తెలంగాణలో రాజకీయం ఈ రేంజ్లో హీటెక్కటానికి కారణం ఏంటి?నీతి…జాతి అనే పదాల చుట్టూనే స్టేట్ పాలిటిక్స్ తిరుగుతున్నాయా?పొలిటికల్ లీడర్స్ పరుషంగా మాట్లాడటం దేనికి సంకేతం?పరస్పర దూషణలు రాజకీయ యుద్ధంగా మారుతున్నాయా?ఆ రెండు కులాల మధ్య రాజకీయం సంకుల సమరంగా మారిందా?రాష్ట్రంలో క్యాస్ట్ పాలిటిక్స్ ఇంతలా ఫ్రంట్ లైన్లోకి రావటానికి రీజనేంటి?
తెలంగాణ పాలిటిక్స్ పీక్స్‌కు వెళ్తున్నాయి. రాజకీయాల్లో ఇటీవలి కాలంలో దూషణల పర్వం బాగా ఎక్కువైపోయింది. ఒక అంశాన్ని…సీరియస్‌గా చెప్పాలి అనుకుంటే ఇప్పుడు నాయకులు తిట్లను ఎత్తుకుంటున్నారు. కఠినంగా కూడా చెప్పొచ్చు అనే విషయం మర్చిపోతున్నట్టున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. Cpm జాతీయ నాయకుడు బీవీ రాఘవులు…కోదండరాం లాంటి వాళ్లు కూడా విషయం యొక్క తీవ్రతను ఎంతో కఠినంగా చెప్తారు. కానీ వాళ్లు చెప్పేది ఎక్కడా కూడా దూషణలాగా ఉండదు. ఈ మధ్య brs..కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్‌లో ఇవే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆఖరుకు ఆ పార్టీల సోషల్ మీడియా కూడా అదే ధోరణిలో వెళ్తోందట. ఎంత వల్గర్ లాంగ్వేజ్ వాడితే అంత బలంగా చెప్తున్నాం అనుకుంటున్నారట. ఐతే…ప్రజల్లో ఇది వెగటు భావనకు దారిస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇది ఎన్నికలకు ముందు రెండు కులాల మధ్య ఎలా ఐతే చిచ్చుకు దారితీసిందో.. ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియాతో మాట్లాడిన తర్వాత…వరుసగా హరీష్ రావు.. కేటీఆర్‌లు చిట్ చాట్ చేశారు. కేసీఆర్ మాట్లాడిన తర్వాత…సీఎం రేవంత్ చిట్ చాట్ చేశారు. హరీష్‌ను ఉద్దేశించి మామ ఉన్నన్ని రోజులు ఏం చేయరు…ఆ తర్వాత పార్టీని లాక్కుంటారు అని కామెంట్స్ చేశారు. దీనిపై brs నేతలు మరుసటి రోజు సీఎం రేవంత్‌ను ఉద్దేశించి నీతి…జాతి అంటూ ప్రస్తావించారు. ఇలా రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం పెరిగిపోయినట్లయింది. అసలే రేవంత్…నీతి జాతి గురించి ప్రస్తావించడంతో…కొడంగల్ వేదిక మీది నుండి కేటీఆర్..హరీష్‌ల పేర్లను ప్రస్తావించారు. మీ జాతి..అంతా రమ్మను వచ్చే ఎన్నికల్లో 80 సీట్లు గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తాం…దమ్ముంటే అడ్డుకోండి అన్నారు. మాటల మధ్యలో కూకట్పల్లి MLA కృష్ణారావును కూడా కలిపారు. దీనిపై వెలమ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయట. మీడియా సమావేశాలు సైతం నిర్వహిస్తున్నాయి.
సాధారణ ఎన్నికలకు ముందు కూడా ఇదే తరహాలో…రెడ్లు వర్సెస్…వెలమలుగా రాజకీయం చీలిపోయింది. అప్పటికే రెడ్లు తమ రాజకీయ ప్రాబల్యం తగ్గుతుంది అనే భావనలో ఉండటం.. వెలమలు ఆధిపత్యం కొనసాగించడం లాంటివి రెండు సామాజికవర్గాల మధ్య కొంత ఫైట్లా మారిందనే చర్చ అప్పట్లో నడిచింది. రేవంత్ రెడ్డి కూడా కర్ణాటకకు వెళ్లి…వ్యవసాయం చేయాలన్నా…రాజకీయం చేయాలన్నా రెడ్లు ఉండాలి అంటూ అప్పట్లో కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు రెడ్లను ఏకం చేసేలా చేశాయనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో నడిచింది. అదే సమయంలో వెలమల్లో కూడా ఐక్యతను పెంచింది. అలా మొదలైన డైలాగ్ వార్.. ఇప్పుడు మళ్ళీ తెర మీదకు వచ్చింది. కేసీఆర్ ఎప్పుడూ…కులాలను ప్రస్తావించకపోయినా.. నీతి..జాతి అనే పదాలు ఆ పార్టీ నాయకుల నుండి రావడంతో ఇది మళ్లీ వెలమలు..రెడ్ల మధ్య పొలిటికల్ వార్ తెర మీదకు వచ్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
ఇటీవల కొన్ని గ్రామ పంచాయతీల్లో brs సర్పంచ్ అభ్యర్ధులను పెట్టలేదు. అలాంటి చోట్ల వెలమలు అంతా కాంగ్రెసేతర పార్టీలు…లేదంటే ఇండిపెండ్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. ఇలా వెలమ…రెడ్ల వైరం ఏళ్లతరబడి కొనసాగుతూనే ఉంది. మరి ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.