మరావతి వ్యవహారాల్లో మున్సిపల్ మంత్రి నారాయణ పాత్ర పరిమితం కాబోతోందా? అన్ని వ్యవహారాలను డీల్ చేయడం ఆయనవల్ల కావడం లేదా? అందుకే కేంద్ర మంత్రి తెర మీదికి వచ్చారా? ఆ విషయమై జరుగుతున్న చర్చలేంటి? మున్సిపల్ మినిస్టర్‌కు ఎక్కడ తేడా కొట్టింది? అమరావతి రైతుల సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీ వేసింది ఏపీ సర్కార్. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. సమస్య పరిష్కారం సంగతి ఓకేగానీ… కమిటీ కూర్పు గురించే కొత్త డౌట్స్ వస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. మామూలుగా అయితే…2014లో భూ సమీకరణ నుంచి అమరావతి పనులు, రైతుల సమస్యల విషయంలో ప్రత్యేక బాధ్యతలు నిర్వహిస్తున్నారు మంత్రి నారాయణ. అప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు తిరిగి పవర్‌లోకి వచ్చాక రాజధానికి సంబంధించిన వ్యవహారాలన్నిటినీ ఆయనే నడిపిస్తున్నారు. ఇదంతా చూస్తూ… అమరావతి స్పెషల్ మినిస్టర్ అని నారాయణను ఉద్దేశించి చమత్కరించే వాళ్ళు టీడీపీలోనే ఉన్నారు. కానీ సడన్‌గా సీన్‌లోకి కేంద్ర మంత్రి పెమ్మసాని ఎంట్రీతో ఎక్కడో… ఏదో…. తేడా కొట్టిందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అమరావతి రైతుల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం, అందులో పెమ్మసాని సభ్యుడిగా ఉండటం ఒక ఎత్తయితే… కమిటీ ఏర్పాటు అయ్యీ కావడంతోనే….ఆయన దూకుడు ప్రదర్శించడం, అప్పుడే మూడు మీటింగ్స్ నిర్వహించడం చర్చనీయాంశం అయింది. అంటే… రాజధాని విషయంలో నారాయణ పాత్రను మెల్లిగా తగ్గించేస్తున్నారా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి వివిధ వర్గాల నుంచి. కాస్త లోతుగా ఆలోచిస్తే… రైతుల సమస్యల పరిష్కారం విషయంలో ఆయన వైఖరి సరిగా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెమ్మసాని తెర మీదికి రావడానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయని చెప్పుకుంటున్నారు. సమస్యల పరిష్కారం విషయంలో నారాయణ వ్యవహార శైలిపై రాజధాని రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఆయనవల్లే చాలా సమస్యలు పెండింగ్‌లో ఉండిపోతున్నాయన్న అభిప్రాయం పెరుగుతోంది.
సీఆర్‌డీఏ అధికారులు కూడా అదే విషయం చెప్పడంతో… రాష్ట్ర మంత్రి విషయమై రైతుల్లో అసహనం పెరిగినట్టు తెలుస్తోంది. అసలు త్రిసభ్య కమిటీని నియమించడం వెనకున్న రీజన్ కూడా అదేనంటున్నారు. లోకల్ ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్, లోకల్ ఎమ్మెల్యేగా శ్రవణ్, మున్సిపల్ మంత్రిగా నారాయణ సభ్యులు అయినందున ఇక నుంచి ఎంపీ, ఎమ్మెల్యే పాత్రే కీలకం కావచ్చని, అందులోనూ పెమ్మసాని కేంద్ర మంత్రి కూడా అయినందున ఆయనకే యాక్టివ్ రోల్ ఉండవచ్చన్న వాదన బలపడుతోంది. అమరావతి కోసం భూములిచ్చిన రైతులు పదేళ్ళుగా…. రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా… వైసీపీ హయాంలో అయితే… అసలు తమ గోడు ఎవరికి వెళ్ళబోసుకోవాలో కూడా తెలియక సైలెంట్ గా ఉన్నామని, కానీ… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా సమస్యలు పరిష్కారం కావట్లేదని ఆవేదనగా ఉన్నారు రైతులు. పవర్ మారి18 నెలలైనా… సమస్యలు అలాగే ఉన్నాయని, మంత్రి నారాయణకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా… తమకు ప్లాట్లు కేటాయింపుగాని, మౌలిక సదుపాయాల కల్పన విషయంలోగాని ఎలాంటి ముందడుగు పడట్లేదంటూ ఇటీవల ఓపెనైపోతున్నారు రైతులు. ఒక దశలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు సైతం సిద్ధమయ్యారు. నిజంగా అదే జరిగితే…. ఎంత పరువు తక్కువ అనుకుంటూ అలర్టయిపోయిన ప్రభుత్వ పెద్దలు ఇక ఆ ఎపిసోడ్‌కు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించారట. ఆ క్రమంలోనే… స్థానిక ఎంపీగా ఉన్న పెమ్మసానికి త్రిసభ్య కమిటీలో చోటు దక్కడం ఒకఎత్తయితే….. గతానికి భిన్నంగా ఆయన ఎంట్రీతోనే… వరుస మీటింగ్స్‌తో రైతుల్లో నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారట. దీంతో…నారాయణ ఇక సైలెంట్‌గా సైడైపోతారా, రాజధాని నిర్మాణంలో కేవలం మున్సిపల్ మంత్రి పాత్ర వరకే పరిమితం అవుతారా చర్చలు మొదలయ్యాయి.
అలాగే… ఇందులో రకరకాల సామాజిక అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. ఆ పరంగా చూస్తే… ఓ సామాజికవర్గం రైతుల్ని డీల్ చేయడం పెమ్మసానికి తేలికవుతుందన్న వాదన సైతం ఉంది. కేంగ్ర మంత్రి కేవలం రైతుల సమస్యల పరిష్కారం వరకే పరిమితం అవుతారా? లేక భవిష్యత్‌లో కూడా రాజధాని నిర్మాణ బాధ్యతల్లో యాక్టివ్‌గా ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. కొనసాగింపు ఖాయమైతే మాత్రం నారాయణ పాత్ర నామమాత్రం కావచ్చని అంటున్నారు. ఇప్పటివరకు రాజధాని వ్యవహారాలన్నిటినీ ఒంటి చేత్తో నడిపించారు మున్సిపల్ మినిస్టర్. ఇక మీదట ఆ రోల్ తగ్గవచ్చని సూచిస్తున్నాయి తాజా పరిణామాలు. అలాగే… సీఆర్డీఏ అధికారుల వ్యవహార శైలి కూడా ఈ తాజా మార్పులకు కారణం అంటున్నారు. సంస్థ ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నారాయణ మీద అసంతృప్తి పెరగడానికి అది కూడా ఓ కారణం కావచ్చని అంటున్నారు. సీఆర్డీఏ అధికారులు కొంతమంది రైతులతో దురుసుగా ప్రవర్తించడం మొదటికే మోసం తెచ్చిందన్న అభిప్రాయం ఉంది. వోవరాల్‌గా ఇలాంటి రకరకాల కారణాలు కలగలిసి మున్సిపల్ మినిస్టర్ పాత్రను పరిమితం చేసి కేంద్ర మంత్రికి కీ రోల్ ఇచ్చాయన్నది అమరావతి టాక్.
