మంచి తరుణం మించిన దొరకదు….సందు దొరికింది బిస్తరేసేద్దామనుకున్నారు. కాకితో కబురు పంపితే చాలు ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో వాలిపోయేవారు. మాజీ ఎమ్మెల్యే యాక్టివ్‌గా లేని టైం చూసి…ఇక జెండా పాతేద్దామనుకున్నటైంలో సీన్స్ రివర్స్ అయిపోయిడీప్‌గా హర్టయ్యారట ఆ మాజీ ఎంపీ. ఎవరా మాజీ? పిలవని పేరంటాలన్న మాటలు ఆయన నోటి నుంచి ఎందుకు వస్తున్నాయి?
రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. మితృత్వాలు, శతృత్వాలతో పాటు సీట్లకు కూడా గ్యారంటీ ఉండదు. ప్రస్తుతం హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పరిస్థితి కూడా అలానే ఉందట. గమ్యం ఏంటో.. గమనం ఏంటో చివరికీ ఆయనకు కూడా అంతు చిక్కుండా ఉందని చెప్పుకుంటున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏదో చేద్దామనుకుని ఒక అడుగు అడ్వాన్స్ అయ్యేసరికి సర్రున కాలిపోయిందని, దెబ్బకు కామ్‌గా చెయ్యి, కాలు వెనక్కి తీసుకున్నారని చెప్పుకుంటున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో. పోలీస్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్న గోరంట్ల.. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చీ ఇవ్వగానే… ఎంపీ టికెట్ దక్కడం, హిందూపురం నుంచి భారీ మెజారిటీతో గెలవడం చకచకగా జరిగిపోయాయి.
పోలీస్‌గా ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ తరహా వ్యవహార శైలిని ప్రదర్శించేవారు మాధవ్. దాంతో నిత్యం వార్తల్లో ఉండేవారు. ఇక ఎంపీ అయ్యాక కూడా ఆయన ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. పైగా వివాదాలు పెరిగాయి. అన్నిటికీ మించి ఓ బూతు వీడియో ఆయన రాజకీయ జీవితాన్ని తల్లకిందులు చేసేసింది. ఆ కారణంగానే… 2024 ఎన్నికల్లో పార్టీ టికెట్ కూడా దక్కలేదంటారు. అయినా సరే… అలకల్లాంటి కార్యక్రమాలు, ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు లేకుండా వైసీపీలోనే కొనసాగుతూ వచ్చారు మాధవ్. ఎన్నికలకు ముందు కాస్త స్తబ్దుగా కనిపించినా ఓటమి తర్వాత తిరిగి రీఛార్జ్ అయ్యారాయన. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొన్నాళ్ళు యాక్టివ్‌గా లేరు. ఓటమి తర్వాత చాన్నాళ్ళు అసలు ఉన్నారా లేదా అన్నట్టుగా ఉండేవారు తోపుదుర్తి. సరిగ్గా ఆ టైం చూసి నియోజకవర్గం మొత్తం కలియ తిరిగారు గోరంట్ల.
నిత్యం ఏదో ఒక అంశాన్ని బేస్ చేసుకుని అక్కడ జనంలోకి చొచ్చుకువెళ్ళే ప్రయత్నం చేశారు. ఇంకా చెప్పాలంటే… రాప్తాడుల ఇక తోపుదుర్తి యాక్టివ్ అవబోరన్న అంచనాతో… తాను పాగా వేయాలనుకున్నారట. గోరంట్ల మాధవ్‌ది కురుబ సామాజిక వర్గం కావడం, రాప్తాడులో ఆ కులం ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో సహజంగానే… కొంత మంది నాయకులు మాజీ ఎంపీకి చేరువయ్యారు. అలా…. ఆయన నియోజకవర్గంలో బలపడుతున్న సమయంలోనే అనుకోకుండా కొన్ని సంఘటనలతో తిరిగి యాక్టివ్ అయయ్యారు తోపుదుర్తి. పాతకాపు కావడంతో… సహజంగానే… ఆయనకు కొన్నిఅంశాలు బాగా కలిసి వచ్చాయి. దాంతో మాధవ్ మళ్ళీ రాప్తాడు వైపు రాకుండా బ్రేకులు వేయగలిగారట మాజీ ఎమ్మెల్యే. ఓవైపు తోపుదుర్తి నో ఎంట్రీ బోర్డ్ పెట్టేస్తే… మరోవైపు వైసీపీ అధిష్టానం కూడా…అటువైపు చూడొద్దని చెప్పేసినట్టు సమాచారం. ఇదే విషయాన్ని నియోజకవర్గంలో గట్టిగా ప్రచారం చేస్తున్నారు తోపుదుర్తి వర్గీయులు. మాధవ్ మాత్రం దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా గతంలో వెంటనే అక్కడ కనిపించే మాజీ ఎంపీ… మూడు నెలలుగా చుట్టపు చూపుగా కూడా వెళ్లడం లేదు. ఎవరైనా తనకు సంబంధించిన వారు శుభకార్యాలకు పిలిస్తేనే అటెండ్ అవుతున్నారు. ఎందుకిలా అని అడిగితే… పిలవని పేరంటాలకు వెళ్ళడం ఎందుకని తాపీగా సమాధానం ఇస్తున్నారట. పిలిస్తే మాత్రం వెళ్తానని, ఎవరో కొందరు అభద్రతా భావానికి గురై నన్ను పిలవకపోతే నేనెలా వెళ్తానని గడుసుగా చెబుతున్నారట. ఆయన పొలిటికల్‌గా సైలెంట్ అవ్వలేదు, రాప్తాడు నియోజకవర్గానికి మాత్రమే దూరంగా ఉన్నారన్నది మాధవ్ సన్నిహితుల మాట. వోవరాల్‌గా రాప్తాడు కోసం మాజీ ఎంపీ వేసిన స్కెచ్ మాత్రం వర్కౌట్ అవలేదన్నది అనంత పొలిటికల్ సర్కిల్స్ వాయిస్.