Site icon NTV Telugu

Off The Record : వంగవీటి రాధాకు పదవిపై త్వరలో క్లారిటీ వస్తుందా?

Vangaveeti

Vangaveeti

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు, సీఎం చంద్రబాబుకు మధ్య ఏం జరుగుతోంది? అప్పుడప్పుడూ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలుస్తుంటారు. అలా భేటీ అయిన ప్రతిసారి రకరకాల ఊహాగానాలు. తర్వాత అంతా షరా మామూలే. ఈ పరిస్థితుల్లో తాజాగా జరిగిన మీటింగ్‌లోనైనా క్లారిటీ వచ్చిందా? వంగవీటి అభిమానులకు సమాధానం దొరుకుతుందా? విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ. ఇప్పటికి ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే అయ్యారాయన. కానీ… ఆ గుర్తింపుకంటే…. కాపు యువత ఆరాధ్యుడిగా భావించే వంగవీటి మోహనరంగా వారసుడిగా రాధాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రత్యేకించి అప్పట్లో కోస్తా జిల్లాల్లో రంగాకు ఉన్న బలమైన అనుచరవర్గం కారణంగా రాధాకి కూడా ఆ సామాజికవర్గంలో అంతే ఫాలోయింగ్ ఉంది. అయితే… ఇప్పుడు రాధా టీడీపీలో ఉన్నా, కూటమి అధికారంలో ఉన్నా… గత రెండు ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ కోసం పనిచేసినా… రాధాకు లాంటి పదవి దక్కలేదన్న అసంతృప్తి వంగవీటి అభిమానుల్లో పెరుగుతోందట. ఈ పరిస్థితుల్లో తాజాగా ఆయన ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2004లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాధాకృష్ణ తొలిసారి విజయవాడ తూర్పు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారాయన. ఇక 2019, 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారాయన. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ ఎలక్షన్స్‌లో గెలిచిన వైసీపీ నుంచి ఆఫర్స్‌ వచ్చినా తిరిగి పార్టీ మారలేదు. దీంతో 2024 ఎన్నికల్లో టిడిపి గెలిస్తే ఆయనకు కచ్చితంగా భవిష్యత్తు ఉంటుందని అనుచర వర్గం భావించింది. కానీ… ప్రస్తుతం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా… రాధా భవిష్యత్‌ ఏంటో అర్ధం కావడం లేదన్న చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా చంద్రబాబుతో వంగవీటి భేటీ అవడంతో.. ఆయన అనుచరగణం కొత్త లెక్కలు వేస్తోందట. గత రెండు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున స్టార్‌ క్యాంపెయినర్‌గా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు మాజీ ఎమ్మెల్యే.

ఈ సందర్భంగా 2024లో టీడీపీ అధికారంలోకి వస్తే రాధాకు ఎమ్మెల్సీ ఇస్తామని, ఉన్నత స్థానం కల్పిస్తామని పలుమార్లు బహిరంగంగానే చెప్పారాయన. దీంతో రాష్ట్రంలో పవర్‌ మారిన వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ వస్తుందని ఎదురుచూశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇస్తారనుకున్నా లేదు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు రాధాను సీఎంఓకి పిలిపించుకొని మాట్లాడారు. దాంతో…. అప్పుడున్న పరిస్థితుల్లో పదవి ఇవ్వలేక పోతున్నామనే విషయాన్ని చెప్పారా అనే చర్చ జరిగింది. దానికి సంబంధించి అధికారికంగా ఏ వివరాలు బయటకు రానప్పటికీ రాధా మాత్రం క్యాజువల్ మీటింగ్ అని తన వర్గానికి చెప్పినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో తాజాగా మరోసారి ఇద్దరి మీటింగ్‌ జరగడంతో… పార్టీ కేడర్‌తో పాటు రాజకీయవర్గాల అటెన్షన్‌ కూడా అటువైపు మళ్ళింది. వచ్చే జూన్‌లో గవర్నర్ కోటాకు సంబంధించి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి.

జూన్‌లోనే భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది. దీంతో… ఇప్పుడు రాధా సీఎంని కలవడం ఆసక్తి రేపుతోంది. ఇద్దరి మధ్య ఎమ్మెల్సీకి సంబంధించిన చర్చలు జరిగి ఉంటాయా అంటూ ఎవరి అంచనాల్లో వాళ్లు ఉన్నారు. అయితే రాధా మాత్రం ఈసారి కూడా క్యాజువల్ మీటింగ్ అంటూ ముక్తసరి సమాధానమే చెప్పారట. ఆయన అనుచరులు మాత్రం ఈసారి ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయితే అది కచ్చితంగా తమ నాయకుడికే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మూడు పార్టీల పొత్తులో నడుస్తున్నందున ఏ సీటు కేటాయించాలన్నా… మూడు పార్టీల మధ్య చర్చ జరగాల్సిన పరిస్థితి. దీంతో… గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ ఏ ప్రాతిపదికన జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. ఏదేమైనా చంద్రబాబుతో రాధా భేటీ అయిన ప్రతిసారి ఆయనకు పదవి వస్తుందన్న ఆశతో ఎదురు చూస్తున్నారు ఆయన అనుచరులు.ఈ పరిస్థితుల్లో ఈసారి నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి పెరుగుతోంది.

Exit mobile version