Off The Record: పిఠాపురం వైసీపీ ఇంకా సెట్టయినట్టు లేదా? సిట్టింగ్‌కి- అభ్యర్ధికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఇంకా అలాగే ఉందా? యూనిటీగా పని చేయాల్సింది పోయి ఎవరి లెక్కలతో వాళ్లు రాజకీయాలు చేస్తున్నారా? పిఠాపురం ఫ్యాన్ పార్టీలో ఇంటర్నల్ వార్ మీద అధిష్టానం ఫోకస్ చేసిందా?
పిఠాపురం నియోజకవర్గం! ఏపీలో హాట్ సెగ్మెంట్! పవన్ పోటీ చేయడమే అందుక్కారణం. ఇక్కడ అధికార పార్టీ ఎలాగైనా జెండా పాతాలని గట్టిగా ఫిక్సయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబును కాదని, వంగ గీతకు అవకాశం ఇచ్చారు. గత నెలలో సీఎం జగన్ స్వయంగా దొరబాబును పిలిచి, కలిసి పనిచేయాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత, తగిన గుర్తింపు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ నియోజకవర్గంలో పరిస్థితులు అలా లేవని సమాచారం. అభ్యర్థి గీత నుంచి కనీసం పిలుపు ఉండడం లేదని ఎమ్మెల్యే వాపోతున్నారట. కలిసి ప్రచారం చేసిన సందర్భాలు అరుదుగానే ఉన్నాయంటున్నారు. దొరబాబుకి జనాలతో గ్యాప్ ఉందని, అందుకే పార్టీ ఆయనకి సీటు ఇవ్వలేదని చెప్తున్నారట గీత వర్గం. అలాంటప్పుడు మళ్లీ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎందకు అనేది గీత వర్గం వాదన. సింగిల్‌గానే ప్రచారం చేసుకుంటానని అభ్యర్ధి తన వర్గంతో చెబుతున్నారని వార్తలొస్తున్నాయి. గతంలో తాను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశానని, తనకు అంతా తెలుసని ఆమె అంటున్నారట. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇలా నడిపించేద్దాం అని ఆమె చెబుతున్నారని కేడర్ అంటోంది. ప్రచారానికి మిగతా వాళ్లు వచ్చినప్పుడు దొరబాబు కూడా వస్తారని గీత కవర్ చేస్తున్నారట!
దొరబాబు కూడా గీత వైఖరితో సైలెంట్ అయిపోయారని సమాచారం. తనను ఇన్వాల్వ్ చేయనప్పుడు ఎందుకు రాసుకొని పూసుకుని తిరగాలని ప్రశ్నిస్తున్నారట. పార్టీ ఒక లైన్ ఇచ్చింది కానీ, నియోజకవర్గంలో ఆ పరిస్థితులు లేవనేది దొరబాబ చెప్పే మాట. పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా, ఎందుకు దూరం పెడుతున్నారో తెలియదని తన సన్నిహితుల దగ్గర అంటున్నారని వార్తలొస్తున్నాయి. అందుకే దొరబాబు నియోజకవర్గంలో ఎక్కడా ప్రచారంలో కనబడడం లేదు. వచ్చిన అనుచరులకు పార్టీకి పనిచేయాలని చెప్తున్నారు తప్ప, మిగతా వ్యవహారాల్లో ఆయన పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. గీతకు నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పగించి మూడు నెలలు అయింది. పార్టీకి ఏ మేరకు మైలేజ్ వచ్చిందో అధాష్టానం పెద్దలు ఆరా తీయాలని కొందరు అంటున్నారట. కచ్చితంగా పార్టీలో రెండు వర్గాలు ఉంటాయని కానీ, అందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత పోటీచేసే వారిపైనే ఉందని మరో వర్గం అంటోంది.
దొరబాబు అల్లుడు కర్ణాటకలోని చిక్ బల్లపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ పని లేనప్పుడు అక్కడ పని పురమాయించుకోవడం బెటర్ అంటున్నారట… తనని వద్దని అనుకున్నప్పుడు, తను కావాల్సిన వారి దగ్గరికి వెళ్లడమే బెటర్ కదా అని దొరబాబు వైరాగ్యం వ్యక్తం చేస్తున్నారట. పార్టీ ఒక ఆలోచనతో తనని పక్కన పెట్టింది, నియోజకవర్గంలో మరో ఆలోచనతో దూరం పెట్టి ఉండొచ్చు.. అంతా మన మంచికే అంటూ కొత్త వేదాంతం చెబుతున్నారట. మొత్తానికి పిఠాపురం ఫ్యాన్ పార్టీలో ఇంటర్నల్ రగడ కొత్త టర్న్ తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం ద్వితీయశ్రేణి నేతలమధ్య కొత్తచర్చకి దారి తీసింది. సిట్టింగ్‌కి ఆశించిన స్థాయిలో పిలుపులు లేకపోవడంతో దొరబాబు.. దొరబాబులా గడిపేస్తున్నారు. పవన్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో యూనిటీగా పని చేయాల్సింది పోయి ఎవరి లెక్కలతో వాళ్లు రాజకీయాలు చేస్తున్నారని కిందిస్థాయి నేతలు గుర్రుగా ఉన్నారు. పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని కలిసి పనిచేయాలని చెప్పినా, ఆ స్థాయిలో ఈక్వేషన్స్ లేవంటున్నారు. మరి ఈ సెట్టింగ్స్‌ని ఎలా సెట్ చేస్తారో చూడాలి!
