Site icon NTV Telugu

Off The Record : జూబ్లీ హిల్స్ పోరులో మైనార్టీల ఓట్లు ఎవరికి?

Jubilee

Jubilee

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో అనుకున్నవే ఉంటాయా? లేక అద్భుతాలు జరుగుతాయా? అత్యంత కీలకమైన ముస్లిం ఓటర్ల మొగ్గు ఎటువైపు? ఎంఐఎం కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించినా… ఆ ఓట్లు సాలిడ్‌ అవుతాయా లేదా అన్న అనుమానాలు ఎందుకు పెరుగుతున్నాయి? నియోజకవర్గంలో అసలు మైనార్టీ ఓట్‌బ్యాంక్‌ టార్గెట్‌గా జరుగుతున్న రాజకీయం ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది అధికార కాంగ్రెస్‌ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల నాటికి, ఇప్పటికీ పట్టులో ఏ మాత్రం తేడా రాలేదని నిరూపించాలనుకుంటోంది. అధిష్టానం కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్‌లో గెలిచి తీరాల్సిందేనని దిశానిర్దేశం చేసిందట. ఓవరాల్‌గా ప్రతిపక్షం సిట్టింగ్‌ సీటులో పాగా వేసి తీరాలన్నది కాంగ్రెస్‌ నాయకత్వం పెట్టుకున్న బాటమ్‌ లైన్‌. అందుకే… నియోజకవర్గంలో కలిసివచ్చే ఏ ఒక్క అంశాన్ని వదలకుండా ఫోకస్‌ పెటిందట నాయకత్వం. ఈ క్రమంలోనే మైనార్టీ ఓట్‌ బ్యాంక్‌ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఈ నియోజకవర్గంలో ముస్లింలు డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌గా ఉన్నారు. లక్ష ఓట్లకు పైగానే ముస్లిం మైనార్టీలకు ఉన్నాయి.

ఈ క్రమంలో ఇప్పుడు వాళ్ళు ఎటువైపు మొగ్గే అవకాశం ఉందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ బలమైన ఓట్‌ బ్యాంక్‌ మీద కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్‌ కూడా కన్నేసింది. ముస్లిం ఓటర్లను మజ్లిస్‌ పార్టీ గట్టిగానే ప్రభావితం చేస్తుందన్నది అందరూ చెప్పుకునే మాట. ప్రస్తుతం ఎంఐఎం కాంగ్రెస్‌ వైపు ఉంది. దీంతో… ఆ ఓట్‌ బ్యాంక్‌లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తోందట బీఆర్‌ఎస్‌. ఎంఐఎం వ్యతిరేక వర్గాన్ని తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. అటు కాంగ్రెస్‌ పార్టీ ముస్లిం ఓట్లు తమకు సాలిడ్‌ అవుతాయని ఆశలు పెట్టుంకుంది. ఈ పరిస్థితుల్లో… ఆ ఓట్లు చీలతాయా? లేక సాలిడ్‌ అవుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గంలో ఎంఐఎంకు ముగ్గురు కార్పొరేటర్స్‌ ఉన్నారు. ఇది కొంతవరకు కాంగ్రెస్‌కు కలిసిరావచ్చంటున్నారు. దాంతో పాటు సహజంగా కాంగ్రెస్‌ వైపునకు మొగ్గే ముస్లిం ఓట్లు ప్లస్‌ అవుతాయని అంచనా వేసుకుంటున్నారు. అటు పార్టీకి చెందిన షబ్బీర్‌ అలీ లాంటి మైనార్టీ నేతలు కూడా…స్థానిక పెద్దలతో వరుస భేటీలు నిర్వహించారు. ఇలా.. రకరకాల మార్గాల్లో…మైనార్టీ ఓటు బ్యాంక్‌ను తనకు వన్‌సైడ్‌ చేసుకునే పనిలో బిజీగా ఉంది కాంగ్రెస్‌ నాయకత్వం. అటు గత లోక్‌సభ ఎన్నికల్లో… కాంగ్రెస్‌ని దెబ్బతీయడం కోసం బీఆర్‌ఎస్‌..బీజేపీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపిస్తూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ.

బీజేపీకి రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు రావడానికి కారణం కూడా అదేనన్నది కాంగ్రెస్‌ ముఖ్యుల వాదన. అలాగే… కేసీఆర్‌ కుమార్తె కవిత కూడా… బీఆర్‌ఎస్‌ బీజేపీతో జతకట్టే పనిలో ఉందని గతంలో ఆరోపించారు. కేసీఆర్‌ కన్న కూతురే క్లారిటీగా ఆ విషయం చెప్పేశాక ఇక అనుమానాలు ఎందుకంటూ… అదే విషయాన్ని ముస్లిం వర్గాల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నారట కాంగ్రెస్‌ నాయకులు. ఈ విషయం బలంగా ఎక్కితే… ఇక ముస్లింలు బీఆర్‌ఎస్‌ను నమ్మబోరన్నది కాంగ్రెస్‌ పెద్దల లెక్కగా తెలుస్తోంది. ఇటీవల చార్మినార్ దగ్గర జరిగిన సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి… పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి కాంగ్రెస్‌ మీద కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.ఆ రెండు పార్టీలు ఒకటేనని చెప్పడంతో పాటు… ఎంఐఎం కూడా పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించింది గనుక ముస్లిం ఓట్లు తమకు సాలిడ్‌ అవుతాయన్నది హస్తం పార్టీ కేలిక్యులేషన్‌. మరి ఈ లెక్కలు పక్కాగా అమలవుతాయా? లేక బీఆర్‌ఎస్‌ చీలిక మంత్రం ఫలిస్తుందా అన్నది పోలింగ్‌ బూత్‌లోనే తేలాలి.

Exit mobile version