OTR : ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్‌ఎస్ కొత్త వ్యూహం

Brs

Brs

ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసు విషయంలో బీఆర్ఎస్‌ వ్యూహం మారిందా? డ్యామేజ్‌ కంట్రోల్‌ మొదలైందా? కామ్‌గా ఉంటే రాజకీయంగా బాగా నష్టం జరిగిపోతున్నట్టు పార్టీ పెద్దలు గ్రహించారా? అందుకే ముల్లును ముల్లుతోనే తీయాలన్న ఫార్ములాను ఫాలో అవుతున్నారా? ఇంతకీ గులాబీ పార్టీ వైఖరిలో వచ్చిన మార్పు ఏంటి? దాని గురించి జరుగుతున్న చర్చలేంటి?తెలంగాణ పాలిటిక్స్‌ను ఓ కుదుపు కుదిపేసిన కేసుల్లో ఒకటి ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్‌ రేసింగ్‌ నిర్వహించింది. అయితే… ఆ ఎపిసోడ్‌లో భారీ ఎత్తున నిధుల గోల్‌మాల్‌ జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపాయి. అప్పట్లో కేబినెట్‌ ఆమోదం లేకుండా… రేసింగ్‌ నిర్వహణకు నిధులిచ్చారంటూ ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించింది కాంగ్రెస్‌ సర్కార్‌. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌… కేసులో ఏ1గా ఉన్నారు. ఈ క్రమంలోతాజాగా ఏసీబీ కోర్ట్‌లో విచారణకు హాజరయ్యారాయన. అదంతా ఒక ఎత్తయితే… ఫార్ములా ఈ కేసుతో వ్యక్తిగతంగా కేటీఆర్‌కు, అలాగే… పార్టీగా బీఆర్‌ఎస్‌కు కూడా బాగానే డ్యామేజ్‌ అవుతోందన్న విశ్లేషణలు ఎప్పట్నుంచో ఉన్నాయి.

ఇదే విషయాన్ని గుర్తించి గులాబీ హైకమాండ్‌… డ్యామేజ్‌ కంట్రోల్‌ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా రివర్స్‌ అటాక్ మోడ్‌ ఆన్ చేస్తున్నారట. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టుగా… అసలు వాస్తవాలు ఇవీ… అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలుపెట్టింది బీఆర్‌ఎస్‌. క్యాబినెట్ ఆమోదం లేకుండా డబ్బులు నేరుగా ఒక కంపెనీకి పంపించడం, తిరిగి ఆ కంపెనీ నుంచి కేటీఆర్‌కు , బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోకి వచ్చాయన్నది ప్రధాన ఆరోపణ. ఇప్పుడీ ఆరోపణను తిప్పి కొట్టే లక్ష్యంతో కేసులో వాస్తవాల పేరుతో సోషల్ మీడియా ప్రచారం మొదలుపెట్టింది కారు పార్టీ. బీఆర్ఎస్ చెబుతున్నదాని ప్రకారం చూస్తే…. ఫార్ములా-ఈ రేస్‌ అనేది హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టేందుకే. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, నగర బ్రాండ్ విలువను పెంచడం లాంటి ఉన్నత లక్ష్యాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ప్రపంచ స్థాయి ఈవెంట్‌లో ఎక్కడా తేడా రాకుండా చూసేందుకే ప్రభుత్వం స్పాన్సర్‌షిప్‌ బాధ్యతలు తీసుకుందని, ఆ మేరకే అన్ని చెల్లింపులు ఒప్పందాల ప్రకారమే జరిగాయన్నది ఆ పార్టీ వాదన. అలాగే… అసలు అవినీతి ఎక్కడ జరిగింది..? ప్రభుత్వానికి జరిగిన ఆర్థిక నష్టం ఎంత…? ఏ నిబంధనల్ని ఉల్లంఘించారు? వ్యక్తిగతంగా ఎవరు లబ్ధి పొందారు..? లాంటి కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు లేకుండానే కేసు ముందుకు వెళ్తోందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు.

 

మొదట్లో బాగా హడివిడి జరిగినా మధ్యలో కాస్త తగ్గి… తిరిగి మూడు నెలల తర్వాత మళ్లీ చర్చ మొదలవడంతో బీఆర్ఎస్ ఒక్కసారిగా అలర్ట్ అయింది. ముఖ్యంగా… గ్రేటర్ పరిధిలోని మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో ఇది తమకు పాజిటివ్‌ అయ్యేలా ప్రచారాన్ని డిజైన్‌ చేస్తోందట. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకే ఫార్ములా ఈ కార్‌ రేస్ అంటూ సిటీ జనానికి దగ్గరయ్యే ప్రయత్నంలో ఉంది. అందులో భాగంగానే…. ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో నిజానిజాలు అంటూ ఒక ఫార్మాట్‌ తయారు చేసి పార్టీ నేతలు, కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఈ విషయంలో వచ్చిన ఆరోపణలకు కౌంటర్‌ వేయాలంటే… ఇదే సరైన మార్గం అన్న అభిప్రాయంలో ఉన్నారట గులాబీ పెద్దలు. ఇటు ప్రభుత్వం మాత్రం….ఈ కేసు విషయంలో మొదట్నుంచి చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతోంది. దర్యాప్తు సంస్థలు సేకరించిన ఆధారాల మేరకే కేసు ముందుకు వెళ్తోందని అధికార వర్గాలు అంటున్నాయి. దీంతో… ఈ కేసు ప్రభావం తెలంగాణ రాజకీయాలపై దీర్ఘకాల ప్రభావం చూపుతుందా… BRS కౌంటర్ ఎటాక్‌ను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు. రాబోయే ఎన్నికల్లోనూ ప్రధాన రాజకీయ అస్త్రంగా మారుతుందా లాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.