Off The Record: గ్రూపులకు కేరాఫ్‌గా మారిన ఆ నియోజకవర్గాన్ని సెట్ చేయడానికి ప్రయత్నాలు చేసిన టీడీపీ అధిష్టానం ప్లాన్ వర్కౌట్ అవుతుందా? పెద్దల వార్నింగ్ మదనపల్లి తమ్ముళ్ళ మీద పని చేస్తుందా? పెద్దలు కోరి తెచ్చుకున్న , గెలిపించుకున్న ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా లోకల్ లీడర్స్ పనిచేస్తారా? లేక పార్టీ చెప్పినట్లు నడుచుకుంటారా? ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఏంటా తమ్ముళ్ళ తన్నులాట కహానీ?
మదనపల్లి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళ తన్నులాట పీక్స్ చేరిందని అంటున్నారు. డజన్ మందికి పైగా నేతలు ఈ టికెట్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినా… చివరికి అధినేత చంద్రబాబు మాత్రం మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాషావైపు మొగ్గు చూపారు. దీంతో అసంతృప్తితో ఉన్న మిగతా నేతలు ఎన్నికల్లో షాజహాన్‌కు సహకరించలేదని చెప్పుకుంటారు. చివరికి కొన్ని చోట్ల ఏజెంట్లను కూడా పెట్టలేదట. అయినా సరే… కూటమి వేవ్‌లో గెలుపు సాధ్యమైంది. అయితే ఆ తర్వాత సీన్ మారిందట. ఎమ్మెల్యే హోదాలో షాజహాన్… తనకు అనుకూలంగా ఉండే పోలీసులకు పోస్టింగ్స్ ఇప్పించుకున్నారట. అలాగే రెవెన్యూలో కూడా జరిగినట్టు చెబుతారు. కానీ రెవెన్యూ విషయంలో ఎమ్మెల్యేకి సీన్ రివర్స్ అయింది. షాజహాన్ బాషా ఏరి కోరి తెచ్చుకున్న తహశీల్దార్ ఖాజాబీ ఏకంగా ఎమ్మెల్యే పైనే ఫిర్యాదులు చేశారు. దీని వెనక స్దానిక నేత శ్రీరాం చినబాబు ఉన్నారన్నది కొందరి అనుమానం. తర్వాత ఎమ్మెల్యే రాష్ట స్థాయిలో ముఖ్యులందర్నీ కలిసి తహశీల్దార్ అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ఆమె 300 కోట్ల రూపాయల అవినీతి చేశారన్నది టీడీపీ నాయకుల లేటెస్ట్ ఆరోపణ. ఇలాంటి వాతావరణంలోనే… క్రమశిక్షణ చర్యలో భాగంగా ఖాజాబీని కేవలం పక్క మండలానికి, అదీకూడా.. ట్రాన్స్‌ఫర్ కాకుండా డిప్యూటేషన్ మీద పంపడం చర్చనీయాంశం అయ్యింది.
అయితే, ఒక అవినీతి అధికారిని బదిలీ చేయాలని చెప్తే.. స్థానిక టిడిపి నేతలు ఆమెకు సహకరిస్తున్నారంటూ.. ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఇదే సమయంలో మదనపల్లి స్పిన్నింగ్ మిల్లును కొన్నవాళ్ళు… అందులో వెంచర్లు వేస్తున్నారు. అందుకు కావాల్సిన మట్టిని తెలుగు యువత అధ్యక్షుడు అక్రమంగా తరలిస్తున్నాడంటూ టిప్పర్లను ఎమ్మెల్యే అడ్డుకోవడం, తర్వాత జరిగిన పరిణామాలలో శ్రీరామ్ చినబాబు అ వాహనాల తాళాలు తీసుకు పోవడం కలకలం రేపింది. ఈ వర్గపోరులో ఎవరికి విలువ ఇవ్వాలో, ఎవరి మాట వినాలో తెలియక నియోజకవర్గంలోని అధికారులు, తెలుగు తమ్ముళ్లు నలిగిపోతున్నారట. దానికి తోడు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా గతంలో టికెట్టు రాని అర డజనుకుపైగా నేతలందరూ కలిసి షాజహాన్ భాషాను డామేజ్ చేసే పనే పెట్టుకున్నారంటూ ఎమ్మెల్యే అనుచరులు బహిరంగంగానే చేబుతున్నారు. సొంత పార్టీలోనే వ్యతిరేకవర్గాలను కంట్రోల్ చేయడానికి ఎమ్మెల్యే ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీరామ్ చినబాబు, దొమ్మలపాటి రమేష్ లాంటి నేతలు వెనుక గోతులు తవ్వుతున్నారనే అంటున్నారట ఎమ్మెల్యే అనుచరులు. ఇంతలా నియోజవర్గంలో ఎవరిని లెక్కచేయకుండా శ్రీరామ్ చినబాబు రెచ్చిపోవడానికి కారణం ఓ మంత్రి అని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇక, ఆ మంత్రి పేరు చెప్పుకొని ఇష్టం వచ్చినట్లు స్థానికంగా అధికారులు బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మదనపల్లి ఎమ్మార్వో అవినీతి నిర్వాకం వెనక కూడా తెలుగు యువత నేత సహా ఒక మంత్రి ప్రమేయం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వివాద క్రమంలో….ఇద్దరు నేతలను అమరావతికి పిలిపించి రాజీ కుదుర్చే ప్రయత్నం చేశారట పార్టీ పెద్దలు. చినబాబు సహా ఇతర నేతల్ని మందలిస్తూనే, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారట. ఎమ్మెల్యేను ఉద్దేశించి పరుష పదజాలం వాడటం సరికాదని, నియోజకవర్గ పాలనలో జోక్యం చేసుకోవద్దని శ్రీరామ్ చినబాబుకు చెప్పినట్లు సమాచారం. ఇక అసంతృప్తితో ఉన్న అందరినీ కలుపుకుపోవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు కూడా తలంటేశారట. దీంతో ఇన్నాళ్ళు ఎడముఖం పెడముకంగా ఉన్న నాయకులు ఇప్పుడు కలుస్తారా? పరస్పరం సహకరించుకుంటారా అన్న చర్చ జరుగుతోంది మదనపల్లి టీడీపీ వర్గాల్లో. పెద్దల వార్నింగ్ ఎంత వరకు మార్పు తెస్తుందో చూడాలి మరి.