మారుతున్న రాజకీయ పరిణామాలతో వైసీపీ గేమ్ ప్లాన్ కూడా మారుతోందా? అందుకు సంబంధించి పార్టీ అధ్యక్షుడు జగన్ సిద్ధం చేస్తున్న రూట్ మ్యాప్ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల వేదికగా పార్టీ కేడర్, లీడర్స్‌కు ఎలాంటి సంకేతాలు పంపుతున్నారు? వాటి గురించి ఫ్యాన్ వర్గాల్లో జరుగుతున్న చర్చలేంటి? ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో పొలిటికల్ హీట్ ఓ రేంజ్లో పెరుగుతోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకున్నారని, బెదిరింపులు, బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు కూటమి నేతలు. అంతలేదు, అప్పట్లో మేం అన్ని సీట్లలో పోటీ చేసి గెలిచామంటున్న వైసీపీ…. ఇప్పుడు తమ అభ్యర్థులకు నామినేషన్ల దశలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయని అంటోంది. ఈ పరిస్థితుల్లో…. సహజంగానే 2021 స్థానిక ఎన్నికల్ని ప్రస్తుత పరిస్థితుల్ని పోల్చి చర్చించుకోవడం పెరిగిపోయింది. దీనికి సంబంధించే వివిధ వర్గాల్లో హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. నాడు జరిగిన అల్లర్లు, టీడీపీ ఎన్నికల బహిష్కరణ నిర్ణయం లాంటి అన్ని అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం పులివెందుల సహా పలు ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థులకు అడ్డంకులు ఎదురయ్యాయని, నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిళ్లు తెచ్చారని, కొన్ని చోట్ల సాంకేతిక కారణాలతో తిరస్కరించారని ఆరోపిస్తోంది వైసీపీ. అయితే ఈ రెండు సందర్భాల్లోనూ.. ప్రతికూల పరిస్థితుల్లో ఎన్నికల్ని బహిష్కరించాలా… లేక బరిలో నిలబడి పోరాడాలా అన్న ప్రశ్నల చుట్టూనే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అప్పట్లో టీడీపీ ఎన్నికలు బహిష్కరణ నిర్ణయానికి భిన్నంగా…. ఇప్పుడు వైసీపీ పోరుబాట ఎంచుకుంది. మొదట్నుంచి ఇదే రూట్లో ఉన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్. 2024 ఎన్నికల్లో11 సీట్లకే పరిమితమైనా, మాజీ మంత్రులు, కీలక నేతలు అరెస్ట్ అనవుతున్నా… ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయంలో మాత్రం వెనక్కి తగ్గబోమంటోంది ఫ్యాన్ పార్టీ.
రైతాంగ సమస్యలు, పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలల నిర్వహణ, డీఎస్సీ వంటి అంశాల్లో ఇదే వైఖరి అనుసరించింది. ప్రతిపక్ష పార్టీ ఏదైనాసరే… పోరాటం తప్పనిరి. లేదంటే ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది. అయితే… ఇప్పుడు వైసీపీ ఆ డోస్‌ను ఇంకాస్త పెంచి పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నిరుత్సాహం పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటోందట. ఒకవైపు ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తూనే… మరోవైపు పార్టీ నాయకులు ప్రజల్లో నిరంతరం కనిపించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. అయితే… ఈ పోరాటాలు ప్రజల్లో పార్టీపై నమ్మకాన్ని తిరిగి పెంచుతాయా.. కేడర్‌ను మళ్లీ క్రియాశీలం చేస్తాయా.. అన్నది భవిష్యత్తులో తేలాల్సి ఉందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల వేళ జగన్ కేడర్‌కు ఇస్తున్న పిలుపు వెనుక మూడు లక్ష్యాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. కార్యకర్తల్లో ధైర్యం నింపడం, లోకల్ లెవల్లో పార్టీ ఉనికిని కాపాడుకోవడంతో పాటు ప్రజాస్వామ్య హక్కుల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనుకుంటున్నారన్నది ఫ్యాన్ వర్గాల ఇన్నర్ వాయిస్. నామినేషన్లకు అడ్డంకులు ఎదురైనా, బెదిరింపులు ఉన్నా… ఎన్నికల బరిలో నిలబడి పోరాడాలని తమ నేతలకు చెబుతున్నారు జగన్. పోరాటాల నుంచి పార్టీ ఎదిగిందని, ఇప్పుడు కూడా వెనక్కి తగ్గకుండా పోరాడాలని గుర్తు చేస్తున్నారట. భారీ ఓటమి తర్వాత కార్యకర్తల్లో సన్నగిల్లిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, నాయకత్వంపై విశ్వాసం తగ్గకుండా చూడటం ఏ పార్టీకైనా కీలకం. ఇక్కడే జగన్ వ్యూహం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా స్థానికంగా పార్టీ బలాన్ని చాటుకోవడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం.. కేడర్‌ను నిరంతర రాజకీయ కార్యాచరణలో ఉంచడం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని నిలబెట్టుకోవడం ఒక సవాలైతే.. ప్రజల్లో విశ్వాసాన్ని తిరిగి సంపాదించుకోవడం మరో కీలక పరీక్ష. ప్రస్తుతం జగన్ ఇస్తున్న పోరాట పిలుపు ఈ రెండింటినీ సాధించేందుకు చేస్తున్న రాజకీయ ప్రయత్నంగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఈ పిలుపు కేడర్‌ను ఎంతవరకు కదిలిస్తుంది.. వైసీపీ రాజకీయ పునర్నిర్మాణానికి ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.

