OTR : హస్తినకు వనపర్తి కాంగ్రెస్ పంచాయితీ

Wanaparti

Wanaparti

వనపర్తి పందెం కోళ్లు ఇక పూర్తి స్థాయిలో కత్తులు కట్టినట్టేనా? ఇన్నాళ్లు ఒక ఎత్తు, ఇక మీదట జరగబోయే వార్‌ మరో ఎత్తు అన్నట్టుగా పరిస్థితి మారిపోతోందా? హస్తినలో ల్యాండ్‌ అయిన ఎమ్మెల్యే మేఘారెడ్డి ఏం చేయబోతున్నారు? పార్టీ పెద్దలకు ఎలాంటి ఆధారాలు ఇవ్వబోతున్నారు? ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే పెద్దమనిషి పార్టీ లైన్ దాటారా? వనపర్తి టు ఢిల్లీ… వయా గాంధీభవన్ పంచాయితీలో ట్విస్ట్‌లు ఏంటి?

వనపర్తి కాంగ్రెస్‌ పంచాయితీ హస్తినకు చేరింది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఇటీవల చేసిన బహిరంగ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మేఘారెడ్డి… బాగా సీరియస్‌గా ఉన్నారట. అందుకే ఏఐసీసీ పెద్దలను కలిసి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీలో ల్యాండ్ అయ్యారాయన. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడమేకాకుండా…. చిన్నారెడ్డి ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ కూడా అందజేసినట్టు తెలిసింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేయబోతున్నారట. దీంతో వనపర్తి కాంగ్రెస్ లొల్లి… ఓవర్ టూ ఢిల్లీ, వయా గాంధీభవన్‌గా మారింది. డీసెంట్ పాలిటిక్స్‌కు కేంద్రంగా ఉండే వనపర్తి రాజకీయం బహిరంగ ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో ఒక్కసారిగా వేడెక్కింది. సౌమ్యుడు, వివాద రహితుడిగా పేరున్న చిన్నారెడ్డి తాజా వివాదానికి కేరాఫ్ అవడం, ఇన్నాళ్లు చిన్నారెడ్డి వర్గం నుంచి వస్తున్న విమర్శలను లైట్ తీసుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి…. ఈసారి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవడంతో వనపర్తి రాజకీయం వేడెక్కింది. ఇటీవల గోపాల్‌పేట మండలంలో ఓ సమావేశంలో మాట్లాడిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు… ఎమ్మెల్యే మేఘారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. వాటిని సీరియస్‌గా తీసుకున్న మేఘారెడ్డి.. ముందుగా క్రమ శిక్షణా సంఘం చైర్మన్‌ మల్లు రవికి ఫిర్యాదు చేశారు. తర్వాత వనపర్తి నుంచి భారీగా కాంగ్రెస్‌ శ్రేణుల్ని వెంటబెట్టుకుని గాంధీభవన్‌కు వెళ్ళి చిన్నారెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌కు కూడా కంప్లయింట్‌ ఇచ్చారాయన. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీలో సీనియర్‌ అయిన చిన్నారెడ్డి… ఎమ్మెల్యేగా తన మీద, అంతకు మించి పార్టీ అధిష్టానం పైన చేసిన వ్యాఖ్యల మీద కచ్చితంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

అదే సమయంలో బీఆర్‌ఎస్‌ నేతలు నిరంజన్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డితో చిన్నారెడ్డి టచ్‌లో ఉన్నారని ఆరోపించారు ఎమ్మెల్యే. చిన్నారెడ్డి పీఏ భాస్కర్‌ కాల్‌ డేటాను పరిశీలిస్తే ఎవరితో మాట్లాడి ఏమేం ఘాటు వ్యాఖ్యలు చేశారో.. దానివల్ల పార్టీకి ఎంత నష్టం జరిగిందో తెలిసిపోతుందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు మేఘారెడ్డి. ఇక ఇదే సమయంలో నియోజకవర్గంలోని ఆయా మండలాల ముఖ్య నేతలతో కలిసి గాంధీ భవన్ కు వెళ్లి… చిన్నారెడ్డి హటావో.. కాంగ్రెస్ బచావో అని నినాదాలతో హడావిడి చేయడం ద్వారా…. వనపర్తి హస్తం క్యాడర్ మొత్తం తనతోనే ఉందని చెప్పే ప్రయత్నం చేశారు మేఘారెడ్డి. ఎన్నికల టిక్కెట్‌ పంచాయితీ ముగిసి ఇన్నాళ్లయినా…. చిన్నారెడ్డి అసంతృప్తి వెళ్లగక్కుతుండటంతో ఇకపై పలుచన కావొద్దని ఎమ్మెల్యే భావించినట్లు తెలుస్తోంది. అందుకే… స్టేట్‌ లెవల్‌లో చేయాల్సిన ఫిర్యాదులు చేసేశాం కాబట్టి….ఇక ఢిల్లీలో… హై కమాండ్‌ లెవల్‌లోనే తేల్చుకుంటే… వాళ్ళకు కూడా పంచాయితీ అర్థమై.. కచ్చితమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావించారట. ఆ లెక్కతోనే మేఘారెడ్డి హస్తినకు పయనం అయినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్‌ మారినప్పటి నుంచి నేటి వరకు జరిగిన అన్నిటికి సంబంధించిన వీడియో, ఆడియో క్లిప్పింగ్స్‌ని సాక్ష్యాలుగా చూపబోతున్నారట. ఎన్నికల సమయంలో కలిసి రాలేదని, తనను ఓడించడానికి ప్రత్యర్థులకు మద్దతిచ్చారనే అంశాన్ని ఢిల్లీ పెద్దల ముందు ఉంచినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌లో చిన్నారెడ్డికి క్రమశిక్షణ సంఘం నుంచి షోకాజ్ నోటీస్‌లు అందగా…. రిప్లై ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇదే సమయంలో చిన్నారెడ్డి వర్గీయలు మేఘారెడ్డికి వ్యతిరేకంగా గాంధీ భవన్ ముందు ఆందోళన చేపట్టి నినాదాలు చేయడం ఆసక్తిగా మారింది. మరో పక్క ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేశాక… సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఈ అంశంపై కంప్లయింట్‌ ఇవ్వబోతున్నారట ఎమ్మెల్యే మేఘారెడ్డి. ఈ పరిస్థితుల్లో… వనపర్తి పంచాయతీని కాంగ్రెస్‌ అధిష్టానం ఏవిధంగా డీల్ చేస్తుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి పార్టీ వర్గాలు.