పదవి కోసం పార్టీల మధ్య రింగాట ఆడిన ఆ రాజకీయ దంపతులకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోందా? ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాళ్ళతో మనకు పనిలేదని హార్డ్‌కోర్ టీడీపీ వాళ్ళు వాయిస్ పెంచుతున్నారా? అత్యంత కీలకమైన పదవిని ఎప్పుడూ వాళ్ళకే ఇచ్చేస్తే… మరి మా సంగతేంటని పెద్దల్ని నిలదీసే పరిస్థితి వస్తోందా? ఎక్కడ జరుగుతోందా వ్యవహారం? ఎవరా పొలిటికల్ కపుల్? ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి వరుసగా రెండుసార్లు ఎన్నికయ్యారు షేక్ నూర్జహాన్. పేరుకు మేడమ్ మేయర్ అయినా…. పెత్తనం మొత్తం ఆమె భర్త, రియల్టర్ SMR పెదబాబు చేస్తారన్నది ఇక్కడ ఓపెన్ టాక్. ఫస్ట్‌టైం టీడీపీ తరపున మేయర్ అయ్యాక ఈ జంట…, వైసిపి అధికారంలోకి రాకముందే ఆ పార్టీలోకి ఫిరాయించారు. వాతావరణం అనుకూలంగా ఉన్నంతకాలం ఫ్యాన్‌కిందే ఉండి…. 2024 ఎన్నికల తర్వాత మరోసారి టీడీపీలోకి గోడ దూకేశారు. ఇలా…మేయర్ పదవిని నిలబెట్టుకోవడానికి.. గాలి ఎటు అనుకూలంగా ఉంటే ఆ జెండా పట్టుకోవటం వీళ్ళకు మంచినీళ్ళ ప్రాయం అన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. ఈ క్రమంలోనే….మరోసారి ఆ పదవి కోసం గట్టి ప్రయత్నాలే మొదలు పెట్టినట్టున్నారన్న చర్చలు ఏలూరు కార్పొరేషన్‌లో హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. ఈ క్రమంలో…టీడీపీ, వైసీపీ మధ్య రింగాట ఆడుతున్న మేయర్ దంపతులకు మరోసారి ఛాన్స్ ఇస్తే… మేం ఊరుకునేది లేదంటూ… ఏలూరు తమ్ముళ్ళు స్వరం పెంచుతున్నారట.
దాదాపు 200 కోట్ల బడ్జెట్ ఉండే ఏలూరు నగర కార్పొరేషన్ మేయర్ పదవి కోసం పోటీ తీవ్రంగా ఉంటుంది. దాని కోసం పదేళ్లుగా ఇటు టిడిపిలో, ఆ తర్వాత వైసీపీలో ఇప్పుడు కూటమిలో ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే చాలామంది ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణతో పాటు టిడిపి అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారట. మరోవైపు జనసేన సైతం గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఎలాగూ ఇవ్వలేదు, కనీసం ఇప్పుడు మేయర్ పదవిని అయినా దక్కించుకోవాలన్న ఆశతో ఉందట. ఈ పరిస్థితుల్లో… వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన ఈ సీటు ఎవరికి తగ్గుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోసారి కార్పొరేషన్‌లో పాగా వేసేందుకు నూర్జహాన్ పెదబాబు ట్రయల్స్‌లో ఉన్నప్పుడే…. వారిని అడ్డుకునేందుకు టిడిపిలోని ఓ వర్గం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. పార్టీ కోసం కష్టపడిన వారికి ఇప్పటికైనా గుర్తింపు ఇవ్వకుంటే భవిష్యత్తులో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతాయన్న హెచ్చరికలు సైతం టీడీపీ వర్గాల నుంచే వస్తున్నాయి. కేవలం డబ్బు ఖర్చు చేసే వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు ఇవ్వాలంటూ ఇటు ఎమ్మెల్యే అనుచర వర్గం సైతం గొంతు పెంచుతోంది.
దీంతో ఏలూరు మేయర్ పదవి చుట్టూ రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది. మరో రెండు నెలల్లో పదవీకాలం ముగుస్తుంది. దీంతో… ఈసారి పాత వాళ్ళకే టిక్కెట్ దక్కకుండా….వాళ్ళ ప్రాధాన్యత తగ్గించడం కోసం తెలుగుదేశం పార్టీలోని ఓ వర్గం భారీ ప్రయత్నాలే చేస్తోందట. ఇందుకు ఇటీవల ఏలూరులో జరిగిన తృప్తి క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమం వేదికగా మారిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మేయర్ అండ్ కో ప్రాధాన్యత తగ్గించేందుకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వలేదట. దాంతో ఆమె అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయినట్టు చెప్పుకుంటున్నారు. వీళ్లు ఎలాగూ పక్కకి జరిగేలా లేరు, ఆ పనేదో మనమే చేసేస్తే పోలా… అంటూ కొంతమంది టీడీపీ నేతలు మేయర్ జంటను టార్గెట్ చేసుకుని రాజకీయం నడుపుతున్నట్టు సమాచారం. పదవీకాలం ముగియగానే వారి ప్రాధాన్యత ఎలాగూ తగ్గుతుంది కాబట్టి… మెల్లగా పక్కకి నెట్టవచ్చన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో… రేపు గెలిచాక పదవిని పూర్తి కాలం ఒకరికే ఇవ్వాలా.. లేక ఇద్దరు, ముగ్గురి మధ్య పంచాల్నా అన్న ఆలోచన సైతం నియోజకవర్గ పెద్దల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి పదవి దక్కించుకునేందుకు ఇటు టిడిపి, అటు జనసేన నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికే తారా స్థాయికి చేరుకున్నాయి. మొత్తానికి 10 ఏళ్ల పాటు పదవిలో పాతుకుపోయినా.. భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న అయోమయంలో సిట్టింగ్ మేయర్ దంపతులు ఉన్నట్టు సమాచారం. పార్టీలు మారుతూ పదవులు కాపాడుకున్న నేతలు మరోసారి తెరపైకి వస్తారా లేక ఇక్కడితో పుల్ స్టాప్ పడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
