ఇన్నాళ్లు సైలెంట్ మోడ్‌లో ఉన్న ఆ వైసీపీ లీడర్ ఉన్నట్టుండి ఎందుకు యాక్టివ్ అయ్యారు. ఆరోగ్య సమస్యలున్నాసరే… పడుతూ లేస్తూనే… పర్యటనలు చేయడానికి కారణాలేంటి? పార్టీ అధ్యక్షుడి నుంచి ఆయనకేదైనా భరోసా దక్కిందా? ఎవరా లీడర్? ఆయన చెబుతున్న ఈక్వేషన్స్ అండ్ పొలిటికల్ కేలిక్యులేషన్స్ ఏంటి? నెల్లూరు జిల్లా పొలిటికల్ స్క్రీన్ మీది నుంచి కొన్నేళ్ళు కనుమరుగైన మాజీ ఎమ్మెల్యే తాజా కదలికలు ఆసక్తి రేపుతున్నాయి. రాజకీయ ఉనికి చాటుకోవడానికి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పట్నుంచే పావులు కదుపుతున్నారు అల్లూరు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. రాజకీయ కుటుంబం నేపధ్యం ఉన్న కాటంరెడ్డి… 1994లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2004లో మరోసారి కాంగ్రెస్ తరపున విజయం సాధించినా… 2009 పునర్విభజనలో అల్లూరు సెగ్మెంట్ రద్దు కావడంతో నియోజకవర్గం మారి పోటీ చేసి ఓడిపోయారాయన.
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండేవారట. ఈ క్రమంలో 2014కి ముందు వైసీపీలో చేరినా..సముచిత స్థానం దక్కలేదంటూ 2019 నాటికి టీడీపీ గూటికి చేరిపోయారు. ఇక 2024 ఎన్నికల టైం వచ్చేసరికి టీడీపీకి గుడ్ బై చెప్పి.. తిరిగి ఫ్యాన్ కిందికి చేరిపోయారు కాటంరెడ్డి. వైసీపీ ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయిన విష్ణువర్థన్‌రెడ్డి ఇటీవల తిరిగి యాక్టివ్ అయ్యారు. తన భార్యతో కలిసి కావలి, కోవూరు నియోజకవర్గాల్లోని అనుచరుల ఇళ్ళకు పరామర్శ యాత్రలు చేస్తున్నారు. అనారోగ్యంతో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి దూరంగా ఉన్న టైంలో కాటంరెడ్డి టూర్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాటంరెడ్డి కావలి నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తారంటూ ఆయన సన్నిహితులు ప్రచారం మొదలుపెట్టారు. ఇదే సమయంలో జగన్‌ని కలవడంతో…. ఆయన ఏదో హామీ ఇచ్చారని, అందుకు అనుగుణంగానే విష్ణువర్ధన్ రెడ్డి పావులు కదుపుతున్నారన్న టాక్ పెరిగింది.
అదే సమయంలో ఇంకో రకమైన వాదన కూడా వినిపిస్తోంది. రేపు 2027లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తిరిగి అల్లూరు నియోజకవర్గం కొత్తగా పురుడు పోసుకుంటుందని, అక్కడ మరోనేత పాగా వేయకుండా… విష్ణువర్ధన్‌రెడ్డి ముందే కర్చీఫ్ వేస్తున్నారన్నది సెకండ్ వెర్షన్. ఆ ఉద్దేశ్యంతోనే… ఆరోగ్యం సహకరించకున్నా… ఇటీవల అనుచరులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారట. కాటంరెడ్డి విష్ణువర్దన్ రెడ్డికి అల్లూరు, కావలిలోని కొన్ని మత్స్యకార గ్రామాల్లో పట్టుందని చెప్పుకుంటారు. కొత్తగా అల్లూరు నియోజకవర్గం ఏర్పడితే.. కోవూరు పరిధిలోని కొడవలూరు, విడవలూరుతో పాటు.. కావలి లిమిట్స్‌లోని అల్లూరు, దగదర్తి లాంటి మండలాలు కలిసే అవకాశం ఉంది. అందుకే ఆయా ప్రాంతాల్లో ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్టు సమాచారం. వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా ఆ దిశగా కాటంరెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ… అల్లూరు నియోజకవర్గం ఏర్పడితే మాత్రం.. తాను, లేదంటే తన కుటుంబం నుంచి ఎవరో ఒకరు వైసీపీ తరఫున బరిలో ఉంటారని పాత తరం నేతలతో చెబుతున్నారట కాటంరెడ్డి. దీంతో పాత తరం లీడర్స్ ఆయనతో టచ్ లోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది.కానీ.. అనుకున్నట్టు నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే ఆయన భవితవ్యం ఏంటన్నది ఎక్కువ మంది క్వశ్చన్. అందుకే ఆవేశపడకుండా ఆచితూచి వ్యవహరించాలనుకుంటున్నారట ఎక్కువ మంది. వాళ్ళ సంగతి ఎలా ఉన్నా… విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం ఆరోగ్యం సహకరించకపోయినా..భార్యతో కలిసి అనుచరులు, కుటుంబ సన్నిహితుల ఇళ్లకు వెళ్ళి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఫైనల్‌గా ఆయన అల్లూరు వెళ్తారా లేక మరోసారి కావలి నుంచే అదృష్టాన్ని పరీక్షించుకుంటారోగానీ పొలిటికల్ టూర్స్ మాత్రం ఆసక్తి రేపుతున్నాయి.