Site icon NTV Telugu

Off The Record : తెలంగాణ ప్రభుత్వానికి లీకు వీరుల బెడద….! కాళేశ్వరం కమిషన్ పూర్తి రిపోర్ట్ BRSకి చేరిందా?

Brs

Brs

తెలంగాణ ప్రభుత్వంలో ఏదీ దాగే పరిస్థితి లేదా? దాచాలంటే దాగదులే… దాగుడు మూతలు చెల్లవులే అన్నట్టుగా ఉందా వ్యవహారం? అత్యంత కీలకమైనది, టాప్‌ సీక్రెట్‌ అనుకున్న రిపోర్ట్‌ కూడా ప్రతిపక్షం చేతికి అందిందా? లీకు వీరులు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారా? ఆ లీక్‌ చేసిన వాళ్ళు ఎవరో కూడా సర్కార్‌ పెద్దలకు తెలిసి పోయిందా? ఇంతకీ ఏంటా రిపోర్ట్‌? ఎవరి మీద అనుమానాలున్నాయి? కాళేశ్వరం ప్రాజెక్ట్‌ డ్యామేజీ, లీకేజీల సంగతేమోగానీ… తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం ఆ రెండిటి బెడద తప్పడం లేదట. ఇంటర్నల్‌గా ఉన్న లీకు వీరులు లిటరల్‌గా ప్రభుత్వాన్ని షేక్‌ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కావస్తున్నా… లీకుల విషయంలో మాత్రం రేవంత్‌ సర్కార్‌కు తలనొప్పి తప్పడం లేదంటున్నారు. తాజాగా కాళేశ్వరం కమిషన్‌ రిపోర్ట్‌ పూర్తి నివేదిక ప్రతిపక్ష పార్టీ చేతికి అందిందన్న విషయం తెలిసి ప్రభుత్వ పెద్దలే షాకైనట్టు తెలిసింది. తమ సర్కార్‌లో లీకేజీలు ఆ స్థాయిలో ఉన్నాయా అంటూ నోరెళ్ళబెట్టినట్టు సమాచారం. కాళేశ్వరం కమిషన్‌ రిపోర్ట్‌ ఇటీవలే ప్రభుత్వానికి అందింది. దానిపై ప్రభుత్వం అధికారుల కమిటీ వేసి బ్రీఫ్‌గా క్యాబినెట్‌కి నివేదిక ఇవ్వాలని సూచించింది. ఆ ప్రకారమే… మొత్తం 650 పేజీల రిపోర్ట్‌ను వడకట్టి దాని సారాంశాన్ని 60 పేజీల్లో సిద్ధం చేసి కేబినెట్‌కు సమర్పించింది అధికారుల కమిటీ. క్యాబినెట్‌లో చర్చించాక ఆ రిపోర్ట్‌ బయటికి వచ్చింది. అందుకు సంబంధించి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రజెంటేషన్‌ ఇచ్చారు కూడా. అంత వరకు ఆల్‌ ఈజ్‌ వెల్‌. అంతా బాగానే ఉందని అనుకున్నారు. కానీ కమిషన్ ఇచ్చిన 650 పేజీల నివేదిక మొత్తం కూడా లీకైందని, అది ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ చేతికి అందిందని ప్రభుత్వ పెద్దల దగ్గర సమాచారం ఉందట. దాన్ని చూసి ప్రతిపక్ష పెద్దలు కూడా అలర్ట్‌ అయినట్టు చెప్పుకుంటున్నారు. దీంతో… పూర్తిస్థాయి నివేదిక ఎలా బయటకు వచ్చింది..? ప్రతిపక్షం ఎలా అలర్ట్ అయ్యింది..? అన్న అంశంపై ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తులు ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం దగ్గర రహస్యంగా ఉన్న పూర్తి నివేదిక బయటకు రావడం అంటే… అదేం చిన్న విషయం కాదు.

అలాంటిది ఆ రిపోర్ట్‌ చేతికి అందకుండానే బీఆర్‌ఎస్‌ హైకోర్టు మెట్లు ఎలా ఎక్కగలుగుతుందన్నది ప్రభుత్వ పెద్దల క్వశ్చన్‌. అంటే.. ఫుల్‌ రిపోర్ట్‌ ప్రతిపక్షానికి చేరిందని, దాని ఆధారంగానే కోర్ట్‌కు వెళ్ళారన్నది సర్కార్‌ అనుమానంగా తెలుస్తోంది. అదే సమయంలో ఇంటెలిజెన్స్‌ నివేదికలు కూడా ఈ అనుమానాలు బలపరుస్తున్నాయట. అడ్వకేట్‌ అయిన బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఒకరితో కలిసి.. పార్టీ ముఖ్యులు ఫామ్‌హౌస్‌లో వరుసగా మూడు రోజుల పాటు కాళేశ్వరం పూర్తి రిపోర్ట్‌ మీద కసరత్తు చేసినట్టు ఇంటలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయట. దీంతో అసలా రిపోర్ట్‌ బయటికి ఎలా వెళ్ళింది? ఏ సోర్స్‌లో ప్రతిపక్షానికి చేరిందని సర్కార్‌ పెద్దలు ఆరా తీస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగా… కాళేశ్వరం కమిషన్ కార్యాలయం నుంచి వెళ్లే ప్రసక్తే ఉండబోదని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఆ ఛాయిస్‌ కొట్టేస్తే… ఇక రెండోది ఉన్నతాధికారులు ఎవరైనా లీక్‌ చేసి ఉంటారా? అన్న అనుమానాలు బలంగా ఉన్నాయట. ప్రభుత్వంలోని కీలక నాయకుల కళ్ళన్నీ ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ దగ్గరే ఆగుతున్నాయట.

నీటి పారుదల శాఖలోని కొంతమంది అధికారుల ద్వారా కాళేశ్వరం కమిషన్‌ రిపోర్ట్‌ మొత్తం ప్రతిపక్షానికి చేరి ఉండవచ్చని అనుమానిస్తున్నారట. ఈ విభాగంలోని చాలా మంది అధికారులు ప్రాజెక్ట్‌ నిర్మాణంలో పని చేసి ఉన్నారు. ఆ సంబంధాల దృష్ట్యా వారి నుండే చేరి ఉంటుందని అంచనా వేస్తున్నారట. అలాగని పూర్తిగా నూటికి నూరు శాతం ఆఫీసర్స్‌నే అనుమానించలేమని, ఇందులో సొంత పార్టీ నేతల హస్తం కూడా ఉండి ఉండవచ్చన్న డౌట్స్‌ సైతం పెరుగుతున్నాయట. వాళ్ళు ఎవరు, ఏంటనే చర్చలోకి ప్రభుత్వం కూడా వెళ్లే ఆలోచన చేయడం లేదు. కానీ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చినప్పటినుంచి ప్రభుత్వం కూడా కొంత అలర్ట్‌గా ఉన్నట్టు కనపడుతోంది. ఏదైనాసరే… మొత్తం మీద అధికార పార్టీకి లీకు వీరుల తలనొప్పి ఇంకా పోలేదు. అయితే గత ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్న అధికారులు ఎవరు..? నాయకులు ఎవరు..? అనే చిట్టా అంతా ప్రభుత్వం దగ్గర ఉందట. అయినాసరే… ఈ విషయంలో దూకుడుగా వ్యవహరించడం సరికాదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంట్లో భాగంగానే కీలకమైన విషయాల పట్ల ఆచితూచి వ్యవహరిస్తోంది ప్రభుత్వం.

Exit mobile version