ మొత్తం మీద అతి పెద్ద మున్సిపల్‌ కార్పొరేషన్‌గా అవతరించబోతున్న విశాఖ మేయర్ పీఠం సంగతైతే ఇక చెప్పే పనేలేదు. సమర్థుడైన మేయర్ అభ్యర్థి ఎవరంటూ ఇటు కూటమిలో, అటు విపక్షం వైసీపీలో తీవ్ర స్థాయి చర్చలే జరుగుతున్నాయి. సరిగ్గా ఇక్కడే ఆసక్తికరమైన ప్రచారాలు జరుగుతున్నాయి. చట్ట సభల్లో తలపండిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వైసీపీ నుంచి ఇద్దరు ముగ్గురు మాజీల పేర్లు కూడా మేయర్‌ రేస్‌లో తెర మీదికి వచ్చాయి. పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ఆదేశిస్తే సిద్ధం అంటూ… సంకేతాలు యిచ్చారు రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్. మరో మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ అయితే ఎలా ఉంటుందన్న చర్చ కూడా పార్టీలో ఉందట.

సరే… వాళ్ళు మాజీలు కాబట్టి ఏదో ఒక పదవి కోసం పాకులాడుతున్నారని అనుకోవచ్చు. కానీ… టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కొందరు కూడా… మేయర్‌ పదవి కోసం పోటీ పడుతున్నారన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. దీనికి సంబంధించిన మౌత్‌ పబ్లిసిటీ ఎక్కువగా ఉంది. విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచిన వెలగపూడి రామకృష్ణ బాబు, నార్త్ నియోజకవర్గం నుంచి రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పశ్చిమ నియోజకవర్గ సీనియర్ ఎమ్మెల్యే గణబాబు, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద్, గండి బాబ్జి వంటి ముఖ్య నేతల నోటి నుంచి మేయర్ పోటీ మాట వినిపిస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వెలగపూడి, విష్ణు, గంటా, గణబాబు తమ వారసుల కోసం సీట్లు రిజర్వ్ చేస్తుండగా…మరో ఎమ్మెల్యే తన భార్యకు అవకాశం కల్పించాలని హై కమాండ్ ఎదుట ప్రతిపాదన పెట్టినట్టు తెలిసింది. ఇక్కడ వరకు బానే ఉన్నా సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం ఛాన్స్ ఇస్తే మేయర్ గా వెళ్ళిపోవడమే మంచిదని సన్నిహితులతో చిట్‌చాట్‌లో చెబుతున్నారట. సరదాగా అన్నారో, సీరియస్‌గా చెప్పారోగానీ… మాజీ మంత్రి గంటా అన్న మాటల చుట్టూ గట్టి చర్చలే నడుస్తున్నాయి. మీ అబ్బాయి మేయర్ అభ్యర్థి అవుతారా అని మీడియా అడిగితే….ఏం… నేను కాకూడదా..?. అంటూ ఆయన రియాక్ట్‌ అవడం కొత్త చర్చకు దారితీసింది.

గంటా వ్యాఖ్యల సంగతి ఎలా ఉన్నా… ఒకరిద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు మాత్రం మేయర్‌ ఛాన్స్ వస్తే వదులుకోకూడదని భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకు వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. జీవీఎంసీ పరిధిలో మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు ఎంపీ సీట్లు ఉన్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ సిటీ మధ్య డేటా, ఐటీ ఆధారిత పరిశ్రమలు., భారీ పెట్టుబడులతో బహుళ జాతి పరిశ్రమలు ముందుకొస్తున్నాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అనందవరం, పద్మనాభం, భీమిలి, పెందుర్తి మండలాలను సిటీలో విలీనం చేసేందుకు గ్రామసభల ద్వారా తీర్మానాల ప్రక్రియ కొనసాగుతోంది. ఆ విలీనం పూర్తయ్యాక డివిజన్స్‌ సంఖ్య 150 వరకు పెరగవచ్చు. వీటన్నిటికీ మించి ప్రస్తుతం గ్రేటర్‌ విశాఖ బడ్జెట్ నాలుగు వేల కోట్లకు పైమాటే. ఈసారి మేయర్ ఎన్నిక డైరెక్ట్‌ కావడంతో విస్తృతమైన అధికారాలు లభిస్తాయి. నేరుగా ప్రభుత్వానికి తప్ప ఎమ్మెల్యేలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం చాలా తక్కువ. పైగా… రాష్ట్రంలో ప్రభుత్వం మారినా… ఐదేళ్ల వరకు తన పొజిషన్, పవర్‌కు ఢోకా ఉండదు. సరిగ్గా… ఇలాంటి లెక్కలతోనే… కొందరు సిట్టింగులు ఊగుతున్నారట. వారసుల కోసం ఆలోచిస్తున్న సీనియర్స్‌ లెక్కలు కూడా కాస్త డిఫరెంట్‌గానే ఉన్నాయంటున్నారు. లోకల్‌గా గ్రిప్‌ ఉంటుంది కాబట్టి… మేయర్‌గా ఎన్నికైతే…. వారసులు పాలనాపరంగా అనుభవం సంపాదించుకోవడంతో పాటు తమ ప్రమేయం లేకుండా వాళ్ళే అధినాయకత్వానికి మరింత సన్నిహితం కావచ్చన్న ఆలోచన ఉన్నట్టు తెలిసింది. ఇలా… ఎవరికి వారు రకరకాల ఈక్వేషన్స్‌తో ఫీలర్స్‌ వదులుతున్నారట. ఈ ట్రయల్స్‌ ఎంతవరకు వర్కౌట్‌ అవుతాయి? అధిష్టానం మనసులో ఏముందన్న సంగతి త్వరలోనే తేలిపోతుందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.