తెలంగాణ స్థానిక యుద్ధంలో మరో కొత్త రాజకీయ శక్తి తలపడబోతోందా? తన ఉనికి చాటుకోవాలని ఉవ్విళ్లూరుతోందా? పార్టీ గుర్తులతో సంబంధంలేని ఎన్నికల్ని ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుని తానేంటో నిరూపించుకోవాలనుకుంటోందా? ఇంతకీ ఏదా కొత్త శక్తి? పంచాయతీ మే సవాల్ అంటూ ఎవరికి ఛాలెంజ్ విసురుతోంది? తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది. ఇక ఊళ్ళలో రాజకీయ పార్టీల సందడి గురించి చెప్పేపనేలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్ర స్థాయిలో ఎంత బలం ఉంటే అంత మంచిది కాబట్టి అన్ని పార్టీలు వీటి మీద ఫోకస్ పెడుతున్నాయి. ఇక్కడే ఒక సరికొత్త చర్చ మొదలైంది. మిగతా పార్టీల్లాగే బీఆర్‌ఎస్ కూడా సర్పంచ్ ఎలక్షన్స్‌కు సిద్ధమవుతున్న క్రమంలో… ఆ పార్టీ మూలాలున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఏం చేయబోతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం జాగృతి జనం బాట పేరుతో జిల్లాల పర్యటనలో ఉన్నారామె. సరిగ్గా ఇదే సమయంలో పంచాయతీ ఎన్నికలు రావడంతో జాగృతి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందన్న ఉత్కంఠ పెరుగుతోంది. అయితే… బీఆర్‌ఎస్ నుంచి బయటికి వచ్చాక తనను తాను నిరూపించుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న కవిత… సర్పంచ్ ఎన్నికల్లో పోటీ విషయమై తన కేడర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఆమె బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడే దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న జాగృతి నాయకులు తెలంగాణ భవన్‌లో ఒక అప్లికేషన్ ఇవ్వండని అప్పట్లో చెప్పారు. అలా అప్లికేషన్ ఇచ్చిన వాళ్లకు పార్టీ తరపున టికెట్ ఇప్పించే బాధ్యత తనదంటూ క్లారిటీ ఇచ్చేశారామె. కానీ… ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చినా….ఆ నిర్ణయం మాత్రం మారలేదట. కాకుంటే… బీఆర్‌ఎస్‌కు బదులు జాగృతి తరపునే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓకే చెప్పేసినట్టు సమాచారం. సర్పంచ్ ఎన్నికలకు రాజకీయ పార్టీలు, వాటి గుర్తులతో సంబంధం లేదు.
కానీ…. అభ్యర్థులుగా మాత్రం ఆయా పార్టీల సానుభూతిపరులులే బరిలో ఉంటారు. జనం కూడా ఎక్కువ శాతం ఆ లెక్కనే చూస్తారు, ఓటేస్తారు. ఇప్పుడు ఇదే తమకు కలిసివచ్చే అంశమని చెబుతున్నారు తెలంగాణ జాగృతి నేతలు. పార్టీ గుర్తుతో సంబంధం లేదు కాబట్టి…. కవిత అభిమానులు, ఆమె అనుచరులు ఎవరైనా సర్పంచ్‌గా పోటీచేయాలని అనుకుంటే… వాళ్ళ వెనక తెలంగాణ జాగృతి ఉంటుందని భరోసా ఇస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ రాని వాళ్ళు తమని సంప్రదించవచ్చంటూ ఓపెన్‌గానే చెబుతున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్‌లు తమకు టికెట్ ఇవ్వకుంటే జాగృతి వైపు వెళదామని గ్రామస్థాయి నాయకులు భావిస్తున్నట్టు సమాచారం. అటు కవిత కూడా… తనకు అవకాశం వచ్చింది కాబట్టి తన బలం ఏంటో కూడా నిరూపించాలనుకుంటున్నారట. తమ అనుచరగణం గట్టిగా ఉండి… గెలుస్తామని గ్యారంటీ ఉన్న గ్రామ పంచాయతీల లిస్ట్ తయారు చేయడంలో బిజీగా ఉన్నారట కవిత సన్నిహితులు. ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుని… గులాబీ పెద్దలకు తానేంటో నిరూపించాలనుకుంటున్నట్టు సమాచారం. మొత్తం మీద సర్పంచ్ ఎన్నికల్లో…పోటీ చేసే అభ్యర్థులకు అవకాశం ఉన్నచోటల్లా మద్దతు ఇచ్చేందుకు తెలంగాణ జాగృతి సిద్ధమవుతోంది. అయితే గ్రామస్థాయిలో ఎలాంటి పార్టీ నిర్మాణం లేని తెలంగాణ జాగృతి ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది ఇక్క బిగ్ క్వశ్చన్.