ఆ ఎమ్మెల్యేకు అటవీశాఖ నిద్ర లేకుండా చేస్తోందా..? అధికారులు ఆయన్ని అడవిలో ఆకుతో సమానంగా తీసేస్తున్నారా? సొంత ప్రభుత్వమే అయినా…. వీసమెత్తు మాట చెల్లుబాటవడం లేదంటూ ఆయన బాగా ఫ్రస్ట్రేట్ అవుతున్నారా? గెలిచినప్పటి నుంచి అటవీ అధికారులనే టార్గెట్ చేస్తున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? అధికారులు బీఆర్‌ఎస్ తొత్తులంటూ ఆయన అన్న మాటల మర్మం ఏంటి?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీశాఖ-అధికార పార్టీ ఎమ్మెల్యే మధ్య వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అటవీశాఖ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తుండగా… అట్నుంచి మాత్రం మౌనమే సమాధానం. ఆదివాసీలపై వేధింపులు, కాంగ్రెస్ నాయకులను లక్ష్యంగా చేసుకోవడం, టైగర్ జోన్ పేరుతో అధికారుల అత్యుత్సాహం… ఇవన్నీ కలగలిసి ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేస్తుండగా… అటవీశాఖ మాత్రం స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కవ్వాల్ టైగర్ జోన్ పేరుతో అమాయక ఆదివాసులను అధికారులు వేధిస్తున్నారని… కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు బొజ్జు. అంతేకాదు… కొందరు అధికారులు బీఆర్ఎస్, కేటీఆర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. అసలు కవ్వాల్ టైగర్ జోన్‌లో టైగరే లేదు…. అధికారులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, ప్రతిపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే.
ప్రత్యేకించి ఓ అధికారి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తొత్తు అంటూ వెడ్మబొజ్జు చేసి కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. పులులే లేని టైగర్ జోన్‌లో ఆదివాసీలను తిరగనివ్వకుండా అధికారులు అవమానకరంగా వ్యవహరిస్తున్నారంటూ ఫైరవుతున్నారాయన. ఒక్కటి రెండు సార్లు కాదు… వీలు దొరికినప్పుడల్లా అటవీశాఖ అధికారులపై మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు ఎమ్మెల్యే. ముఖ్యంగా కవ్వాల్ టైగర్ జోన్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం బీఆర్ఎస్‌కు, తొత్తుగా మారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే. అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి చెత్త అధికారులపై బదిలీ వేటు చేయాలంటూ అటవీ శాఖ మంత్రికి కూడా విజ్ఞప్తి చేశారాయన. తాను ఎంత చెప్పినా… అధికారులు మాత్రం ఇక్కడి నుంచి బదిలీ కాకపోవడం ఆయనకు మింగుడు పడ్డం లేదట. దీనికి తోడు ఇటీవల జన్నారం, ఇంధన్‌పల్లి ప్రాంతాల్లో జరిగిన ఘటనలు వివాదాన్ని మరింత వేడెక్కించాయి. ఇంధన్‌పల్లి రేంజ్‌లో ఐదుగురు ఆదివాసులను అటవీ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో… అర్ధరాత్రి కార్యాలయం ఎదుట ఆందోళన జరిగింది.
ఆందోళనకారులకు మద్దతుగా ఎమ్మెల్యే బొజ్జు స్వయంగా వెళ్ళారు. ఆదివాసులను విడుదల చేసే వరకు కదలబోనని కూర్చుని పంతం నెగ్గించుకున్నారు.అయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే. బొజ్జు గతంలో కూడా పలుమార్లు అధికారులతో వాగ్వాదానికి దిగిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుల ట్రాక్టర్లను సీజ్ చేయడం, ఆదివాసులపై కేసులు నమోదు చేయడం వంటి చర్యలతో వ్యవహారం ఎప్పుడూ ఉప్పు నిప్పులాగే నడుస్తోంది. సంబంధిత అధికారుల మీద చర్యల కోసం తాను ఎన్నిసార్లు డిమాండ్ చేసినా స్పందన లేకపోవడంపై ఖానాపూర్ ఎమ్మెల్యే తీవ్ర అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో అటవీ సంరక్షణ కోసం చట్ట ప్రకారం అధికారులు తమ విధులు నిర్వర్తిస్తున్నారని…దాన్ని రాజకీయ కోణంలో చూడకూడదనే అభిప్రాయాలు సైతం ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది నియోజకవర్గంలో. ఆదివాసుల ఆందోళనలు… అధికారుల మౌనం… అన్నీ కలిపి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త రాజకీయ చర్చకు దారి తీస్తున్నాయి.

