పోలీసులు, పొలిటికల్ లీడర్స్ కంటే అక్కడ పేకాట క్లబ్స్ నిర్వాహకులే బాగా పవర్ ఫుల్లా?. పోలీస్ లాఠీకే చుక్కలు చూపించేంతలా కోత ముక్క తిరుగుతోందా?. తమ యాపారానికి అడ్డుపడే వాళ్ళు ఎంతటి వాళ్లయినాసరే.. వాళ్ళు వదిలిపెట్టబోరా?. ఆ విషయంలో ప్రభుత్వానిది కూడా ప్రేక్షక పాత్రేనా?.. ఎక్కడ జరుగుతోందా వ్యవహారం? ఏంటా పేకాట పంచాయితీ?.
భీమవరం అంటేనే… బ్రాండ్ ఆఫ్ బెట్టింగ్స్, కేరాఫ్ కోడి పందేలు అన్నది విస్తృతాభిప్రాయం. ఇక ఇక్కడ పేకాట గురించి అయితే… ఇక చెప్పేపనేలేదు. మిగతా రెండిటి విషయంలోనన్నా.. సీజన్ ఉంటుందిగానీ…కోత ముక్కకు అలాంటిదేం లేదని, ఇక్కడి క్లబ్బుల్లో 365 రోజులూ కొయ్ రాజా కొయ్ అన్న మాటలే వినిపిస్తుంటాయంటారు. కేవలం చుట్టుపక్కల జిల్లాలే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పేకాట పాపారావులు ఇక్కడికి వచ్చి ముక్కల్లో మునిగి తేలుతూ ఉంటారు. పది వేల నుంచి 10 లక్షల దాకా… ఏ రేంజ్‌కి ఆ రేంజ్ ఆట, అందుకు తగ్గ సదుపాయాలు కల్పించి కొత్త అల్లుళ్ళలా చూసుకుంటారన్నది లోకల్ టాక్. మొదట్లో ఒకరకంగా ఉన్నా… రానురాను ఇదో మాఫియా కింద తయారైపోయిందని చెప్పుకుంటారు. అది కూడా ఏ రేంజ్‌లో అంటే… పేకాట క్లబ్‌లను టచ్ చేస్తే చాలు…. ఎంత పెద్ద ఆఫీసర్‌కైనా షాక్ కొట్టేలా మారిపోయిందంటున్నారు. అడ్డగోలు ఆదాయానికి అలవాటు పడ్డ క్లబ్స్ నిర్వాహకులు దాన్ని వదులుకోలేక… వ్యవస్థల్ని సైతం ప్రభావితం చేసే రేంజ్‌కి చేరుకున్నారన్నది భీమవరం లేటెస్ట్ వాయిస్. అందుకోసం ఎంత దూరమైనా వెళ్తున్నారని, ఇటీవల జరిగిన డీఎస్పీ జయసూర్య బదిలీనే ఇందుకు తాజా ఉదాహరణ అని చెప్పుకుంటున్నారు.
భీమవరంలో పేకాట క్లబ్బుల నిర్వహణకు సహకరించినందుకుగాను స్థానిక ఎమ్మెల్యేకు నెలకు 25 నుంచి 30 లక్షల రూపాయల ముడుపులు ముడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇక ఉన్న క్లబ్‌లు చాలవన్నట్టు ఎమ్మెల్యే తాలూకు ఛోటా నేత ఒకరు కొత్త శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో మేటర్ మలుపు తిరిగిందట. ఎలాగైనా పేకాటను అరికట్టాలనుకున్న పోలీస్ ఉన్నతాధికారులు అన్ని క్లబ్‌లతో పాటు ఎమ్మెల్యే సన్నిహితుడైన ఛోటా నేత క్లబ్‌ని కూడా మూసేయమని ఆదేశించడంతో స్థానిక జనసేన నాయకులకు, ఆఫీసర్స్‌కు మధ్య వివాదం మొదలైనట్టు చెప్పుకుంటున్నారు. ఇక్కడే నాయకులు తమ పొలిటికల్ టాలెంట్ మొత్తాన్ని వాడేసి మేటర్‌ని మరో రూపంలో పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళి రాంగ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వడం, ఆయన విచారణకు ఆదేశించడం, ఫైనల్‌గా డీఎస్పీని వీఆర్‌కు పంపడం వరుస పరిణామాలు. పేకాట క్లబ్‌ల మీద వచ్చే ఆదాయాన్ని వదులుకోలేని ఛోటా నేతలు అధికారాన్ని ఏరకంగా అయినా ఉపయోగించగలరు, ఎంతకైనా తెగిస్తారనడానికి ఈ సంఘటనలే ఉదాహరణ అంటున్నారు లోకల్‌గా. డీఎస్పీ విషయంలో తమ పవర్ చూపించిన పేకాట క్లబ్స్ నిర్వాహకులు తాజాగా భీమవరంలో అనధికారికంగా మళ్లీ ఓపెన్ చేసినట్టు సమాచారం. కేవలం ఈ క్లబ్స్‌ని నడిపించుకోవడం కోసమే, వాటికి అడ్డుపడిన డివిజనల్ స్థాయి అధికారిని బలి చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి లోకల్‌గా. ఇక సంక్రాంతి సీజన్ మొదలైపోవడంతో… నిరాటంకంగా రెండు నెలలపాటు భీమవరంలో పేకాట క్లబ్బులతో పాటు, వేర్వేరు చోట్ల జూద శిబిరాలు పెద్దఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మేటర్ ఏదైనాసరే… తాము చేసిన ఫిర్యాదుతో డీఎస్పీ స్థాయి అధికారిని పక్కకు పెట్టడాన్ని గొప్పగా ఫీలవుతున్నారట జూద శిబిరాల నిర్వాహకులు. ఇక ఇప్పుడు పోలీసులు తమను ఏమీ చేయలేరన్న ధీమాతో ఈసారి ఇంకొంచెం ఎక్కువ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
అదే సమయంలో కాస్తో కూస్తో కూడా పోలీసుల వల్ల ఇబ్బందులు రాకుండా… ఈ సీజన్‌లో పోలీసులను జాగ్రత్తగా చూసుకోవాలని కూడా డిసైడైనట్టు సమాచారం. వాతావరణం చూస్తుంటే… ఈసారి భీమవరంలో 30 క్లబ్‌లు, 300 ఆటలు అన్నట్టుగా వ్యవహారం ఉండవచ్చంటున్నారు. అదే సమయంలో ఇందులోకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా వస్తోంది. అధికారులపై పార్టీ నాయకులు అవినీతి ఆరోపణలు వస్తే వెంటనే ఎంక్వైరీకి ఆదేశించిన డిప్యూటీ సీఎం… ఇక్కడ యధేచ్ఛగా సాగిపోయే పేకాట క్లబ్బుల విషయంలో మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించేవాళ్ళు సైతం ఉన్నారు. భీమవరంపై ప్రత్యేక ఫోకస్ పెడతానన్న పవన్ పేకాట క్లబ్బుల నిర్వాహకులకులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దామంటూ కాస్త సెటైరిక్‌గా మాట్లాడే వాళ్ళు సైతం ఉన్నారు స్థానికంగా. సంక్రాంతి పండగ సమయంలో కోడి పందేల వరకు ఇక్కడి ప్రజలు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆస్వాదిస్తారు. కానీ… పేకాట క్లబ్బుల విషయంలో మాత్రం అభ్యంతరాలున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి మరీ అడుతూ… భీమవరాన్ని జూద కేంద్రంగా మార్చుతున్నారన్న అభ్యంతరాలున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దలు ఎంతవరకు పట్టించుకుంటారో చూడాలంటున్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి.