Site icon NTV Telugu

Off The Record: స్వయంగా డిప్యూటీ సీఎం క్లాస్ పీకినా మారని ఎమ్మెల్యే తీరు

Janasena

Janasena

Off The Record: ఎన్ని మరకలు పడితే…. అంత గొప్ప లీడర్‌నని ఆ ఎమ్మెల్యే ఫీలైపోతున్నారా? అందుకే మరక మంచిదేనన్నట్టుగా…. అడ్డగోలు వ్యవహారాలు చేసుకుంటూ పోతున్నారా? అన్న కొడుక్కి నియోజకవర్గాన్ని అప్పగించేశారా? భూ బాగోతాలు, బదిలీల్లో బొక్కేయడాలు కామన్‌ అయిపోయాయా? స్వయంగా పవన్‌కళ్యాణ్‌ పిలిచి క్లాస్‌ పీకినా మారని ఆ ఎమ్మెల్యే ఎవరు? ఎలా చెలరేగిపోతున్నారు?

Read Also: Vijay Devarakonda : విజయ్ దేవరకొండపై గిరిజన సంఘాల ఆగ్రహం

ఆరిణి శ్రీనివాసులు… తిరుపతి ఎమ్మెల్యే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషంలో జనసేన టిక్కెట్‌ తెచ్చుకుని భారీ మెజారిటీతో గెలిచారాయన. ఎన్నికలకు ముందు వరకు వైసిపి ఎమ్మెల్యేగా ఉన్న ఆరిణికి టిక్కెట్‌ ఇవ్వడాన్ని తిరుపతి టిడిపి జనసేన నేతలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. అయినాసరే… ఫైనల్‌గా ఆయనకే ఖరారు చేశారు పవన్‌కళ్యాణ్‌. గెలిచాక కొద్ది రోజులు బాగానే ఉన్న ఎమ్మెల్యే… ఇప్పుడు తన పాత ఫార్మాట్‌లోకి వెళ్ళిపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు వైసిపి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో శ్రీనివాసులు వెంటే ఉన్న ఆయన అన్న కుమారుడు ఆరిణి శివకూమార్ షాడోలా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. నాడు చిత్తూరు కేంద్రంగా భూ కబ్జాలు, కమీషన్లు దండుకోవడాలు ఓ రేంజ్‌లో చేసినట్టు చెప్పుకుంటారు. చివరికి గత ఎన్నికల సమయంలో పెద్దిరెడ్డితో ఉన్న పేచీ కారణంగా శ్రీనివాసులుకు వైసీపీ టిక్కెట్‌ రాలేదంటారు. ఆ పరిస్థితుల్లో… తిరుపతి సీటుపై కన్నేసి బలిజ సామాజిక వర్గం కార్డుతో జనసేన టిక్కెట్‌ తెచ్చుకుని గెలిచారు. పార్టీ, ప్రాంతం మారినా… ఎమ్మెల్యే తీరు మాత్రం మారలేదని, నాటి చిత్తూరు షాడోనే ఇప్పుడు తిరుపతిలో ఎంట్రీ ఇచ్చేసి యధావిధిగా దందాలు మొదలుపెట్టేసినట్టు చెప్పుకుంటున్నాయి స్థానిక జనసేన శ్రేణులు.

Read Also: Off The Record: బుట్టా రేణుకకు కలిసి రాని కాలం

అయితే, ఇప్పుడు తిరుపతిలో చేస్తున్న దందాల సౌండ్‌… మంగళగిరిలోని జనసేన హెడ్డాఫీస్‌లో రీ సౌండ్‌ ఇస్తోందట. అటు టిడిపి నేతలు సైతం తిరుపతి ఎమ్మెల్యే ఆగడాలు అంటూ… తమ హెడ్డాఫీస్‌కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారట. ఎమ్మెల్యే అన్న కుమారుడు ఆరణి శివకుమార్ భూకబ్జాలకు పాల్పడుతూ,అరాచకం చేస్తున్నారని తాజాగా బాధితుడు శ్రీమన్నారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. తిరుపతిలో ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ….షాడో ఎమ్మెల్యే వ్యవహారాలను బయటపెట్టారాయన. నారాయణపురంలోని 2 ఎకరాల స్థలానికి సంబంధించి కొన్నేళ్ళుగా కోర్టులో కేసు నడుస్తోందని, అయితే దానికోసం ప్రైవేట్‌ వ్యక్తులను, అధికారులను పంపి బెదిరిస్తున్నారని ఆరోపించారు శ్రీమన్నారాయణరెడ్డి. డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ తమకు న్యాయం చేయాలని కూడా కోరారాయన. తిరుపతిలో చాలాచోట్ల ఇలాంటి వ్యవహారాలు ఎక్కువయ్యాయని, ఎమ్మెల్యే అన్న కొడుకు చివరికి తెలుగుదేశం పార్టీ నాయకుల భూములను కూడా వదలడం లేదని చెప్పుుకుంటున్నారు. కొందరు ఓ అడుగు ముందుకేసి.. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి విషయం చెబితే….కూర్చుని మాట్లాడుకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారట. భూ సంబంధింత వ్యవహారాలతో పాటు బదిలీల్లో సైతం… ఓ రేంజ్‌లో కమీషన్లు పీకుతున్నారన్నది టెంపుల్‌ సిటీ టాక్‌. ఈ ఆగడాల్ని భరించలేని కొందరు జనసేన నాయకులు మేటర్‌ని పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ దృష్టికి తీసుకువెళ్ళడంతో….ఆయన బాగా సీరియస్‌ అయినట్టు సమాచారం. ఎమ్మెల్యే ఆరిణిని పిలిచి క్లాస్ పీకి….పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్‌ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. దీంతో కొద్ది రోజులు సైలెంట్ అయినా షాడో…… తాజాగా తిరిగి యాక్టివ్‌ అవడంతో…. తలలు పట్టుకుంటున్నారట తమ్ముళ్లు. ఈ ఎమ్మెల్యే చేసే పనులతో తమ పార్టీకి కూడా చెడ్డపేరు వస్తోందని ఫీలవుతున్నట్టు సమాచారం.

Read Also: GT vs RR: గిల్ మళ్లీ మిస్.. బాదేసిన బట్లర్! ఆర్ఆర్ ముందు భారీ టార్గెట్..

డైరెక్ట్‌గా పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ పిలిచి చెప్పినా…. మారకుండా మళ్ళీ అలాంటి పనులే చేస్తుండటంపై తిరుపతి జనసేనలోనూ అసంతృప్తి పెరుగుతోందట. శివ గతంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫీస్‌లో కమిషనర్‌ పక్కసీట్లో కూర్చుని అధికారులు ఎలా పనిచేయాలో దిశానిర్దేశం చేస్తున్న వీడియో వైరల్‌ అయ్యాయి. అలా… వివాదం వస్తే కొన్నాళ్ళు సైలెంట్ అవ్వడం, తిరిగి అవే పనులు చేస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట తిరుపతి కూటమి నాయకులు. ఎన్నికల సమయంలో తెర వెనక ఉండి అంతా నడిపిన శివకుమార్‌…. ఇప్పుడు తెరముందుకు వచ్చి షాడో ఎమ్మెల్యే అవతారం ఎత్తడంపై పార్టీ పెద్దలు కూడా సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. ఇక వార్నింగ్‌ల సీజన్‌ అయిపోయిందని, ఈసారి మాత్రం డైరెక్ట్‌ యాక్షనే ఉంటుందన్న టాక్‌ నడుస్తోంది తిరుపతి జనసేనలో. అటు వైసీపీ మాత్రం…. ఈ వ్యవహారాలను ఎపిసోడ్స్‌ ఎపిసోడ్స్‌గా సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తూ… ఉతికి ఆరేస్తోంది. దీనికి జనసేన అధిష్టానం రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Exit mobile version