OTR : కారంపూడి ఎస్ఐ ఎపిసోడ్.. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక ఎస్సై ఎపిసోడ్ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెట్టిందా? అదీకూడా… ఎలక్షన్ టైం నుంచి నిన్నటిదాకా… దోస్త్ మేరా దోస్త్ అనుకున్న వాళ్ళ మధ్యనే అనుమానపు అగ్గి అంటుకుందా? పల్నాడు పొలిటికల్ హీట్‌కు మిర్చి ఘాటు తోడై ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఎక్కడ? ఎవరా ఇద్దరు శాసనసభ్యులు? ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా… ఎవరు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా…. పల్నాడు జిల్లా మాచర్ల, గురజాల రాజకీయం ఎప్పుడూ సలసల కాగుతూనే ఉంటుంది. రెండూ సమస్యాత్మక నియోజకవర్గాలే. గత ఎన్నికల్లో పల్నాడు జిల్లా మొత్తాన్ని టీడీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. మాచర్ల నుంచి జూలకంటి బ్రహ్మారెడ్డి, గురజాల నుంచి యరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇద్దరి మధ్య మొదట్నుంచి సఖ్యత బాగానే ఉంటుంది. ఎన్నికల సమయంలో కూడా పరస్పరం సహకరించుకున్నారు. ఆ తర్వాత రెండేళ్ళ నుంచి గురజాలలో ఏదైనా కార్యక్రమం జరిగితే జూలకంటి హాజరవడం, మాచర్లలో ప్రోగ్రామ్స్ జరిగితే యరపతినేని రావడం సర్వ సాధారణమైపోయింది. ఇంత సఖ్యతగా ఉంటున్న ఇద్దరు మిత్రుల మధ్య ఇప్పుడో అనుమాన బీజం పడటమేకాదు… అది పెరిగి పెద్దదై మానుగా మారుతోందట. కారంపూడి ఎస్సై వాసును డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసిన వ్యవహారమే ఇందుకు కారణం అని అంటున్నారు. కారంపూడికి చెందిన మిర్చి వ్యాపారి అయ్యప్ప… మండలంలోని సుమారు 50మంది రైతుల నుంచి కోటి 70లక్షల విలువైన పంట కొనుగోలు చేశాడు. కానీ రైతులకు మాత్రం డబ్బులు ఇవ్వకుండా అదిగో అమావాస్యకు, ఇదిగో పౌర్ణానికి అంటూ వాయిదా పర్వం నడిపిస్తున్నాడు. అయ్యప్ప వైఖరితో విసిగిపోయిన రైతులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో వ్యాపారి తెలంగాణాలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్ళాడు. రైతుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు మొదలుపెట్టిన కారంపూడి ఎస్సై వాసు.. సిబ్బందిని పంపి ఆ ఊరినుంచి అయ్యప్పను రప్పించారు. రైతులకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి విచారిస్తున్న క్రమంలోనే… అయ్యప్ప భార్య పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. డబ్బుల పేరుతో ఎస్సై వాసు తమను వేధిస్తున్నాడని, అందుకే తాను చనిపోవాలనుకుంటున్నట్టు ఆరోపించారామె. ఈ క్రమంలో శాఖాపరమైన విచారణ జరిపిన పోలీస్ ఉన్నతాధికారులు ఎస్సైని సస్పెండ్ చేశారు. సరిగ్గా ఈ పాయింటే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మనస్పర్ధలకు కారణమైందని అంటున్నారు. ఎస్సై సస్పెండ్ వెనక గురజాల ఎమ్మెల్యే యరపతినేని ప్రమేయం ఉందని మాచర్ల శాసనసభ్యుడు జూలకంటి వర్గీయులు భావిస్తున్నారట. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలోని ఎస్సైపై చర్యలు తీసుకోవడం వెనుక యరపతినేని జోక్యం ఉందని బ్రహ్మారెడ్డి కూడా బలంగా నమ్మి కినుక వహించినట్టు చెప్పుకుంటున్నారు.
అయితే… కారంపూడి ఎస్సైపై చర్యలతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని యరపతినేని వర్గీయులు చెప్పుకొస్తున్నారు. ఈ వ్యవహారం ఇలా నడుస్తుండగానే…. కారంపూడి మండలానికి చెందిన కొంతమంది గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠిని కలిశారు. ఎస్సై వాసు అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేయడంతో పాటు గతంలో కూడా ఆయన తీరు వివాదాస్పదంగా ఉందని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అయితే… అలా ఐజీకి ఫిర్యాదు అందిన మరుసటి రోజే అయ్యప్పకు మిర్చి అమ్మిన రైతులు కూడా ఐజీని కలిశారు. వ్యాపారి తమను మోసం చేశాడని, రావాల్సిన డబ్బులు ఇప్పించాలని ఆయన్ని కోరారు. ఈ విషయంలో ఎస్సై వాసు తమకు న్యాయం చేసేందుకు ప్రయత్నించారంటూ వివరాలు చెప్పారు. ఇందులో ఎస్సై తప్పేమీ లేదంటూ కితాబిచ్చారు రైతులు. మా కంటే ముందు వచ్చి కలిసినవారు అసలు రైతులే కాదని కూడా క్లారిటీ ఇచ్చేశారు. అయితే… ఆ రకంగా రైతుల పేరుతో రెండు రోజులు వరుసగా ఐజీని కలిసి ఫిర్యాదు చెయ్యడానికి కూడా ఇద్దరు నేతల మధ్య ఆధిపత్యపోరే కారణమన్న ప్రచారం జరుగుతోంది. కారంపూడిలో టీడీపీలో ఉన్న వర్గ విబేధాల వల్లే ఇదంతా జరుగుతోందని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. ఇక్కడి ఒక నాయకుడితో ఎస్సై సన్నిహితంగా ఉండడం… మరో నాయకుడికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో సదరు నేత ఎస్సై వ్యవహారం గురించి పార్టీ పెద్దలకు సమాచారం చేరవేసినట్లు చెప్పుకుంటున్నారు. ఇలా స్థానిక నేతల మధ్య మొదలైన వివాదం ఇప్పుడు రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేల మధ్య అభిప్రాయభేదాలకు దారితీస్తోందన్నది పల్నాడు పొలిటిరల్ వాయిస్. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య నడుస్తున్నవ్యవహారం పార్టీ పెద్దల దృష్టికి కూడా వెళ్ళిందట. నిన్నటివరకూ కలిసి మెలిసి తిరిగిన నేతల మధ్య సంబంధంలేని, చాలా చిన్న విషయంలో గ్యాప్ రావడం టీడీపీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యింది.
Also Read
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!