OTR: ఆ మున్సిపాలిటీలో కూటమి కుమ్ములాట ఇక వీధికెక్కినట్టేనా? ఒప్పందం ప్రకారం టీడీపీకి దక్కాల్సిన వైస్ ఛైర్మన్ పదవిని జనసేన ఎలా కొట్టుకెళ్ళగలిగింది? తెలుగుదేశం నాయకులు దీన్ని తీవ్ర అవమానంగా భావిస్తున్నారా? అధిష్టానాల దృష్టికి వెళ్ళినా సెట్ అవుతుందా? లేదా? అన్న అనుమానాలు పెరుగుతోంది ఎక్కడ? మిత్రుల మధ్య పొలిటికల్ వార్ ఎందుకు పెరుగుతోంది? తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక కూటమిలో అంతర్గత విభేదాలను రోడ్డున పడేసింది. ఇక్కడ చైర్మన్ పదవి జనసేనకు, వైస్ చైర్మన్ పదవిని టీడీపీకి ఇవ్వాలన్నది ముందు కుదిరిన ఒప్పందం. ఆ ప్రకారమే ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కానీ… తీరా వైస్ ఛైర్మన్ ఎన్నిక దగ్గరికి వచ్చేసరికి తేడా కొట్టింది. ముందు అనుకున్న ప్రకారం టీడీపీ తరఫున కొమ్మిన వెంకటేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని మంత్రి కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ప్రకటించినప్పటికీ.. చివరి నిమిషంలో జనసేనకే చెందిన తోపరాల కల్యాణ చక్రవర్తి బరిలోకి దిగడంతో సీన్ మొత్తం మారిపోయింది.
మొత్తం 32 మంది కౌన్సిలర్స్ ఉండగా… అందులో 13 మందే టీడీపీ అభ్యర్థి వెంకటేశ్వరరావుకు మద్దతు పలికారు. అటు రెబెల్ అభ్యర్థి కల్యాణ చక్రవర్తికి చైర్ పర్సన్‌తో పాటు జనసేన నుంచి 15 మంది, బీజేపీ నుంచి ఒకరు, వైసీపీ నుంచి ఇద్దరు మద్దతు ఇవ్వడంతో విజయం సాధించారు. అయితే… పార్టీ బీ ఫామ్ లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ పరిణామంపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన కూటమి ధర్మాన్ని ఉల్లంఘించిందంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పించారాయన. ఆ పార్టీకి చైర్మన్ పదవి ఇచ్చేందుకు టీడీపీ ఒక స్థానాన్ని త్యాగం చేసిందని, అయినప్పటికీ వైస్ చైర్మన్ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు శేషారావు. లోకల్ ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్‌కు పలుమార్లు ఫోన్ చేసి కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరినా స్పందన లేదని ఆరోపిస్తున్నారాయన. మరోవైపు ఈ వ్యవహారాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. తమ పార్టీకి చెందిన మంత్రి దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే కూటమి ధర్మానికి విరుద్ధంగా పరిణామాలు జరగడంపై దుర్గేష్‌ను వివరణ కోరినట్టు తెలిసింది.
అయితే… టీడీపీ అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని తాను జనసేన కౌన్సిలర్లకు స్పష్టంగా చెప్పానని, వారు వినకుండా వెళ్లిపోయారని పార్టీ అధ్యక్షుడికి వివరణ ఇచ్చారట. పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే సస్పెన్షన్ తప్పదని హెచ్చరించడంతో…. కళ్యాణ్ చక్రవర్తితో వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారాన్ని టీడీపీ కూడా తేలిగ్గా తీసుకోవడంలేదట. ఆ పార్టీ నాయకులు దీన్ని తీవ్ర అవమానంగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి నిరసనగా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నడిమాండ్తో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి నిరాహార దీక్షకు దిగుతారన్న ప్రచారం ఇంకా ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ అదే జరిగితే నిడదవోలులో కూటమి కొట్లాటలు వీధిన పడటం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ఈ పరిణామాలతో నియోజకవర్గంలో కూటమి సమన్వయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి వ్యవహారం ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరుగా మారినట్టు కనిపిస్తోందంటున్నారు. ఇది స్థానిక నాయకుల మధ్య సమన్వయ లోపమా? లేక తెర వెనుక రాజకీయ వ్యూహాల ఫలితమా? అన్నది కూడా లోకల్‌గా హైలైట్ అవుతోంది. మున్సిపల్ వైస్ చైర్మన్ కళ్యాణ్ చక్రవర్తి ప్రస్తుతం నిడదవోలులో షాడో ఎమ్మెల్యేగా మారారన్న విమర్శలున్నాయి.
అలాగే… ఆయన మొదటి నుండి టిడిపిని టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నారట. నియోజకవర్గంలో ఇసుక, మట్టి, మద్యం దందాలు, పేకాట శిబిరాలు అన్నీ… కళ్యాణ్ చక్రవర్తి కనుసన్ననల్లోనే జరుగుతున్నాయని ఆరోపించే వారు సైతం తక్కువే కాదు. ఇంకొందరైతే… ఓ అడుగు ముందుకేసి ఆయన మంత్రిని సైతం ఎదిరించి డబ్బు అహంకారంతో రాజకీయాలను శాసించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా చెప్పుకుంటున్నారు. అదే ఊపులో ఇప్పుడు కూటమి ధర్మాన్ని విస్మరించి కాలర్ ఎగరేస్తున్నాడని అంటున్నారు ఇంకొందరు. నిడదవోలు మున్సిపాలిటీ ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో పాటు కూటమి పొత్తులో భాగంగా జనసేన కోటాలోకి వెళ్ళింది. దాంతో… తన హాస్పిటల్లో పని చేసే నర్సును ఛైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకున్నారు కళ్యాణ్ చక్రవర్తి. ఇప్పుడు తాను వైస్ ఛైర్మన్ అయిపోయి… ఛైర్‌పర్సన్‌ని డమ్మీని చేసి తానే పెత్తనం చెలాయించేలా ప్లాన్ చేసుకున్నారని అంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు. నాలుగేళ్ల వరకు తనపై అవిశ్వాసం పెట్టే అవకాశం లేనందున… ఒకవేళ జనసేన నుంచి సస్పెండ్ చేసినా….స్వతంత్రుడిగా కొనసాగాలన్న ఆలోచనతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వైస్ ఛైర్మన్‌తో మొదలైన వివాదం.. ఇప్పుడు పార్టీ అధిష్టానం జోక్యం చేసుకునే స్థాయికి చేరింది. దీంతో…నిడదవోలు రాజకీయాల్లో తదుపరి అంకం ఏమిటి? వైస్ ఛైర్మన్‌తో నయానో భయానో రాజీనామాతో చేయించి విదాదానికి తెరదించుతారా? లేక స్థానికంగా అసమ్మతి కుంపట్లు గట్టిగా అంటుకుంటాయా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.

