ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శత్రుత్వం ఉందనుకుంటారు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటిమీద వాలడానికి వీల్లేదన్నట్టుగా ఉంటాయి రెండు పార్టీల నాయకుల స్టేట్‌మెంట్స్. అలాంటి రెండు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఇద్దరి ఫోటోలు ఒకే ఫ్లెక్సీలో ఎందుకు కనిపించాయి? ఇద్దరూ కలిసి లంచ్ మీటింగ్‌కు ఎందుకు అటెండ్ అయ్యారు? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? ఎవరు వాళ్ళు ఇద్దరూ? ప్రీతి రెడ్డి…. అలా చెబితే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు గానీ… మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు అంటే… ఠక్కున గుర్తు పట్టేస్తారు. ఇప్పుడు ఆమె గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందని అంటే… మేడమ్ అడుగులు కూడా పొలిటికల్ ప్లాట్‌ఫాం వైపు పడుతున్నాయట. బోనాల వేడుక సాక్షిగా ఈ విషయం బయటపడటం ఆసక్తికరంగా మారింది. అంతకు మించిన ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటంటే… ప్రస్తుతం ప్రీతి తన మామ ఉన్న బీఆర్‌ఎస్‌లోకి కాకుండా… మరో పార్టీ వైపు చూస్తున్నారట. కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో ఆమె భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఆదివారం పాతబస్తీలో జరిగిన బోనాల వేడుకల సందర్భంగా మేకల మండికి చెందిన ఓ బీజేపీ నేత ఇంట్లో బండి సంజయ్‌తో ప్రీతిరెడ్డి లంచ్ మీటింగ్‌కు అటెండ్ అయ్యారు.
ఇదే సందర్భంలో…ప్రీతి, బండి ఫోటోలతో ప్లెక్సీలు ఏర్పాటవడం ఇంకా ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం గులాబీ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు మల్లారెడ్డి. కానీ…ఆయన కోడలు మాత్రం బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ తో భేటీ అవడం చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం మల్లారెడ్డి విద్యా సంస్థల బాధ్యతలు చూస్తున్నారు ప్రీతి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మల్లారెడ్డి గెలుపు కోసం ఆయన కుమారుడు భద్రారెడ్డి, ప్రీతి కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ… ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో భద్రారెడ్డిని బరిలో దింపాలని అనుకున్నా… తర్వాత జరిగిన పరిణామాలతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అప్పట్లోనే… మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. కానీ సాధ్యపడలేదని చెప్పుకుంటారు. ఆ తర్వాత బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరిగినా.. అదీ సాధ్యపడలేదు.
ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన కోడలు బీజేపీ వైపు అడుగులేస్తున్నారా అన్న అనుమానాల చుట్టూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రకరకాల కార్యక్రమాల్లో పాల్గొన్నారామె. ఇప్పుడు యూనివర్సిటీ వ్యవహారాలు తప్ప రాజకీయంగా ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు తొలిసారి ఒక పొలిటికల్ మీటింగ్‌కు అటెండ్ అవడం గురించి రకరకాల విశ్లేషణలు పెరుగుతున్నాయి. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు, బండి సంజయ్ కి మధ్య మొదటి నుంచి గ్యాప్ ఉందన్నది రాజకీయవర్గాల మాట. ఇటీవల ఆ వార్ ఓపెనైపోయింది కూడా. నువ్వా నేనా అన్న రేంజ్‌కి వచ్చేశారు ఇద్దరూ. ఇలాంటి పరిస్థితుల్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ భద్రారెడ్డి భార్య ప్రీతిరెడ్డితో బండి భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో మల్లారెడ్డి కుటుంబానికి ఉన్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టేందుకు బండి సంజయ్ సరికొత్త ప్లాన్ సిద్ధం చేస్తున్నారా అన్న డౌట్స్ వస్తున్నాయట రాజకీయవర్గాల్లో.
ఈ క్రమంలోనే మల్లారెడ్డి చిన్న కోడలు ప్రీతిరెడ్డితో బండి సంజయ్ లంచ్ మీటింగ్‌కు అటెండ్ అయినట్టు చెప్పుకుంటున్నారు. ఈ మీటింగ్‌పై ఇటు బీఆర్‌ఎస్‌లో కూడా చర్చ మొదలైందట. మల్లారెడ్డి కుటుంబం అన్ని పార్టీల్లో కర్చీఫ్ వేసి పెట్టుకుంటోందని, అవకాశం వచ్చినప్పుడు ఎటు కావాలంటే అటు జంప్ అయ్యేలా ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నట్టు మాట్లాడుకుంటున్నారట. ఈసారి ఎన్నికల్లో అయితే భద్రారెడ్డి లేదంటే ఆయన భార్య ప్రీతిరెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని, అందుకే ఇప్పటి నుంచి జాతీయ పార్టీల నేతలతో ములాకత్ అవుతున్నారన్నది ఇంకో వెర్షన్. మొత్తం మీద బండి- ప్రీతి మీటింగ్ మాత్రం ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది.