NTV Telugu Site icon

Off The Record: ఆ టీడీపీ నేతలు లోలోపల రగిలిపోతున్నారా..? కారణం ఏమిటి..?

Tdp

Tdp

Off The Record: ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతలు కొందరు ఉడికిపోతున్నారా? డైరెక్ట్‌గా బయటపడేందుకు ధైర్యం చాలడం లేదా? అలాగని కామ్‌గా ఉండలేకపోతున్నారా? ఏదో ఒకరూపంలో తమ అసంతృప్తిని బయటపెట్టాలని తెగ ప్రయత్నిస్తున్న ఆ నాయకులు ఎవరు? ఎందుకు అంతలా మధనపడుతున్నారు?.. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టిక్కెట్స్‌ ఆశించిన నేతల చిట్టా చాలా పెద్దగానే ఉంది. మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, పోలీస్ హౌసింగ్ బోర్డ్ మాజీ చైర్మన్ నాగుల్ మీరా లాంటి నాయకులైతే…. చిట్ట చివరి వరకు రేస్‌లో ఉన్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పూర్తి స్థాయిలో పని చేశామని, ప్రత్యక్షంగా పోటీ చేయకుండా టికెట్లను కూడా త్యాగం చేశాం కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఛాన్స్‌ వస్తుందని అనుకున్నారట సదరు లీడర్స్‌. ఇక వాళ్ళ అనుచరుల సంగతైతే చెప్పేపనేలేదు. అంత గట్టినా నమ్మి ప్రచారం చేసుకున్నారట. అందరూ ఆశపడినా… అందరికీ సాధ్యం కాదు కాబట్టి… కచ్చితంగా ఏదో ఒక ఈక్వేషన్‌లో తమలో ఎవరో ఒకరికి ఎమ్మెల్సీ వస్తుందని నమ్మారట ఈ నాయకులు. సీన్ కట్ చేస్తే….. వీళ్ళకే కాదు జిల్లాలో ఏఒక్కరికీ ఎమ్మెల్సీ దక్కని పరిస్థితి. అయినాసరే…. ఎవ్వరూ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయలేకపోతున్నట్టు తెలిసింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఉన్న 16 అసెంబ్లీ, రెండు లోక్‌సభ సీట్లను పూర్తిగా గెలుచుకుంది కూటమి. జిల్లాలో ఆస్థాయి విజయం సాధించిన క్రమంలో ఇప్పుడు అసంతృప్తుల్ని బహిరంగంగా వ్యక్తం చేస్తే… తేడా కొడుతుందని సదరు లీడర్స్‌ భయపడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

Read Also: Amrutha: ప్రణయ్ పరువు హత్య తుదితీర్పుపై స్పందించిన అమృత..

అయితే, అధిష్టానం కూడా సీరియస్‌గా తీసుకుంటుందన్న భయం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకే లోలోపల ఎంత రగిలిపోతున్నా… పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తున్నారని, అయినా ఏదో ఒక రూపంలో తమ అసంతృప్తి వెళ్ళగక్కాలనుకుంటున్నారని మాట్లాడుకుంటున్నారు టీడీపీ కార్యకర్తలు. దేవినేని ఉమ, బుద్దా వెంకన్న బహిరంగంగానే కొత్త ఎమ్మెల్సీలను అభినందించారు. బుద్దా అయితే… ఒక అడుగు ముందుకేసి పదవి రాకపోయినా పార్టీ కోసం అంకితభావంతో పని చేస్తానని ప్రకటించేశారు. చంద్రబాబు నాకు దేవుడు… దేవుడు కూడా అప్పుడప్పుడు భక్తుడిని పరీక్షిస్తుంటాడని చెప్పి తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేశారు. పదవి దక్కినా దక్కకపోయినా ఒకేలా ఉంటానని చెప్పారాయన. ఇక వంగవీటి రాధా విషయానికి వస్తే… పదవి కావాలని బహిరంగంగా అడగలేదు. రాలేదని పబ్లిగ్గా అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ఇప్పుడు కూడా ఆయన వైఖరి అలాగే ఉందట. అయితే… ఎంత లాయల్టీ ప్రకటించినా… బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయకున్నా…. మన మనసులోని బాధను మాత్రం ఏదో ఒక రూపంలో పార్టీ హైకమాండ్‌కు తెలపాలని అనుకుంటున్నారట. అందుకో స్పెషల్‌ రూట్‌ ఎంచుకోబోతున్నట్టు సమాచారం. బుద్ధ వెంకన్న దగ్గరకు ఇప్పటికే అధిష్టానం దూతగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను పంపింది. తాను ప్రతిపక్షంలో ఉన్నపుడు పార్టీ కోసం ఎంత కష్టపడింది ఆ సందర్భంగా చెప్పి బుద్దా ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. అటు మాజీ మంత్రి దేవినేని ఉమాకి ఎమ్మెల్సీకి దక్కకపోవడంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోందట. రెండుసార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ కోసం ప్రచారం చేసిన రాధాకి ఎమ్మెల్సీ ఇవ్వక పోవటంపై కాపు కమ్యూనిటిలో అసంతృప్తి ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ విషయం టీడీపీ అధిష్టానానికి చేరేలా చర్చ పెట్టాలన్నది ఆ వర్గం అభిమతంగా తెలుస్తోంది. మైనార్టీలకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కలేదని, పార్టీని నమ్ముకుని దశాబ్దాలుగా నాగుల్ మీరా పనిచేస్తున్నారంటూ… బెజవాడ పార్లమెంట్ నియోజకవర్గ నేతల ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లే ప్రయత్నం జరుగుతోందట. ఇలా… ఎవరికి వారు ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు తమ అసంతృప్తి ఎక్కడా బయటకు కనిపించకుండా…అలాగని వదిలేయకుండా… పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఉన్నారట. వీళ్ళ మొరల్ని పార్టీ పెద్దలు ఎంతవరకు ఆలకిస్తారో…. భవిష్యత్‌లో ఎలాంటి అవకాశాలు ఇస్తారో చూడాలి మరి.