ఆ మాజీ ఉప ముఖ్యమంత్రి పొలిటికల్ వీఆర్ఎస్ తీసుకోబోతున్నారా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని ఎందుకు ప్రకటించారు? అది రాజకీయ వైరాగ్యమా? లేక అంతకు మించిన వ్యూహమా? వైసీపీ ఆవిర్భావం నుంచి కీలకంగా ఉండి, జగన్‌కు అత్యంత సన్నిహిడని పేరున్న ఆ లీడర్‌కి ఎవరు? పెద్ద స్థాయి పలుకుబడి ఉండి కూడా ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నారు? ఉమ్మడి శ్రీకాకుళంలో సుదీర్ఘ రాజకీయ ఆధిపత్యం చెలాయించారు ధర్మాన బ్రదర్స్. జిల్లాలో యాంటీ టీడీపీ స్టాండ్ అంటే… ఠక్కున గుర్తుకు వచ్చేది ప్రసాదరావు, కృష్ణదాసే. ఈ క్రమంలో… ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ రోల్‌కు సంబంధించి తాజాగా మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
తనకు రాజకీయాలపై ఆసక్తి తగ్గిందని ఎన్నికలకు ముందు తమ్ముడు ధర్మాన ప్రసాదరావు చెబితే…. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక అన్న కృష్ణదాస్ కూడా అదే పాట పాడటంతో… బ్రోస్ ఎందుకిలా మాట్లాడుతున్నారు? వీళ్ళేమీ అనుభవం లేని వాళ్ళు కాదు, ఏదో ఒకటి రెండు ఘటనలకు టెంప్ట్ అయిపోయి ఇన్‌స్టంట్ నిర్ణయాలు తీసుకునే వాళ్ళు కాదు. మరెందుకిలా స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారని ఆరాతీసిన వాళ్ళకు కొత్త సంగతులు తెలిసి, ఓ….. అదా విషయం. అనుకున్నాం, ఇలాంటిదేదో ఉండి ఉంటుందని అంటూ నిట్టూరుస్తున్నారట. ఈ బ్రదర్స్‌ది రాజకీయ నైరాశ్యం కాదని, ఒక పథకం ప్రకారమే… తమ వారసులకు లైన్ క్లియర్ చేసేందుకు వీఆర్‌ఎస్ స్కీమ్‌ని ఎంచుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎంతైనా… సీనియర్స్ కదా…. అందుకే… వీళ్ళ కోయిలలు ముందే కూస్తున్నాయట. తనకు వయసు అయిపోయిందని అన్ని పదవులు అనుభవించానని, ఇక నుంచి జగన్ వెంట ఉంటాను తప్ప… ఎన్నికల పోటీలో ఉండబోనని తాజాగా కృష్ణదాస్ అనడం పక్కా స్క్రిప్ట్ ప్రకారమేనన్న విశ్లేషణలున్నాయి జిల్లాలో. అదే సమయంలో తన కుమారుడు కృష్ణ చైతన్య 2029ఎన్నికల బరిలో ఉంటాడని చెప్పడాన్ని కలిపి చూస్తే… పిక్చర్ క్లియర్ అంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఇదంతా వారసత్వ రాజకీయం కోసమేనన్నది విస్తృతాభిప్రాయం. వైసీపీ ఆవిర్భావం జగన్ వెంటే ఉంది ధర్మాన కృష్ణదాస్ కుటుంబం.
అందుకు తగ్గట్టే పార్టీ కూడా ఆయనకు రకరకాల పదవులు ఇచ్చి గౌరవించింది. అయితే…ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లో ఉంది. వారసుడిని తెరమీదికి తీసుకురావాలనుకోవడం వరకు ఓకేగానీ, ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్‌లో ఈ వీఆర్‌ఎస్ స్టేట్‌మెంట్ కరెక్ట్ కాదంటున్నారు. ప్రస్తుతం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్నారాయన. అలా నడిపించాల్సిన నాయకుడు ఇలాంటి మాటలు మాట్లాడితే… జిల్లా పరిధిలో క్యాడర్ మీద వ్యతిరేక ప్రభావం చూపదా అన్నది కొందరి క్వశ్చన్. తన మనసులో అలాంటి అభిప్రాయం ఉన్నా… వ్యక్తం చేయడానికి ఇది సరైన సమయం కాదంటున్నారు పార్టీ నాయకులు. సీనియర్ లీడర్‌గా తాను ముందుకొచ్చి కేడర్‌ని నడిపించి ఆ తర్వాత టైం వచ్చినప్పుడు వీఆర్ఎస్ నిర్ణయం ప్రకటిస్తే పోయేదికదా అన్న అభిప్రాయం బలంగా ఉందట సిక్కోలు వైసీపీ ద్వితీయ శ్రేణిలో. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కుమారుడు కృష్ణ చైతన్య నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరించారు. ప్రస్తుతం జడ్పీటీసీగా ఉన్నారు. అలాంటిది నియోజకవర్గం అంతా తాను యాక్టివ్‌గా తిరుగుతూ కృష్ణ చైతన్యను ప్రమోట్ చేయాల్సింది పోయి… ఈ వైరాగ్యపు మాటలేంటనే వారు సైతం ఉన్నారు లోకల్ వైసీపీలో. ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ళ టైం ఉండగానే… జిల్లా పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉండి అస్త్ర సన్యాసం ప్రకటించడం కచ్చితంగా కేడర్ మీద నెగెటివ్ ప్రభావం చూపుతుందని పార్టీ పెద్దలు సైతం తల కొట్టుకుంటున్నారట.