ఈ ఏడాది తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది అధికారపార్టీ BRS. కొద్దిమంది సిట్టింగ్ MLAలకు పని మొదలు పెట్టమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే ప్రస్తుతం గులాబీ శిబిరంలో చర్చగా మారింది. కొద్దిమందికే అలా ఎందుకు చెప్పారు? మిగతావాళ్ల పరిస్థితి ఏంటి? మార్పులు ఉంటాయా?
చతురంగ బలగలాను సిద్ధంచేస్తున్న గులాబీ బాస్..!
అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణలోని పార్టీలన్నీ సన్నద్ధం అవుతున్నాయి. అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌పార్టీ.. మొదటిసారి పవర్‌లోకి వచ్చి సత్తా చాటాలని బీజేపీ చూస్తుంటే.. హ్యాట్రిక్ విజయం కోసం వ్యూహ రచన చేస్తోంది అధికారపార్టీ బీఆర్‌ఎస్. ఇందుకోసం గులాబీ పార్టీ ముందు నుంచే కసరత్తు మొదలుపెట్టింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల స్పీడ్ పెంచుతూనే పార్టీలోని చతురంగ బలగాలను సమాయత్తం చేస్తున్నారు పార్టీ అధినేత. ఇందులో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారని సమాచారం. అయితే ఆ విషయం బయటకు చెప్పకుండా.. ఎవరైతే అభ్యర్థి అనుకుంటున్నారో.. వాళ్లకు పిలిచి చెప్పేస్తున్నారట. నియోజకవర్గంలో పనిచేసుకోవాలని.. మీరే క్యాండిడేట్‌గా ఉంటారని స్పష్టత ఇస్తున్నారట. ఎంతో సమయం లేదు.. వెంటనే ఫీల్డ్‌లోకి వెళ్లండి.. ఎన్నికలకు ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహ రచన చేసుకోవాలని చెప్పేస్తున్నారట.
30-35 మందికి ఓకే చెప్పేశారా?
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సమయంలోనే బీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు కీలక నేతలు.. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిచి.. ఎన్నికలకు రెడీ కావాలని చెప్పారట. ఎక్కడ క్లారిటీ అవసరం ఉందో.. అక్కడ అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారట. ఈ విధంగా ఇప్పటి వరకు 30 నుంచి 35 మందికి ఓకే చెప్పినట్టు అధికారపార్టీలో చెవులు కొరుక్కుంటున్నారు. అయితే అధిష్ఠానం ఆదేశాలతో ఫీల్డ్‌లోకి వెళ్లిన అభ్యర్థులెవరూ తామే క్యాండిడేట్ అన్నట్టు చెప్పుకోవడం లేదు. కానీ.. ఆ సంకేతాలు కేడర్‌లోకి… ప్రజల్లోకి వెళ్లేలా జాగ్రత్త పడుతున్నారట. ఇన్నాళ్లూ పార్టీ నుంచి స్పష్టత రాలేదని ఆవేదన చెందిన నాయకులు.. దూకుడు పెంచి జనాల్లోకి వెళ్తున్నారట.
పిలుపురాని నేతల్లో టెన్షన్..!
వాస్తవానికి ఆ మధ్య సిట్టింగ్‌లకే టికెట్స్ అని అధిష్ఠానం చెప్పింది. ఇప్పుడేమో కొందరికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తమ పరిస్థితి ఏంటి అని అధిష్ఠానం నుంచి పిలుపురాని సిట్టింగ్‌లు.. నేతలు కలవర పడుతున్నారట. అధిష్ఠానంతో సన్నిహితంగా ఉండే నాయకుల దగ్గర ఆరా తీస్తున్నారట. అయితే సమస్యలు లేనిచోట.. గెలుస్తారు అని బాగా నమ్మకం కుదిరిన అభ్యర్థులకు తగిన జాగ్రత్తలు చెప్పి ముందుగానే క్లియరెన్స్ ఇస్తున్నారనేది పార్టీ వర్గాల మాట. దశల వారీగా వడపోతల్లో మరికొందరికి కూడా టికెట్స్‌పై స్పష్టత ఇస్తారని చెబుతున్నారు.