పేదోడి గొంతుక మూగబోతోందా..? లేక స్వరం మారుతోందా? ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఎగిరే ఎర్రజెండా రెపరెపలు ఆ ఊళ్ళో ఎందుకు కనిపించలేదు? అదీకూడా….. రెడ్ అడ్డాగా పేరున్న చోట అస్సలు కనిపించకపోవడానికి, మాట వినిపించకపోవడానికి కారణాలేంటి? కమ్యూనిస్టుల్లో పోరాట స్ఫూర్తి కొరవడిందా? లేక అంతకు మించిన వేరే కారణాలున్నాయా? ఎక్కడ, ఏం జరిగింది? అందులో లెఫ్ట్ పార్టీల ప్రస్తావన ఎందుకు వచ్చింది? దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నది సామెత అయితే….. తూచ్, అదేం కాదు. మేమే దిక్కు అంటారు కమ్యూనిస్ట్‌లు. అందుకు తగ్గట్టే… సీపీఐగాని, సీపీఎంగాని పేదలకు అన్యాయం జరిగినప్పుడల్లా పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిన సందర్భాలు కోకొల్లలు. ఎర్రజెండా ఉంటే కొండంత అండ అన్నట్టు భావిస్తుంటారు బాధితులు. కానీ… ఇప్పుడు ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ ఘటన ఆ అభిప్రాయాన్ని మార్చుకునేలా చేస్తోందా అన్న చర్చలు మొదలయ్యాయి. ప్రభుత్వ భూమిలో నిరుపేదలు వేసుకున్న వందలాది గుడిసెల్ని, అదీ ఏళ్ళ తరబడి ఉన్న వాటిని నిలువునా కూల్చేస్తుంటే… అదే జిల్లాలో బలంగా ఉన్న లెఫ్ట్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఎర్రన్నా… యాడబోయినవ్ అంటూ బాధితులు వేసే ప్రశ్నకు సమాధానమే కరవైందట. దీంతో… ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు అధికార పక్షంతో కుమ్మక్కయ్యాయా అన్న సందేహాలు సైతం వస్తున్నాయట. లెఫ్ట్ పార్టీలేంటి..? ప్రత్యేకించి ఖమ్మం లాంటి చోట భూ నిర్వాసితులకు అండగా నిలబడకపోవడం ఏంటన్న ప్రశ్నకు ఎంత ప్రయత్నించినా సమాధానం దొరకడం లేదని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఖమ్మం టౌన్‌కు అతి సమీపంలోనే జరుగుతోంది ఈ వ్యవహారం.
ఆక్రమణలకు గురువుతున్న, కొందరు బడా బాబులు తప్పుడు రిజిస్ర్టేషన్ పత్రాలతో అవి మా భూములేనని క్లెయిమ్ చేసుకుంటున్న చోటే జరుగుతోంది ఈ వ్యవహారం. పైగా ఇక్కడ ఈ భూదాన్ భూముల్లో గుడిసెలు వేయించింది కూడా మరో లెఫ్ట్ పార్టీనే. UCCRIML గ్రామీణ పేదల సంఘం… తరపున నిరుపేదలు అంతా కలిసి 2018లో ఇక్కడ గుడిసెలు వేసుకున్నారు. వాటి మధ్యనే తమ కష్టార్జితంలో నుంచి రూపాయి రూపాయి పోగేసుకుని సొంతగా రోడ్లు వేసుకున్నారు. ప్రభుత్వమే ఇక్కడ కరెంట్ కనెక్షన్లు మంజూరు చేసింది. ఎనిమిదేళ్ల కాలంలో కొన్ని గుడిసెలు ఇళ్ళు అయ్యాయి కూడా. ఇంతా జరుగుతున్నప్పుడు కామ్ కళ్ళు మూసుకున్న, లేదా మూసుకున్నట్టు నటించిన అధికార యంత్రాంగం ఇప్పుడు సడన్ వచ్చి కూల్చేయడం, లెఫ్ట్ పార్టీలేవీ దాంతో మాకు సంబంధం లేదన్నట్టుగా ఉండటం చర్చనీయాంశం అవుతోంది. ఉన్నట్టుండి సడన్‌గా ఈ కూల్చివేతలేంటని అంటే… కొంతకాలంగా అక్కడ భూమి విలువ పెరుగుతోందన్నదే సమాధానం. మొత్తం 30 ఎకరాల స్థలంలో అదీకూడా భూదాన్ భూమిలోనే గుడిసెలు వేసుకున్నారు పేదలు. కానీ… ఆక్రమ దారులు మాత్రం 60 ఎకరాలని వాదిస్తున్నారట. గవర్నమెంట్ రికార్డుల్లో 31 ఎకరాలని స్పష్టంగా ఉంటే… ఈ 60 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మాటల వెనకున్న మతలబేంటని అడుగుతున్నారు ఇక్కడి పేదలు. కొంత మంది పెద్దోళ్ళు ఇక్కడ రియలెస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నారని, ఆ బిజినెస్‌కు ఈ భూదాన్ భూములు, అందులో ఉన్న ఇళ్లు, గుడిసెలు అడ్డుగా మారినందునే… కొత్త కొత్త లెక్కలు తెరమీదికి వస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
కూల్చివేతలు కూడా ఆ గేమ్‌లో భాగమేనని అంటున్నారు. గతంలో బీఆర్‌ఎస్ హయాంలోనే ఒకసారి ఇలాంటి ప్రయత్నం జరిగినా సక్సెస్ అవలేదని, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఆ పనిని విజయవంతంగా చేసేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇదే ప్రభుత్వంలో చాలా మందికి 58, 59 జీవోల కింద భూములను క్రమబద్దీకరించారు. కానీ… పేదల విషయంలోనే వివక్ష అన్న అభిప్రాయం పెరుగుతోంది. అసలు ఖమ్మం జిల్లా రాజకీయం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కమ్యూనిస్టు పార్టీలే. భూ పోరాటాలు చేసి పేదల కోసం సాధించి పెట్టిన ఇక్కడి చాలా కాలనీలు, బస్తీలకు ఆయా పార్టీల నాయకుల పేర్లు పెట్టుకున్నారు కూడా. అలాంటి చోట 8ఏళ్ళుగా ఇళ్ళు కట్టుకుని ఉంటున్న వాళ్ళని రోడ్డునపడేస్తే… సీపీఐగాని, సీపీఎంగాని, ఎంఎల్ పార్టీలుగానీ… ఎందుకు స్పందించడం లేదన్నది బిగ్ క్వశ్చన్. చివరికి అప్పట్లో ఇక్కడ గుడిసెలు వేయించిన పార్టీ కూడా రియాక్ట్ అవకపోవడం ఏంటో అర్ధం కావం లేదంటున్నారు. అసలు ఎవరూ రాకుంటే బాగోదన్నట్టుగా మొక్కుబడిగా నలుగుర్ని పంపి పోలీసులతో అరెస్ట్ చేయించారన్న విమర్శలు సైతం ఉన్నాయి. వీటి చుట్టూ కొందరు ప్రజాప్రతినిధులు, వారి బంధువుల భూములు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ తర్వాత, కొన్ని కొత్త డౌట్స్ వస్తున్నాయంటున్నారు పరిశీలకులు. కమ్యూనిస్టుల్లో పోరాట పటిమ తగ్గిందా? వాళ్ళు పీడిత ప్రజలకు దూరం అవుతున్నారా? లాంటి ప్రశ్నలకు ఎర్రన్నలే సమాధానం చెప్పాలి.
