OTR : దానం, పోచారం మళ్లీ కారెక్కుతారా..? గులాబీ వైపు చూపులు..?

Pochaam

Pochaam

ఆ ఎమ్మెల్యేలకు ఇప్పుడు గులాబీ గుభాళింపులు మత్తుగా, గమ్మత్తుగా అనిపిస్తున్నాయా? ఆ వాసన అస్సలు పడటం లేదంటూ ఒకప్పుడు కారు దిగేసిన వాళ్ళు… ఇప్పుడు మాత్రం ఆ…రోజుల్లో….. అంటూ ఎందుకు దీర్ఘాలు తీస్తున్నారు? వాళ్ళ మాటల మర్మం ఏంటి? అది నిజంగానే గులాబీ ప్రేమా? లేక కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే వ్యూహమా? ఎవరా శాసనసభ్యులు? ఏంటా కొత్త రోజ్‌ పెర్‌ఫ్యూమ్‌ స్టోరీ?తెలంగాణ రాజకీయం మరోసారి పార్టీ మారిన ఎమ్మెల్యేల వైపు టర్న్‌ అవుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన శాసనసభ్యులు కాంగ్రెస్‌ గూటికి చేరాక చాన్నాళ్ళ పాటు ఆ ఎపిసోడ్‌ నడిచింది. బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు, కోర్ట్‌ డైరెక్షన్‌ లాంటి పరిణామాల తర్వాత విచారణ జరిపిన అసెంబ్లీ స్పీకర్‌… వాళ్ళంతా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలని, పార్టీ మారినట్టు సరైన ఆధారాలు లేవని తేల్చేశాక ఆ చర్చ ఆగిపోయింది. ఇప్పుడిక వాళ్ళలో కొందరి వైఖరి గురించి మరో రకమైన డిస్కషన్స్‌ మొదలయ్యాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఈ లిస్ట్‌ టాప్‌లో ఉన్నారు. ఆయన పార్టీ మారడంతో పాటు ఏకంగా కాంగ్రెస్‌ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు కూడా. అప్పటి నుంచి బీఆర్ఎస్‌కు పూర్తి దూరంగా ఉన్నారు. అప్పట్లో అవకాశం వచ్చినప్పుడల్లా గులాబీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు చేశారు కూడా.

అయితే ఇప్పుడు సడన్‌గా ఆయన వైఖరిలో మార్పు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. కేసీఆర్‌, కేటీఆర్‌ను పొగడ్తల్లో ముంచెత్తడమేగాక… గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి పనులు చేసిందంటూ వెనుకేసుకొచ్చారు. అదే ఊపులో మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని కూడా ఏకరువు పెట్టారు దానం. సరిగ్గా ఇక్కడే సరికొత్త అనుమానాలు మొదలయ్యాయి. దానం నాగేందర్ ఒక్కసారిగా స్వరం మార్చడంపై అటు గులాబీ వర్గాల్లో సైతం హాట్‌ హాట్‌ చర్చలు జరుగుతున్నాయట. ఇప్పటికిప్పుడు ఆయన పార్టీ పెద్దల్ని పొగడాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించుకుంటూ… ఎవరికి వారు తమదైన శైలిలో సమాధానాలు రాబట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన కొందరు గులాబీ నేతలైతే కాస్త చొరవచేసి అధిష్టానం దగ్గర ఈ విషయం గురించి వాకబు చేసినట్టు సమాచారం.

నాగేందర్ మళ్లీ కారెక్కబోతున్నారా ఏంటి? అంటూ ఆన్సర్ కోసం ప్రయత్నించినట్టు తెలిసింది. అందుకు అట్నుంచి వచ్చిన సమాధానం విని కొంత శాంతించారట ఖైరతాబాద్‌ బీఆర్‌ఎస్‌ లీడర్స్‌. దానంకు రెండు నెలల నుంచి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకడం లేదని… పైగా ఆయన అడిగిన పనులు కూడా జరగడంలేదని.. అందుకే, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు మనోళ్ళని పొగిడే కార్యక్రమం పెట్టుకున్నారని తెలంగాణ భవన్‌ నుంచి సమాచారం అందినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే దారిలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి విషయంలో కూడా ప్రచారం జరుగుతోంది. ఆయన సైతం తిరిగి గులాబీ చూపులు చూస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ వార్తలను కూడా బీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా ఖండించినా… అధిష్టానానికి పొగడ్తలపై మాత్రం నేతలకు అనుమానాలు తీరడం లేదట. అయితే… ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీద వత్తిడి పెంచి అవసరాలు తీర్చుకోవడం కోసం తమను వాడుకుంటున్నారన్నది బీఆర్‌ఎస్‌ పెద్దల ఉద్దేశ్యంగా చెబుతున్నారు.

 

ఒకవేళ వాళ్ళు వస్తామన్నా సరే…. ఇప్పటికిప్పుడు ద్వారాలు తెరిచి రెడ్‌ కార్పెట్‌ పరిచే పరిస్థితి లేదని ఆయా నియోజకవర్గాల కార్యకర్తలకు పార్టీ పెద్దలు సర్ది చెప్పినట్టు తెలిసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఆ మధ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్‌. ముందు ఆ పది మందితో రాజీనామా చేయించండి… ఉప ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామంటూ సవాల్ విసిరారాయన. ఆ సవాల్‌తో సదరు శాసనసభ్యుల మీద గుర్రుగానే ఉన్నామన్న సంకేతం పంపినట్టయిందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ పరిస్థితుల్లో ఈ ఇద్దరూ…. నిజంగానే తిరిగి కారెక్కాలని అనుకుంటున్నారా? లేక బీఆర్‌ఎస్‌ అధిష్టానం కేడర్‌కు చెబుతున్నట్టు కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద వత్తిడి తేవడానికేనా అన్నది తేలాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందేనన్నది పొలిటికల్ వాయిస్‌.