Site icon NTV Telugu

Off The Record: మంచిర్యాలలో మంత్రికి నో ఎంట్రీ బోర్డు ఎన్నాళ్ళు?

Prem Sagar Rao

Prem Sagar Rao

Off The Record: ఏకంగా రాష్ట్ర మంత్రికే ఆ నియోజకవర్గంలో నో ఎంట్రీ బోర్డ్‌ పెట్టేశారా? మమ్మల్ని కాదని అడుగు పెడితే…. అంటూ ఆ ఎమ్మెల్యే అనుచరులు పాజ్‌ ఇస్తున్నారా? రాష్ట్రంలో ఎక్కడైనా తిరుగు… నో ప్రాబ్లమ్‌. కానీ… మా సరిహద్దులోకి ఎంట్రీ ఇస్తే మాత్రం తేడా పడుద్దని వార్నింగ్‌ ఇస్తున్నారా? ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎమ్మెల్యే వర్గం వార్నింగ్స్‌ ఇస్తున్న ఆ మంత్రి ఎవరు?

Read Also: YS Jagan Mohan Reddy: ఈ నెల 9న చిత్తూరులో జగన్ పర్యటన.. షరతులు వర్తిస్తాయన్న పోలీసులు

తెలంగాణ కేబినెట్‌ విస్తరణలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌కు ఛాన్స్‌ దక్కింది. అసెంబ్లీ ఎన్నిక‌లకు ప‌దిహేను రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలోకి జంప్‌ అయి బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేశారాయన. ఆయన పరంగా చూస్తే… అంతా బాగానే ఉంది. కానీ, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగ‌ర్ రావు ఏళ్ళుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో రకరకలా వత్తిళ్ళు వచ్చినా… లొంగకుండా పార్టీ జెండా మోసినట్టు చెబుతారు ఆయన సన్నిహితులు. అప్పట్లో కేసులు పడ్డా వెనక్కి తగ్గకుండా పార్టీని పటిష్టం చేశారన్నది వాళ్ళ మాట. ఈ క్రమంలోనే…. ప్రేమ్‌సాగర్‌రావు కూడా కేబినెట్‌ విస్తరణ మీద గట్టి ఆశలే పెట్టుకున్నారు. తమ నేతకు పదవి వచ్చేసినట్టు ఆయన అనుచరులు ప్రచారం చేసుకున్నారు కూడా. కట్‌ చేస్తే.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ప్రేంసాగ‌ర్ రావుకు కాకుండా…. వివేక్‌కు ఛాన్స్‌ ఇచ్చింది కాంగ్రెస్‌ అధిష్టానం. ఈ పరిణామంపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు ప్రేమ్‌సాగర్‌రావు, ఆయన అనుచరులు. మొదట్నుంచి పార్టీ కోసం నిలబడి, బీఆర్‌ఎస్‌తో కలబడ్డ మాకు కాకుండా…. పార్టీలు తిరిగి వ‌చ్చిన వివేక్‌ను మంత్రిని చేయ‌డం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Read Also: Old Temples Lift: జాకీల సాయంతో వందేళ్ల నాటి ఆలయాలు లిఫ్ట్.. ఎక్కడో తెలుసా?

ఇక, ఇదే విష‌యాన్ని మూడు రోజుల కింద‌ట ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే దగ్గర కూడా ప్రస్తావించారట ప్రేమ్‌సాగర్‌రావు. క‌ష్టప‌డ్డది తామైతే ఫ‌లితం ద‌క్కింది మ‌రొక‌రి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. తనకు ప్రభుత్వ చీఫ్‌విప్‌ ప‌ద‌వి ఇస్తామని పెద్దలు ప్రతిపాదించినా… మంచిర్యాల ఎమ్మెల్యే తిరస్కరించినట్టు సమాచారం. త‌న‌కు మంత్రి ప‌ద‌వి త‌ప్ప.. ప్రత్యామ్నాయం ఏదీ వద్దని అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు చెప్పుకుంటున్నారు. అటు ప్రేమ్‌సాగర్‌రావు అనుచరులు కూడా వివేక్‌కు మంత్రి పదవిపై తీవ్రంగా రగిలిపోతున్నారట. త‌మ నేతకు ద‌క్కాల్సిన పదవిని ఆయన త‌న్నుకుపోయారంటూ సీరియస్‌ కామెంట్స్‌ చేస్తున్నట్టు సమాచారం. మ‌రీ ముఖ్యంగా లోక్‌సభ ఎన్నిక‌ల స‌మయంలో త‌న కొడుకు వంశీకృష్ణను గెలిపిస్తే ప్రేంసాగ‌ర్ రావు మంత్రి ప‌ద‌వికి తాను అడ్డుపడబోనని చెప్పిన వివేక్.. తీరా టైం వచ్చినప్పుడు తన లెక్కలు తాను సరిచేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. ఓ అనూహ్య పరిణామం జరిగినట్టు తెలుస్తోంది. వివేక్‌ ఇప్పుడు రాష్ట్ర మంత్రి అయితే కావచ్చుగానీ.. దాంతో మాకు సంబంధం లేదు, ఆ హోదాలో ఆయన మంచిర్యాల నియోజకవర్గంలో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ అల్టిమేటం జారీ చేసిందట ఎమ్మెల్యే వర్గం. నా నియోజకవర్గానికి నేనే రాజు- నేనే మంత్రి అంటూ ప్రేమ్‌ సాగర్ రావు ఇటీవల వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది.

Read Also: HYDRA: దారికి అడ్డంగా క‌ట్టిన గోడ తీస్తే 3.. మూస్తే 8 కిలోమీట‌ర్లు..

అందుకే వివేక్ మంచిర్యాల నియోజకవర్గంలో పార్టీ లేదా అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్న చర్చ తెర మీదికి వచ్చింది. ఇంత చెప్పినా వినకుండా… వివేక్‌ వస్తే… గొడ‌వ‌లు త‌ప్పవ‌ని, ఆయ‌న‌ను మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెట్టనివ్వబోమని గట్టి వార్నింగ్‌లే ఇస్తున్నారట ప్రేమ్‌సాగర్‌రావు అనుచరులు. దీంతో అనవసరంగా ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ వివేక్‌ కూడా మంచిర్యాలకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లాకు వచ్చినప్పుడు కూడా ఇందారం మీదుగా చెన్నూరు, అట్నుంచి మంద‌మ‌ర్రి వెళ్లారేగానీ… మంచిర్యాల‌లో మాత్రం అడుగుపెట్టలేదని గుర్తు చేస్తున్నారు. గతంలోనూ వివేక్ కొడుకు, పెద్దప‌ల్లి ఎంపీ వంశీ.. అనుచరులు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రయత్నించినప్పుడు పీఎస్‌ఆర్‌ వర్గం నాయకులు అడ్డుకున్నారు. ఒక నియోజకవర్గంలో మంత్రికి నో ఎంట్రీ బోర్డ్‌ వేలాడుతున్న క్రమంలో… రాబోయే రోజులన్నీ ఆయన ఇలాగే గడిపేస్తారా? లేక పరిస్థితిని మార్చే ప్రయత్నం చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version