రోజులో లొల్లితో కాంగ్రెస్ పెద్దలకు కూడా విసుగెత్తిందా..? ఏదోరకంగా ఆ నియోజకవర్గాన్ని సెట్ చేయాలని ముఖ్యమంత్రి కూడా డిసైడ్ అయ్యారా..? అందుకే అక్కడ అలా మాట్లాడారా? పద్ధతి మార్చుకోవాలని డైరెక్ట్‌గా లోకల్ ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చేసినట్టేనా? ఆయన అవకుంటే… మీరే సెట్ చేయండని పీసీసీకి కూడా సీఎం చెప్పిన ఆ నియోజకవర్గం ఏది? ఆ ఎమ్మెల్యే ఎవరు? తుంగతుర్తి నియోజక వర్గం వేదికగా… రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్‌రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన, జనం ఆతృతగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల పంపిణీ సభలో…ఆయన చేసిన వ్యాఖ్యల చుట్టూ కొత్త చర్చ మొదలైంది. ఆ మాటలు కొందరికి చురకలు పెట్టేలా..? పద్ధతి మార్చుకోమని వార్నింగ్ ఇచ్చినట్టుగా అనిపించాయట. వాటిని విన్నాక స్థానిక నాయకుల సమస్యలు సీఎం వరకు వెళ్ళాయని నేతలు డిసైడైనట్టు చెప్పుకుంటున్నారు.
ముఖ్యమంత్రి పద్ధతి మార్చుకోమని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది ఎవరికో కాదు…. స్థానిక శాసనసభ్యుడు మందుల సామేల్‌కేనన్న చర్చ నడుస్తోంది రాజకీయ వర్గాల్లో. పార్టీ నాయకులు అసంతృప్తిగా ఉన్న వాళ్ళని కూడా కలుపుకుని పోవాలని వేదిక మీద నుండే సీఎం రేవంత్ చెప్పడమంటే… వ్యవహార శైలి మార్చుకోవాలని ఎమ్మెల్యేకి చెప్పినట్టేనన్నది కాంగ్రెస్ నేతల మాట. అసెంబ్లీ ఎన్నికల్లో… కార్యకర్తలు అంతా ఒక్కటై గెలిపించారు… ఇప్పుడు వాళ్లను గెలిపించు అనే డైలాగ్…నేరుగా తుంగతుర్తి ఎమ్మెల్యేని ఉద్దేశించేనని, ఆది ఆయనకు గుచ్చుకుని ఉండవచ్చన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి నియోజకవర్గంలో. ఇంతటితో ఆగక… పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా.. జిల్లా కాంగ్రెస్ నేతలకు కాస్త ఎక్కువ సమయం ఇచ్చి…వాళ్ళు వచ్చిన వెంటనే కలిసి సమస్యలను పరిష్కరించాలని కూడా సూచించారు. దీంతో… రెండు రకాల సంకేతాలను సీఎం పంపినట్టు చర్చ జరుగుతోంది. అందరిని కలుపుకుని పోవాలని ఎమ్మెల్యేలకు, ఆ విషయంలో ఫోకస్ చేయాలని పీసీసీకి కూడా చెప్పినట్టు అయిందంటున్నారు.
తుంగతుర్తిలో ఎవరు ఔనన్నా…కాదన్నా… మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి వర్గం ఉంటుంది. దీనికి తోడు కోమటిరెడ్డి బ్రదర్స్… ఉత్తం కుమార్ ప్రాబల్యం ఎక్కువ. అంతా బడా నేతలే.. అందుకే అక్కడ కాంగ్రెస్‌కి బలం ఎక్కువ. ఐతే…ఎమ్మెల్యే సామేల్ వాళ్ళందర్నీ కలుపుకుని పోవడం లేదని, గ్రూపులుగా పార్టీ విడిపోయిందని… పాత వారిని పక్కన పెట్టి…కొత్తవారిని ప్రోత్సహిస్తున్నారంటూ స్థానిక నాయకులు పేచీ పెడుతున్నారు. Brs నుండి వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని కొందరు నేతలకు సూచిస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది. పాత కాంగ్రెస్ నేతలకు, క్యాడర్ కి మధ్య గ్యాప్ ఉందనే టాక్ ఎక్కువగా నడుస్తోంది. వీటన్నిటినీ ఇంటలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు సీఎంకి నివేదిస్తూనే ఉన్నాయట. దీంతో ఆయన కూడా దిద్దుబాటు చర్యలకు దిగినట్టు సమాచారం. దాంట్లో భాగంగానే సభా ముఖంగా అందరికీ విషయం అర్థం అయ్యేట్టు చెప్పారన్న చర్చ జరుగుతోంది.
ఈ సభలోనే…. ఓ వైపు mp చామల కిరణ్, ఇంకో వైపు దామోదర రెడ్డి ప్రస్తావన తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కార్యకర్తలకు రూట్ చూపించినట్టు అయిందన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. ఐతే ఎంపీ చామల కిరణ్..తుంగతుర్తి mlaకి మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయి కాబట్టి సమస్య లేదు. ఈ సభ ద్వారా…తుంగతుర్తి కాంగ్రెస్‌లో జరుగుతున్న వ్యవహారాలన్నీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు చేరుతున్నాయన్న ఇండికేషన్ తో పాటు… సరిద్దుకోవాలని, లేదంటే పిసిసినే సరిదిద్దాలని కూడా చెప్పేసినట్టు అయిందంటున్నారు పరిశీలకులు. మొత్తంగా… స్థానిక వ్యవహారాల మీద పార్టీ కొంత సీరియస్‌గానే ఉందన్న సంకేతాలు పంపినట్టు అయిందంటున్నారు. ముఖ్యమంత్రి ఆ స్థాయిలో చెప్పాక అయినా పరిస్థితి మారుతుందా లేక ఎవరికి వారు ఏముందిలే అన్నట్టు లైట్ తీసుకుంటారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.